20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు


అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు
ఏవిధమైన అప్పైనా చేయవచ్చని కేంద్ర ఆర్ధికమంత్రి సెలవిచ్చారు.పోయిన ఎలక్షన్లప్పుడే  ఒకవ్యక్తి ఎన్నికలఖర్చులకోసం బ్యాంకు అప్పు అడిగాడు.ఇప్పుడు మంత్రిగారి ప్రకటనతో అప్పులడిగేవాళ్ళు రెచ్చిపోతారేమోనని బ్యాంకుల మేనేజర్లు భయపడిపోతున్నారు.మిగతా బ్యాంకుల్లో చేసిన పాత అప్పులు తీర్చటానికి అప్పులు అడుగుదామని కొందరు సమాయత్తమౌతున్నారు.అప్పులు చేసి ఎగ్గొట్టి పారిపోటానికి విజయమాల్యా,నీరవ మోడీ లను ఆదర్శంగా తీసుకొని కొందరు ప్లాన్లు వేస్తున్నారు.అప్పులు వసూలు చేసుకోలేక కొందరు,అప్పులు తీర్చలేక ఎందరో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.అప్పు చేసయినా  సరే నిప్పంటి సారా తాగాలి అనే దేశనాయకులకు ఇవేమీ పట్టవు.
అప్పిచ్చే వాడు, వైద్యుడు, ఎప్పుడూ ఎడతెగకుండా పారే ఏరూ, ద్విజుడూ ఉన్న ఊళ్ళో మాత్రమే ఉండమని ఒక మతిమంతుడు సలహా ఇస్తాడు. ఎందుకంటే తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేనప్పుడు, అప్పు ఇచ్చినవాడు పట్టుకొని అప్పచ్చి అయ్యేలా చితకబాదితే, తగిలిన దెబ్బలు నయం చేయటానికి వైద్యుడు కావాలట. జరిగిన అవమానం భరించలేక వైద్యుడి  దగ్గరకు కూడా వెళ్ళటానికి మనసొప్పకపోతే దూకి చచ్చిపోటానికి, దూరంగా కొట్టుకుపోటానికి అలా ఎప్పుడూ రాత్రిమ్ బగళ్ళు ఎడతెగకుండా పారే ఏరు ఉండాలట. ఒకవేళ దూకినప్పుడు ఎవరైనా చూచి ఒడ్డుకు చేర్చి వైద్యుడి  దగ్గరికి తీసికెళ్ళినా బ్రతక్కపోతే లేక దూకి చచ్చినాక శవమై దొరికితే అంత్యక్రియలు జరపటానికి ద్విజుడు కావాలట. మరి ఇంత ముందు చూపుతో సలహా ఇచ్చిన మహనీయుడెవరో గాని మహా అప్పారావే అయ్యుంటాడు.
అప్పిచ్చి చూడు, ఆడపిల్లనిచ్చి చూడు అన్నారు. అప్పు చెయ్యటమే గాని తీర్చటం ఎరుగని వాడికి వైద్యుడు ఏ మందు వేసీ బాగు చేయలేడు. అప్పులిచ్చిన వాళ్ళు ఏరులాగా ఎదురైనా వాడు ఎదురీది గెలుస్తాడు. అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు, అప్పు లేకపోవటమే ఐశ్వర్యం అని చెప్పటానికొచ్చిన ద్విజుడికి కూడా అప్పు చేసి పప్పు దప్పళం లాగించమని తప్పుడు పాఠాలు చెబుతాడు. అప్పు ఎలా ఎగ్గొట్టాలో, అప్పులిచ్చిన వాళ్ళ నుండి ఎదురయ్యే ముప్పులు ఎలా తప్పించుకోవాలో సవివరంగాఅప్పుల అప్పారావు సినిమాలో  బోధిస్తాడు. అప్పుపత్రానికి ఆన్సర్ ఉందిగాని చేబదులుకుందా ? అంటాడు. అప్పు ఎగ్గొట్టటం తప్పురా అని చెబితే ఫలానా వాడి అప్పు తీర్చటం కోసం ఇంకో అప్పు ఇవ్వమంటాడు. ఆ అప్పుల కాపును ఒప్పించటంకంటే తప్పించుకు తిరగటమే గొప్ప పని. అసలు వాడి ముఖం కూడా అప్పు తీసుకునేటప్పుడు అమృత పానం చేస్తున్నట్లు, అప్పు తీర్చే సమయంలో రక్తదానం చేస్తున్నట్లుగా మారిపోతుంది.
తప్పించుకు తిరగటం అంటే గుర్తుకొచ్చింది. అప్పిచ్చే వాడొకడు ఊళ్ళో ఉండి తీరాలని సెలవిచ్చిన అప్పారావే అప్పు తీర్చలేకపోతే తప్పించుకు తిరగమని బోధించాడు. అది కూడా ఎలా ? అప్పిచ్చిన వాణ్ణి నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండానట. అది ఎలా సాధ్యం అని చప్పరించకండి. అప్పిచ్చిన వాడికి సదా కనబడుతూ నేనిప్పట్లో నీ రుణం తీర్చలేను బాబాయ్ అని చెప్పుతూ పోతుంటే వాడు తప్పని సరిగా బాధపడతాడు. చెప్పు తీసుకొని కొట్ట లేనంత సాధు స్వభావుడైతే పెద్దమనుషుల్లోకి లాగుతాననో, కోర్టు కీడుస్తాననో చెబుతాడు. అది ఇద్దరికీ బాధేగదా ? సరే ఒకవేళ అతని అప్పు తీరుస్తానని మాట ఇద్దామా ఆంటే ఇంకో చోట అప్పు (రుణార్ణము) చెయ్యాలి. ఇప్పటికే అయ్య సంగతి ఊళ్ళో గుప్పుమని ఉప్పుకల్లు కూడా పుట్టని రోత పరిస్థితి ఉత్పన్నమైనందున ఈ పని తప్పకుండా తనకు బాధాకరమే అవుతుంది. అందుకే అప్పిచ్చినవాడు ఆ వీధి గుండా వస్తుంటే ఈ వీధి గుండా పరుగెత్తి మాయమైపోవటం మంచి పని అని అప్పారావు గారి అభిప్రాయం. అలా వీధులు మారుస్తుంటే అప్పు అడగటానికి కొత్త కాపులెవరైనా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందట.
అప్పు ఇచ్చి అవతలి వీధి అరుగు మీద కాచుకుని కూచున్న అప్పన్న దీక్షితుల వారు దగ్గరకు పిలిచి ఏమోయ్ అప్పారావ్ ఏదన్నా గొప్ప సంగతి ఉంటే చెప్పవోయ్ ఆంటే అన్ని దానాలలోకెల్లా అప్పు దానం(నీళ్ళువ దులుకోవటం) మేలుఅంటాడు. వీడికి తోడు బోయిన మరో అప్పారావు ఎదురై ఏమిటీ చెయ్యటం ఆంటే అన్ని దానాలలోకెల్లా నిదానం శ్రేష్టంఅంటాడు. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా పాట రాసినాయనకూడా ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా,అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా అన్నాడు.అప్పటినుండి ఈ అప్పుల పురాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

రాణివాసం వచ్చి మూలవాసం పీకినట్లుగా ఉండకూడదని అప్పులు,మాంద్యం మీద ఆర్ధిక వేత్తలు  సలహాలిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదని కేసీఆర్ అసెంబ్లీ లో అన్నారు. దేశమే 82 లక్షల కోట్లు అప్పులు చేసిందని,21 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ర్టాలు పాలన కొనసాగిస్తున్నాయా? మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగం. అభివృద్ధి చెందుతున్న అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి.అని కేసీఆర్ కూడా నిర్మలా సీతారామన్ కు వంతపాడుతూ ప్రతిపక్షాల నోరు మూయించారు.అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు చూపుతున్నాయట.ఈ మర్మమేమిటో మనవాళ్ళూ గ్రహించాలి.
--- నూర్ బాషా రహంతుల్లా

విశ్రాంత డిప్యూటీ కలక్టర్ 6301493266 
 https://www.facebook.com/photo.php?fbid=2675417732490200&set=a.233025936729404&type=3&theater

17, సెప్టెంబర్ 2019, మంగళవారం

చావుకే చావొస్తే ?

చావుకే  చావొస్తే ?
ఈ ఏడు మరణం చాలామందిని లాక్కెళ్ళింది. గత 9 నెలల్లోనే  విజయ బాపినీడు,అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్,జగనాధ మిశ్రా,జయపాల్ రెడ్డి, షీలా దీక్షిత్, విజయనిర్మల, గిరీష్ కర్నాడ్,జార్జ్ ఫెర్నాండెజ్,కోడెల శివప్రసాదరావు, ఇంకా మన దృష్టికిరాని ఎందరో ప్రముఖులు చనిపోయారు. క్యాన్సర్ తో కొందరు,ఆత్మహత్య చేసుకొని కొందరు,కోమాలో  కొందరు,ప్రమాదాలలో కొందరు,ఏదో ఒక రూపంలో ఈ జీవిత సాగరాన్ని దాటారు.మరణానికి ఎన్నో రూపాలు ఉన్నా  ఆత్మహత్య రూపంలో పొందిన ఇచ్చామరణాన్ని ,బలవన్మరణాన్ని, మనిషి సరైన మరణంగా అంగీకరించలేడు.పైగా మహా మృత్యుంజయ మంత్రాన్ని రోగి చెవిలో చెప్పీ చెప్పీ బ్రతికించాలని ప్రయోగాలు చేస్తున్నారు .
మన మత ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను మహాపాతకంగా వర్ణిస్తాయి. అది ఎందుకు మహాపాతకమో చెప్పమంటే మత గ్రంధాలలో అలా ఉంది కాబట్టి పాతకమే అంటారు.ఆత్మహత్య అంటే  ఇచ్ఛా మరణమే. పూర్వం  ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి బ్రతికినవారిపై కేసులు పెట్టేవారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరం కాదు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది.పురాణాల్లో మరణం లేకుండా వరాలు అడిగారు.కానీ ఇప్పుడు ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఇచ్చామరణమైనా,బలవన్మరణమైనా రెండూ మరణాలే.ఆత్మహత్యలకు ఎన్నో కారణాలున్నాయి.
ఏసుక్రీస్తును శిలువపై బలి ఇచ్చారు.ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆత్మ,హత్య అనే ప్రసక్తి రాలేదు. అయితే ఆత్మహత్యలను ఆపటానికే బతికియున్న శుభములు బడయవచ్చు , బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు,చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు,చచ్చి ఏం సాధిస్తావు? లాంటి మాటలు పెట్టుకున్నారు పెద్దలు.చావునుకోరే కొందరు జ్నానులు మాత్రం చావే నయం,చావంటే మోక్షం.చావంటే శరీరమనే పంజరం నుండి ఆత్మకు విడుదల. చావువల్ల చావని ఆత్మకు విడుదల.చావు వచ్చినందుకు సంతసించాలి.ఏడుస్తారు ఎందుకో వెర్రివాళ్ళు అని ఆశ్చర్యపరుస్తున్నారు కొందరు వేదాంతులు.పైగా విషంతాగి,ఉరివేసుకొని,రైలుకిందపడి,శరీరాన్ని హింసించుకొని చావనక్కరలేదు.ఎంచక్కా  భీష్మాచార్యుడి  లాగా మనం కోరుకున్న సమయానికి బాధలేని సునాయాసంగా ఇచ్చామరణం పొందవచ్చు అని కొందరు అంపశయ్యాసనాలు ప్రతిపాదిస్తున్నారు.కొంతమంది వివేకానంద స్వామి మార్గంలో వెళితే కపాలమోక్షం పొందవచ్చని,పోతులూరి వీర బ్రహ్మగారి లాగా సజీవ సమాధి అయితే ఏకంగా వీరభోగవసంతరాయుడి  పరంపరలో అవతరించవచ్చనీ కలలు కనిపిస్తున్నారు. మొత్తం మీద చాలామంది బాధలేకుండా చనిపోవాలని కోరుకుంటున్నారు.అటువంటి సునాయాసమరణం పొందగల తెలివితేటలు డాక్టర్లకే సాధ్యమనే నమ్మకంతో వారిచావుల వైనం వైపు చూస్తున్నారు గానీ వాళ్ళుకూడా విషపు ఇంజక్షను,ఉరి,లాంటి మామూలు జనం వాడే పద్ధతుల్నే వాడుతుండేటప్పటికి  చూశారా? డాక్టర్లు కూడా నొప్పిలేని మరణాన్ని ఇంతవరకూ కనుక్కోలేకపోయారు,మరణం మనిషి చేతిలో లేదు.దేవుడు అనుమతిస్తేనే మనిషి చస్తాడు తెలుసా? అంటున్నారు.ఉమాసుందరి సినిమాలో ఎన్టీఆర్ తో నాగభూషణంలాగా  వెర్రివాడా నీ చేతిలో ఏముంది?అంతా మాయ.నువ్వుచావాలనుకున్నా చావలేవు అంటారు. అబ్బబ్బ నాచావుకు నీ అడ్డేమిటి? అంటే  మళ్ళీ తప్పుదారిలో పడిపోతున్నావు తమ్ముడూ,శివాజ్నలేనిదే చీమైనా కుట్టదు అని హితోపదేశం చేస్తారు. 

ధ్యానంసర్వరోగనివారిణి,ధ్యానం వల్ల ముసలితనం రాదు,ఇష్టమొచ్చినన్నాళ్ళు యవ్వనుల్లా  బ్రతకొచ్చు.మీకు ఎంతకావాలంటే అంత ఆయుష్షు ,జరామరణాలు ధ్యానం చేతిలో ఉన్నాయి అని కొందరు స్వాములు చెబుతుంటే వాళ్ళ దగ్గర ఒక రాజకీయ నాయకుడు చేరాడట. ధ్యానం తో భావోద్రేకాల మీద నియంత్రణ వస్తుందనీ ఎవరేమి తిట్టినా కుంగిపోరనీ ఆత్మహత్య చేసుకోరనే బోధవిని కఠోర  ధ్యానం చేసి దాని  ప్రభావంతో  ప్రత్యర్ధులు తిట్టినా రెచ్చిపోక ,అభిమానులు పూలదండలేసి పాదపూజలు చేసినా పొంగిపోక సూక్ష్మశరీరియై  ఆత్మలాగా త్రిలోక సంచారం చేస్తూ బ్రహ్మానందాన్ని పొందాడట. గత జన్మలలోకి వెళ్ళి తానెవరో చూసుకున్నాడట. ఇక అప్పుడు ఈ జరాదుఖాలతో కూడిన మానవ లోకం కంటే  ఆత్మల లోకమే  బాగుంది.అక్కడైతే నాకు శత్రువులుండరు,ఓటర్లకు సారాయి పోయించనక్కరలేదు,ఇంతమంది చేత ఇన్ని తిట్లు తిననక్కరలేదు. ఆ స్వర్గలోకంలోకి నన్ను పంపిస్తావా గురుదేవా అని అడిగాడట. ధ్యానమనేది బొందితో స్వర్గంనాయనా,నీవు శరీరంతో ఇక్కడే ధ్యానం చేస్తూ  సూక్ష్మరూపంలో స్వర్గానికెళ్ళి అక్కడ విహరించటం నయంకదా? అయినా కాయాన్ని వదలటానికి పరమాత్మ నిర్దేశించిన కాలంవరకు ఇక్కడ బ్రతకవలసిందే చనిపోకూడదు అన్నాడు గురువు.చచ్చి స్వర్గానికెళ్ళాలి అనే కోరిక ఎలా తీరాలి? చావటంకూడా పెద్దపనే.అదంత తేలికగాలేదు.చచ్చినట్లు కలగన్నా ధ్యానం చేసినా మేలుకోక తప్పటంలేదు.చావాలని సన్యాసం తీసుకున్నా గంతా బొంతా  కలిపి గాడిద మోతంత అవుతుందట.ఇప్పుడు అసలే కార్పోరేట్ సన్యాసమాయే!మాకు చావెట్లా వస్తుంది దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు.తేలికగా చచ్చిపోలేని బ్రతుకులో ఇరికించి తీరుబడిగా చంపుతున్నందుకు దేవుణ్ణి తిట్టిపోస్తున్నారుకూడా.తరువాత అయ్యో తిట్టానని కోపపడమాకు స్వామీ అని బ్రతిమిలాడుకుంటున్నారు.మొత్తానికి జీవుల మోక్షం దేవుడి ప్రాణానికొచ్చినట్లుంది.పైగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు కానీజరుగుతున్న సంఘటనలు చూస్తే  రెండూఉన్నాయనిపిస్తోంది.హత్య చేసినవారూ,హత్యకు గురైనవారూ,ఆత్మహత్య చేసుకున్నవారూ,ఆత్మహత్యకు ప్రేరేపించినవారూ,పదునైన విమర్శలతో అవతలివాళ్ళను ఎండగట్టినవాళ్ళూ, తట్టుకోలేక ఎండిపోయినవాళ్ళూ,ఏదోరకంగా,రకరకాలుగా మనుషులు కడతేరుతూ,కడతేరుస్తూనే ఉన్నారు.అన్యాయంగా హత్యకు గురైన వాళ్ళకు,తగిలిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకైనా ముక్తి మోక్షం వచ్చాయో లేదో వస్తాయో లేదో ఎవరికీ తెలియదు.పేదవాడిని చచ్చేదాకా వైద్యుడు వదలటం లేదు,చచ్చాక బాకీలు వదలటం లేదు.కోమాలో ఉన్నరోగులకు సేవ చేయలేక, వారి అవస్థ చూడలేక  కన్నబిడ్డలే అమ్మా చచ్చిపోవే అనుకుంటున్నారు.ఈ చావుకే చావొస్తే బాగుండు!

---నూర్ బాషా రహంతుల్లా,విశ్రాంత డిప్యూటీ కలక్టర్,6301493266

 https://anchor.fm/nalinimohankumar-kalva/episodes/ep-e5eato?fbclid=IwAR0trlCwrQpDGSe89Bnr0SUJxIoKZ17DT8jwOLNB3A0Vfm0RLZTYbNArVLQ