20, సెప్టెంబర్ 2019, శుక్రవారం

అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు


అప్పిచ్చి చూడు అప్పు చేసి చూడు
ఏవిధమైన అప్పైనా చేయవచ్చని కేంద్ర ఆర్ధికమంత్రి సెలవిచ్చారు.పోయిన ఎలక్షన్లప్పుడే  ఒకవ్యక్తి ఎన్నికలఖర్చులకోసం బ్యాంకు అప్పు అడిగాడు.ఇప్పుడు మంత్రిగారి ప్రకటనతో అప్పులడిగేవాళ్ళు రెచ్చిపోతారేమోనని బ్యాంకుల మేనేజర్లు భయపడిపోతున్నారు.మిగతా బ్యాంకుల్లో చేసిన పాత అప్పులు తీర్చటానికి అప్పులు అడుగుదామని కొందరు సమాయత్తమౌతున్నారు.అప్పులు చేసి ఎగ్గొట్టి పారిపోటానికి విజయమాల్యా,నీరవ మోడీ లను ఆదర్శంగా తీసుకొని కొందరు ప్లాన్లు వేస్తున్నారు.అప్పులు వసూలు చేసుకోలేక కొందరు,అప్పులు తీర్చలేక ఎందరో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు.అప్పు చేసయినా  సరే నిప్పంటి సారా తాగాలి అనే దేశనాయకులకు ఇవేమీ పట్టవు.
అప్పిచ్చే వాడు, వైద్యుడు, ఎప్పుడూ ఎడతెగకుండా పారే ఏరూ, ద్విజుడూ ఉన్న ఊళ్ళో మాత్రమే ఉండమని ఒక మతిమంతుడు సలహా ఇస్తాడు. ఎందుకంటే తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేనప్పుడు, అప్పు ఇచ్చినవాడు పట్టుకొని అప్పచ్చి అయ్యేలా చితకబాదితే, తగిలిన దెబ్బలు నయం చేయటానికి వైద్యుడు కావాలట. జరిగిన అవమానం భరించలేక వైద్యుడి  దగ్గరకు కూడా వెళ్ళటానికి మనసొప్పకపోతే దూకి చచ్చిపోటానికి, దూరంగా కొట్టుకుపోటానికి అలా ఎప్పుడూ రాత్రిమ్ బగళ్ళు ఎడతెగకుండా పారే ఏరు ఉండాలట. ఒకవేళ దూకినప్పుడు ఎవరైనా చూచి ఒడ్డుకు చేర్చి వైద్యుడి  దగ్గరికి తీసికెళ్ళినా బ్రతక్కపోతే లేక దూకి చచ్చినాక శవమై దొరికితే అంత్యక్రియలు జరపటానికి ద్విజుడు కావాలట. మరి ఇంత ముందు చూపుతో సలహా ఇచ్చిన మహనీయుడెవరో గాని మహా అప్పారావే అయ్యుంటాడు.
అప్పిచ్చి చూడు, ఆడపిల్లనిచ్చి చూడు అన్నారు. అప్పు చెయ్యటమే గాని తీర్చటం ఎరుగని వాడికి వైద్యుడు ఏ మందు వేసీ బాగు చేయలేడు. అప్పులిచ్చిన వాళ్ళు ఏరులాగా ఎదురైనా వాడు ఎదురీది గెలుస్తాడు. అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు, అప్పు లేకపోవటమే ఐశ్వర్యం అని చెప్పటానికొచ్చిన ద్విజుడికి కూడా అప్పు చేసి పప్పు దప్పళం లాగించమని తప్పుడు పాఠాలు చెబుతాడు. అప్పు ఎలా ఎగ్గొట్టాలో, అప్పులిచ్చిన వాళ్ళ నుండి ఎదురయ్యే ముప్పులు ఎలా తప్పించుకోవాలో సవివరంగాఅప్పుల అప్పారావు సినిమాలో  బోధిస్తాడు. అప్పుపత్రానికి ఆన్సర్ ఉందిగాని చేబదులుకుందా ? అంటాడు. అప్పు ఎగ్గొట్టటం తప్పురా అని చెబితే ఫలానా వాడి అప్పు తీర్చటం కోసం ఇంకో అప్పు ఇవ్వమంటాడు. ఆ అప్పుల కాపును ఒప్పించటంకంటే తప్పించుకు తిరగటమే గొప్ప పని. అసలు వాడి ముఖం కూడా అప్పు తీసుకునేటప్పుడు అమృత పానం చేస్తున్నట్లు, అప్పు తీర్చే సమయంలో రక్తదానం చేస్తున్నట్లుగా మారిపోతుంది.
తప్పించుకు తిరగటం అంటే గుర్తుకొచ్చింది. అప్పిచ్చే వాడొకడు ఊళ్ళో ఉండి తీరాలని సెలవిచ్చిన అప్పారావే అప్పు తీర్చలేకపోతే తప్పించుకు తిరగమని బోధించాడు. అది కూడా ఎలా ? అప్పిచ్చిన వాణ్ణి నొప్పించకుండా, తాను ఇబ్బంది పడకుండానట. అది ఎలా సాధ్యం అని చప్పరించకండి. అప్పిచ్చిన వాడికి సదా కనబడుతూ నేనిప్పట్లో నీ రుణం తీర్చలేను బాబాయ్ అని చెప్పుతూ పోతుంటే వాడు తప్పని సరిగా బాధపడతాడు. చెప్పు తీసుకొని కొట్ట లేనంత సాధు స్వభావుడైతే పెద్దమనుషుల్లోకి లాగుతాననో, కోర్టు కీడుస్తాననో చెబుతాడు. అది ఇద్దరికీ బాధేగదా ? సరే ఒకవేళ అతని అప్పు తీరుస్తానని మాట ఇద్దామా ఆంటే ఇంకో చోట అప్పు (రుణార్ణము) చెయ్యాలి. ఇప్పటికే అయ్య సంగతి ఊళ్ళో గుప్పుమని ఉప్పుకల్లు కూడా పుట్టని రోత పరిస్థితి ఉత్పన్నమైనందున ఈ పని తప్పకుండా తనకు బాధాకరమే అవుతుంది. అందుకే అప్పిచ్చినవాడు ఆ వీధి గుండా వస్తుంటే ఈ వీధి గుండా పరుగెత్తి మాయమైపోవటం మంచి పని అని అప్పారావు గారి అభిప్రాయం. అలా వీధులు మారుస్తుంటే అప్పు అడగటానికి కొత్త కాపులెవరైనా ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుందట.
అప్పు ఇచ్చి అవతలి వీధి అరుగు మీద కాచుకుని కూచున్న అప్పన్న దీక్షితుల వారు దగ్గరకు పిలిచి ఏమోయ్ అప్పారావ్ ఏదన్నా గొప్ప సంగతి ఉంటే చెప్పవోయ్ ఆంటే అన్ని దానాలలోకెల్లా అప్పు దానం(నీళ్ళువ దులుకోవటం) మేలుఅంటాడు. వీడికి తోడు బోయిన మరో అప్పారావు ఎదురై ఏమిటీ చెయ్యటం ఆంటే అన్ని దానాలలోకెల్లా నిదానం శ్రేష్టంఅంటాడు. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా పాట రాసినాయనకూడా ఉన్న చోట తెచ్చుకొనుట లేనివారి హక్కురా,అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా అన్నాడు.అప్పటినుండి ఈ అప్పుల పురాణం అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

రాణివాసం వచ్చి మూలవాసం పీకినట్లుగా ఉండకూడదని అప్పులు,మాంద్యం మీద ఆర్ధిక వేత్తలు  సలహాలిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అప్పులు చేయడం తప్పు కాదని కేసీఆర్ అసెంబ్లీ లో అన్నారు. దేశమే 82 లక్షల కోట్లు అప్పులు చేసిందని,21 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ అప్పులు చేయడం లేదా? అప్పులు చేయకుండానే ఆ రాష్ర్టాలు పాలన కొనసాగిస్తున్నాయా? మా పరిమితికి లోబడి అప్పులు చేస్తున్నాం. అప్పులు తీసుకోవడం బడ్జెట్‌లో భాగం. అభివృద్ధి చెందుతున్న అమెరికా, జపాన్ దేశాలు కూడా అప్పులు చేస్తున్నాయి.అని కేసీఆర్ కూడా నిర్మలా సీతారామన్ కు వంతపాడుతూ ప్రతిపక్షాల నోరు మూయించారు.అసలు కంటే వడ్డీ ముద్దన్నట్లు స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు చూపుతున్నాయట.ఈ మర్మమేమిటో మనవాళ్ళూ గ్రహించాలి.
--- నూర్ బాషా రహంతుల్లా

విశ్రాంత డిప్యూటీ కలక్టర్ 6301493266 
 https://www.facebook.com/photo.php?fbid=2675417732490200&set=a.233025936729404&type=3&theater

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి