మేడి పండు బడ్జెట్
గీటురాయి 11-3-1988
మార్చి వస్తోందని మురిసిపోకండి (మూతి) పన్నులు జాగ్రత్త అని ముందుగానే చెప్పాను గదా ? బడ్జెట్ కు ముందే 2900 కోట్ల రూపాయల మేరకు ధరలు, పన్నులు, ఛార్జీలు పెంచారు. ఈ బడ్జెట్లో 1264 కోట్ల రూపాయలు కొత్త డ్యూటీలు విధించారు. అంటే మొత్తం 4164 కోట్ల రూపాయల ఆదాయం పెంచుకుని కేవలం 719 కోట్ల రాయితీలు ఇచ్చారు. సరే ఇంత చేసీ 7484 లోటు తేలిందీ అంటే సంవత్సరం మధ్యలో అది మన నెత్తిన పిడుగులాగా పడటం ఖాయమని తెలుస్తున్నది. అసలు పన్నులు వేయటానికి ఇక ఏమీ దొరక్కనో, లేక పన్నులు వేస్తే ప్రజలు ‘థూ’ అని ఊస్తారనో ఈ నెలకు మనల్ని వదిలేశారు.
ప్లాట్ ఫామ్ మీదకి పోతే రూపాయిన్నర, ఇన్ లాండ్ కావరు రాస్తే అర్ధరూపాయి కక్కమన్నారు. ఇంత లేకీతనంగా ప్రజల నెత్తిన ఏ ఏటి కాయేడు భారాలు మోపుతూ దొడ్డిదారిన లోటు పూడుస్తూ రాయితీలిచ్చామని చంకలు గుద్దుకుంటున్న కేంద్ర బడ్జెటు లోపల కంపు వెలుపల సొంపు ప్రదర్శిస్తున్నది. ఆసనంలో కారం రాసి విసనకర్రతో విసిరినట్లుగా ఉంది.
సరే, పొదుగెంత జారినా కుక్క గోవు కాదు అన్నారు. రైతులకు ప్రకటించిన రాయితీలు చూచి రాజీవ్ గారి బడ్జెట్ సలక్షణంగా శోభిల్లుతుందని చెప్పటానికి వీలు లేదు. దేశం మొత్తం మీద లక్షా డెబ్బై వేల పరిశ్రమలు ఖాయిలా పడి ఉన్నాయి. వడ్డీ శాపం నుండీ రైతులను పూర్తిగా విడిపించటానికి కేంద్రానికి ఇష్టం కాలేదు. 42 వేల కోట్ల రూపాయల ఆదాయంలో 17 శాతం వడ్డీ చెల్లింపులకే పోతున్నది. ఇప్పటి వరకు రక్షణ వ్యయం వడ్డీ చెల్లింపుల కంటే ఎక్కువగా ఉండేది. ఈ ఏడు వడ్డీ రక్షణ వ్యయాన్ని మించిపోయింది, రక్షణకు 13 వేలు. వడ్డీకి 14 వేల కోట్ల రూపాయలు. అంటే మొత్తం ఆదాయంలో 32 శాతం ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఏ దేశమైనా ఈ రెండు ఖర్చుల తోటే నాశనమైపోతున్నది. కానీ ఏం చేస్తాం ఈ విషవలయంలో అన్నీ దేశాలూ చిక్కుతున్నాయి. మద్దెలలోని ఎలుకలాగా ఉంది మన పరిస్థితి.
ఓడు ఓడు అంటే కంచమంతా ఓడే అనబోను. కేంద్రం కనికరించి విసిరినా కాణీలు కొన్ని ఉన్నాయి. వాటిని మెచ్చుకోవటం అత్యవసరం. కుటీర జ్యోతికి గుడిసెల భీమాకు ఉన్న అవినాభావ సంబంధాన్ని గుర్తించిన కేంద్రానికి కృతఙ్ఞతలు చెప్పాలి. పేద కుటీరాలు దేదీప్యమానంగా వెలిగిపోవాలనే ఉద్దేశంతో ఇంటికో బల్బు ( గతంలో చెన్నారెడ్డి కన్న కల ) బిగిస్తారు. మరి నాసిరకం వైరింగ్ వల్లనో, షార్ట్ సర్క్యూట్ వల్లనో అగ్ని ప్రమాదం జరిగి కుటీరం బూడిదయి పోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి గుడిసెకు భీమా కూడా చేయించబూనటం ఆనందదాయకమైన విషయం.
ఇందిరా వికాస పత్రం మొదట్లో అయిదేళ్ళుండేది. తరువాత అయిదున్నరేళ్ళు అన్నారు. ఇప్పుడు మళ్ళీ అయిదేళ్ళు చేశారు. కొనుగోళ్ళు తగ్గటం చూచి ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ మధ్యలో కొన్నవాళ్ళు అర సంవత్సరం అన్యాయమైపొయ్యారు. ఇది మాత్రం తాతాచార్యులు ఏమీ చేస్తున్నాడురా అంటే తప్పులు చేసి సరిదిద్దుకుంటున్నాడు అన్నట్లుంది.
బొట్టు కాటుకల మీద పన్ను మినహాయింపు ముత్తయిదువులకు ముదావహంగా ఉండవచ్చు. ఎటోచ్చీ విధవరాళ్ళు మాత్రం నిట్టూరుస్తారు. ఏది ఏమైనా ఈ బడ్జెట్ వ్యవహారం అంతా బ్రతికిన బ్రతుకు చెప్పుకుందాం బయట ఎవరూ లేకుండా చూడు అన్నట్లుగా ఉంది. మణులు చెక్కిన సంకెళ్ళు మెడకు వేయించుకున్నట్లుగా ఉంది. “నిస్సహాయుడిని, నిర్భాగ్యుడిని, నీ సహ ప్రయాణీకుడిని. వెన్నుతట్టి నడిపించుకు వెళ్ళు” అని కాంగ్రెస్ బాల కవి బైరాగిగారు తివారీని అడగకుండా సింధియాను అడిగినట్లయితే బాగుండేది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి