అన్నదాతా ! దుఃఖీభవా !!
గీటురాయి 26-2-1988
“మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేద భూమిరా మన కీర్తి మంచుకొండరా
బంగారు భూమి మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాడైనా పాడు బ్రదర్”
అంటూ ఈ మధ్య రాజీవ్ గాంధీ రైతుల గురించి పాటలు పాడి పొయ్యారు. అప్పులు తీర్చలేని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ఎంత మంది చచ్చారో లెక్కలు తీసి పంపమని గవర్నరును పురమాయించారు.
రైతు క్షేమం రాజు భాగ్యం అన్నారు. అలాంటి రైతు పాడు గాను చేను బీడు గాను ఉండి. రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగిలేటట్లు లేదు. బూరుగ పండును నమ్ముకున్న చిలుకకు దూదే దక్కినట్లు రాజకీయ నాయకుల వలలో చిక్కిన రైతులకు రాని రాయితీలే దక్కాయి. బురదలో దిగబడ్డ ఏనుగును బొంత కాకి కూడా పొడిచినట్లుగా దరిద్రుడై పోయిన ఈ దేశపు అన్నదాతను ఒళ్ళువంచి చాకిరికి వంగని రాజకీయ వక్తలు పొడుచుకు తింటున్నారు. నలభై ఏళ్ళ స్వాతంత్ర్యం రైతులకు ఏమి తెచ్చిందీ అంటే ఆత్మహత్యలు, ఆకలిచావులు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరిగిన భారత కృషిక్ సమాజం మహాసభలు, ఈ సంబడానికేనా ఇంత ఆర్భాటం అనిపించాయి.’ఈ పొడుము పీల్చనీ నీ పాడె బిగిస్తాను’ అన్నట్లుగా సభలో పాల్గొన్న యోధానుయోధులు లేత సొరకాయ కోతలు కోసి వెళ్లారు. ఈకలు తోకలు దులిపి నూకల్లో కలిపినట్లుగా అర్ధం పర్థం లేని నిర్ణయాలు చేసి పొయ్యారు.
ఇక రాజీవ్ గాంధీ గారి వాలకం చూస్తే ‘ఇయ్యి’ అన్నది ఈ ఇంట లేదు ‘తే’ అన్నది మాకు తరతరాలుగా వస్తున్నది అన్నట్లున్నది. ఈత గింజ ఇచ్చి తాటి గింజ లాగాలని ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మాటలే వెల్లడించాయి.
రైతులకు గిట్టుబాటు ధరలు పెంచటం రైతులకే నష్టం అని రాజీవ్ సెలవిచ్చారు. ఎలాగ అని అడగొద్దు. ఆ మధ్య ఆడవాళ్ళకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించటం ఆడవాళ్లకే అవమానం అని ఆయన అన్నాడు గదా ! అలానే ఇది కూడా.
రాష్ట్రాలు నీటి పారుదల ప్రాజెక్టులు సత్వరంగా పూర్తి చెయ్యాలి అని ఆయన సెలవిచ్చారు. అనేక రాష్ట్రాలు తలపెట్టిన ప్రాజెక్టులకు ఆయన నిధులు కాదు గదా కనీసం అనుమతినైనా మంజూరు చేయలేదని కృషక సమాజం వాళ్ళు కనిపెట్టలేకపోయారు. గంగను కావేరితో కలుపు అని గర్జించలేకపోయారు.
వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని విషయం కాబట్టి కేంద్రం చేసేది ఏమీ లేదు. మేము రెక్కలు తెగిన పక్షులం అన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల
రేట్లు నిర్ణయించేది, ఎగుమతులు దిగుమతులు చేసేది కేంద్రమే కదండీ అని కృషిక్ సమాజ్ అడగలేకపోయింది.
విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఎగుమతుల కోసం 9000 కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తున్నాము అన్నారు రాజీవ్. అన్ని కోట్ల రూపాయల్ని ఎరువులు, పురుగు మందుల ఉత్పత్తి దారులు, కామందుల వార్లు స్వాహా చేస్తున్నారు. ఆ మొత్తాన్ని సన్నకారు రైతులకు, వ్యవసాయ కూలీలకు అందేలా వేరే పథకాలు ప్రవేశపెట్టండి అని కృషించిన సమాజం కోరలేకపోయింది.
దేశంలోని బడిపిల్లలందరికీ మధ్యాహ్న భోజనం పెడితే 800 కోట్లు, దేశంలోని పేద ప్రజలందరికీ కిలో రూపాయి చొప్పున గోధుమలు గాని బియ్యంగాని ఇవ్వటానికి 8000 కోట్లు ఖర్చు అవుతాయి. ఆ తొమ్మిది వేల కోట్లూ ఇటు మళ్ళిస్తే ఈ ఆకలి చావులుండవని ఎన్నో రైతు సంఘాలు (కృషిక్ కాదు) కోరితే రాజీవ్ గాంధీ వారి కోర్కెను నిరాకరించారు. చివరికి పంటల భీమా పధకాన్ని కూడా ఎత్తి వేయటానికి పూనుకున్నారు. ఇక వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ, గృహ నిర్మాణం, యాచకుల పునరాశ్రయం పేద రైతులకు వడ్డీ లేని ఋణాలు లాంటి పథకాలు ఎలా అనుమతిస్తారు ?
“నీవే దిక్కని వత్తురు పదవోయ్ – రోజులు మారాయ్ మారాయ్” అని నొక్కి చెప్పిన కొసరాజు గారిని నిలదీయటం కోసం కాబోలు పేద రైతులు ప్రయాణం కడుతున్నారు !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి