చావుకే చావొస్తే ?
ఈ ఏడు మరణం చాలామందిని లాక్కెళ్ళింది. గత 9
నెలల్లోనే విజయ బాపినీడు,అరుణ్ జైట్లీ, సుష్మా
స్వరాజ్,జగనాధ మిశ్రా,జయపాల్ రెడ్డి, షీలా దీక్షిత్, విజయనిర్మల, గిరీష్
కర్నాడ్,జార్జ్ ఫెర్నాండెజ్,కోడెల
శివప్రసాదరావు, ఇంకా మన దృష్టికిరాని ఎందరో ప్రముఖులు
చనిపోయారు. క్యాన్సర్ తో కొందరు,ఆత్మహత్య చేసుకొని కొందరు,కోమాలో కొందరు,ప్రమాదాలలో కొందరు,ఏదో ఒక రూపంలో ఈ జీవిత సాగరాన్ని దాటారు.మరణానికి
ఎన్నో రూపాలు ఉన్నా ఆత్మహత్య రూపంలో
పొందిన ఇచ్చామరణాన్ని ,బలవన్మరణాన్ని, మనిషి
సరైన మరణంగా అంగీకరించలేడు.పైగా మహా మృత్యుంజయ మంత్రాన్ని రోగి చెవిలో చెప్పీ
చెప్పీ బ్రతికించాలని ప్రయోగాలు చేస్తున్నారు .
మన మత ధర్మ శాస్త్రాలు ఆత్మ హత్యను
మహాపాతకంగా వర్ణిస్తాయి. అది ఎందుకు మహాపాతకమో చెప్పమంటే మత గ్రంధాలలో అలా ఉంది
కాబట్టి పాతకమే అంటారు.ఆత్మహత్య అంటే ఇచ్ఛా
మరణమే. పూర్వం ఐ.పి.సి.309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నంచేసి
బ్రతికినవారిపై కేసులు పెట్టేవారు. సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారం ఆత్మహత్యాయత్నం
నేరం కాదు.తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు.
వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు అని న్యాయస్థానం స్పష్టం చేసింది.పురాణాల్లో
మరణం లేకుండా వరాలు అడిగారు.కానీ ఇప్పుడు ఏదో ఒక కారణంతో ఆత్మహత్యలు
చేసుకుంటున్నారు.ఇచ్చామరణమైనా,బలవన్మరణమైనా రెండూ మరణాలే.ఆత్మహత్యలకు ఎన్నో
కారణాలున్నాయి.
ఏసుక్రీస్తును
శిలువపై బలి ఇచ్చారు.ఆయన మృత్యుంజయుడు కాబట్టి ఆత్మ,హత్య అనే ప్రసక్తి రాలేదు. అయితే ఆత్మహత్యలను ఆపటానికే బతికియున్న శుభములు బడయవచ్చు , బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు,చచ్చిన సింహం కంటే బతికున్న కుక్క మేలు,చచ్చి ఏం
సాధిస్తావు? లాంటి మాటలు పెట్టుకున్నారు పెద్దలు.చావునుకోరే కొందరు
జ్నానులు మాత్రం చావే నయం,చావంటే మోక్షం.చావంటే శరీరమనే పంజరం
నుండి ఆత్మకు విడుదల. చావువల్ల చావని ఆత్మకు విడుదల.చావు వచ్చినందుకు
సంతసించాలి.ఏడుస్తారు ఎందుకో వెర్రివాళ్ళు అని ఆశ్చర్యపరుస్తున్నారు కొందరు
వేదాంతులు.పైగా విషంతాగి,ఉరివేసుకొని,రైలుకిందపడి,శరీరాన్ని హింసించుకొని చావనక్కరలేదు.ఎంచక్కా భీష్మాచార్యుడి లాగా మనం కోరుకున్న సమయానికి బాధలేని సునాయాసంగా
ఇచ్చామరణం పొందవచ్చు అని కొందరు అంపశయ్యాసనాలు ప్రతిపాదిస్తున్నారు.కొంతమంది
వివేకానంద స్వామి మార్గంలో వెళితే కపాలమోక్షం పొందవచ్చని,పోతులూరి
వీర బ్రహ్మగారి లాగా సజీవ సమాధి అయితే ఏకంగా వీరభోగవసంతరాయుడి పరంపరలో అవతరించవచ్చనీ కలలు కనిపిస్తున్నారు. మొత్తం
మీద చాలామంది బాధలేకుండా చనిపోవాలని కోరుకుంటున్నారు.అటువంటి సునాయాసమరణం పొందగల
తెలివితేటలు డాక్టర్లకే సాధ్యమనే నమ్మకంతో వారిచావుల వైనం వైపు చూస్తున్నారు గానీ వాళ్ళుకూడా
విషపు ఇంజక్షను,ఉరి,లాంటి మామూలు జనం
వాడే పద్ధతుల్నే వాడుతుండేటప్పటికి చూశారా? డాక్టర్లు కూడా నొప్పిలేని మరణాన్ని ఇంతవరకూ కనుక్కోలేకపోయారు,మరణం మనిషి చేతిలో లేదు.దేవుడు అనుమతిస్తేనే మనిషి చస్తాడు తెలుసా? అంటున్నారు.ఉమాసుందరి సినిమాలో ఎన్టీఆర్ తో నాగభూషణంలాగా వెర్రివాడా
నీ చేతిలో ఏముంది?అంతా
మాయ.నువ్వుచావాలనుకున్నా చావలేవు అంటారు. అబ్బబ్బ నాచావుకు నీ అడ్డేమిటి? అంటే మళ్ళీ తప్పుదారిలో
పడిపోతున్నావు తమ్ముడూ,శివాజ్నలేనిదే చీమైనా కుట్టదు అని
హితోపదేశం చేస్తారు.
ధ్యానంసర్వరోగనివారిణి,ధ్యానం వల్ల
ముసలితనం రాదు,ఇష్టమొచ్చినన్నాళ్ళు యవ్వనుల్లా బ్రతకొచ్చు.మీకు ఎంతకావాలంటే అంత ఆయుష్షు ,జరామరణాలు ధ్యానం చేతిలో ఉన్నాయి అని కొందరు స్వాములు చెబుతుంటే వాళ్ళ
దగ్గర ఒక రాజకీయ నాయకుడు చేరాడట. ధ్యానం తో భావోద్రేకాల మీద నియంత్రణ వస్తుందనీ
ఎవరేమి తిట్టినా కుంగిపోరనీ ఆత్మహత్య చేసుకోరనే బోధవిని కఠోర ధ్యానం చేసి దాని ప్రభావంతో
ప్రత్యర్ధులు తిట్టినా రెచ్చిపోక ,అభిమానులు
పూలదండలేసి పాదపూజలు చేసినా పొంగిపోక సూక్ష్మశరీరియై ఆత్మలాగా త్రిలోక సంచారం చేస్తూ బ్రహ్మానందాన్ని
పొందాడట. గత జన్మలలోకి వెళ్ళి తానెవరో చూసుకున్నాడట. ఇక అప్పుడు ఈ జరాదుఖాలతో
కూడిన మానవ లోకం కంటే ఆత్మల లోకమే బాగుంది.అక్కడైతే నాకు శత్రువులుండరు,ఓటర్లకు సారాయి పోయించనక్కరలేదు,ఇంతమంది చేత ఇన్ని
తిట్లు తిననక్కరలేదు. ఆ స్వర్గలోకంలోకి నన్ను పంపిస్తావా
గురుదేవా అని అడిగాడట. ధ్యానమనేది బొందితో స్వర్గంనాయనా,నీవు
శరీరంతో ఇక్కడే ధ్యానం చేస్తూ సూక్ష్మరూపంలో
స్వర్గానికెళ్ళి అక్కడ విహరించటం నయంకదా? అయినా కాయాన్ని
వదలటానికి పరమాత్మ నిర్దేశించిన కాలంవరకు ఇక్కడ బ్రతకవలసిందే చనిపోకూడదు అన్నాడు
గురువు.చచ్చి స్వర్గానికెళ్ళాలి అనే కోరిక ఎలా తీరాలి?
చావటంకూడా పెద్దపనే.అదంత తేలికగాలేదు.చచ్చినట్లు కలగన్నా ధ్యానం చేసినా మేలుకోక
తప్పటంలేదు.చావాలని సన్యాసం తీసుకున్నా గంతా బొంతా కలిపి గాడిద మోతంత అవుతుందట.ఇప్పుడు అసలే
కార్పోరేట్ సన్యాసమాయే!మాకు చావెట్లా వస్తుంది దేవుడా అని తలలు పట్టుకుంటున్నారు.తేలికగా చచ్చిపోలేని బ్రతుకులో ఇరికించి తీరుబడిగా చంపుతున్నందుకు
దేవుణ్ణి తిట్టిపోస్తున్నారుకూడా.తరువాత అయ్యో తిట్టానని కోపపడమాకు స్వామీ అని
బ్రతిమిలాడుకుంటున్నారు.మొత్తానికి జీవుల మోక్షం దేవుడి ప్రాణానికొచ్చినట్లుంది.పైగా రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటారు కానీజరుగుతున్న సంఘటనలు
చూస్తే రెండూఉన్నాయనిపిస్తోంది.హత్య
చేసినవారూ,హత్యకు గురైనవారూ,ఆత్మహత్య చేసుకున్నవారూ,ఆత్మహత్యకు ప్రేరేపించినవారూ,పదునైన విమర్శలతో అవతలివాళ్ళను ఎండగట్టినవాళ్ళూ,
తట్టుకోలేక ఎండిపోయినవాళ్ళూ,ఏదోరకంగా,రకరకాలుగా
మనుషులు కడతేరుతూ,కడతేరుస్తూనే ఉన్నారు.అన్యాయంగా హత్యకు
గురైన వాళ్ళకు,తగిలిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకున్న
వాళ్ళకైనా ముక్తి మోక్షం వచ్చాయో లేదో వస్తాయో లేదో ఎవరికీ తెలియదు.పేదవాడిని చచ్చేదాకా
వైద్యుడు వదలటం లేదు,చచ్చాక బాకీలు వదలటం లేదు.కోమాలో ఉన్నరోగులకు
సేవ చేయలేక, వారి అవస్థ చూడలేక కన్నబిడ్డలే అమ్మా చచ్చిపోవే అనుకుంటున్నారు.ఈ
చావుకే చావొస్తే బాగుండు!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి