మార్చి మురిపెం
గీటురాయి 29-1-1988
పెళ్ళికి చేసిన పప్పు పేరంటాళ్ళు చవిచూడను సరిపోయిందట, ప్రతి ఏటా పార్లమెంటులో బడ్జెట్ సమర్పించటానికి ముందే అనేక నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెంచి, పన్నులు హెచ్చించి, ద్రవ్యోల్బణానికి దారివేసి రాబడుతున్న డబ్బంతా విహార యాత్రలకి, ఆయుధాలు కొనడానికి సరిపోతున్నట్లుగా ఉంది. పెయ్యను కాయమని పెద్దపులికి అప్పజెప్పినట్లుగా ఉంది ఈ దేశ ప్రజల పరిస్థితి.
ప్రజా సేవ అనేది పోలిటీషియన్లు నోటితో చేసే ఒక స్లోగన్ మాత్రమే కానీ అది హృదయంలో నుండి రాదు. అలాంటి దానికి వారిలో చోటు లేదు.
‘నేను సేవ చెయ్యటానికే వచ్చాను గాని సేవ చేయించుకోవటానికి రాలేదు’ అన్నారు ప్రవక్త ఏసుక్రీస్తు. అయితే నేటి మన నాయకులు ఖచ్చితంగా అందుకు విరుద్ధ స్వభావంతో వెలిగిపోతున్నారు. పుట్టుక చూస్తే గరుత్మంతుడు గుణం చూస్తే పీతిరిగద్ద అన్నట్లుగా ఏదో గొప్ప వంశంలోనో, మాజీ నాయకుడికో పుట్టి ఉండటం, వారసత్వపు సింపతీతో పదవుల నెక్కడం ఆ తరువాత తమ అవలక్షణాలను బయట పెట్టుకోవటం వారికి అలవాటైపోయింది.
పేదవాడు పెంట తింటే కూడు లేక అంటారట. మారాజు తింటే మందుకోసం అంటారట. ఎంత చిత్రమైన పరిస్థితి ఇది?. 1979 లో 3104 కోట్లు ఉన్న రక్షణ వ్యయం నేటికీ 12512 కోట్ల రూపాయలకు ( నాలుగింతలు ) పెరిగింది. ముఖ్యమైన అవసరాలు త్యాగం చేసుకునైనా ఆయుధాలు కొనుక్కోవాలని ఏలినవారు అంటున్నారు. ఆయుధాల కొనుగోళ్ల మీద సరైన ఆడిట్ ఉండదు. బోఫోర్స్ వ్యవహారం లాంటివి కొనసాగించటం కోసమే రక్షణ వ్యయం పెంచుతున్నారు అని గిట్టనివారు ఎవరైనా మోత్తుకుంటే అది వారి గ్రహచారం. అంతేనంటారు నాయకమన్యులు. నిరాయుధీకరణ అనే అంశం మీద న్యూయార్క్ కు పోయి నచ్చ జెప్పజూడటం గురివిందగింజను గుర్తుకు తేవటం లేదూ ?
దేశంలో 38 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన జీవిస్తూ అన్న వస్త్రాల కోసం అలమటిస్తున్నారు. ఆయుధాల ఖర్చు తగ్గించుకొని ఆ డబ్బును ఆహార కొనుగోలుకు మళ్లించవచ్చు. కనీసం నిత్య జీవితావసర వస్తువుల ధరలు పెరుగకుండా చూడవచ్చు. 12 కోట్ల మందికి స్వంత ఇళ్ళు లేవు. 1960 లో 100 పైసల విలువ ఉన్న రూపాయి ఇప్పుడు 14 పైసలకు పడిపోయింది. విదేశీ వాణిజ్యంలో సైతం 9 వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. అసలు ప్రతి ఏడూ లోటు బడ్జెట్ లు మాత్రమే మనం కళ్ల చూస్తున్నాము. 23 వేల కోట్ల రూపాయల విదేశీ అప్పు మన నెత్తి మీద ఉంది. దాని వడ్డీకే బడ్జెట్లో 11 శాతం హరించుకుపోతున్నది. పరిస్తితి ఇలా ఉండగా “అదనపు వనరులు సమీకరించండి అందినంత పంచుకుందాం” అని కేంద్ర ప్రణాళికా సంఘం సిఫారసు చేసిందట, అదనపు వనరులు అంటే బంజరు భూముల్లాంటివి కాదు కొత్త కొత్త పన్నులు,పెంచిన ధరలు మాత్రమే.
రాష్ట్రాలన్నీ డబ్బులు చాలక సతమతమైపోతున్నాయి. 66 శాతం ఆదాయం కేంద్రం అడ్డగోలుగా ఖర్చు చేస్తూ ముష్టి 33 శాతం రాష్ట్రాలకు విదిలిస్తున్నది. రాష్ట్రాలు పంపిన ప్రాజెక్టులకు అనుమతి కూడా రావటం లేదు. వేరే పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే ఇక వాటి పని గోవిందా!
పిల్లి మెడలో రొయ్యలదండ కటినట్లుగా ఉండి పరిస్థితి. అది మార్చి ఇది మార్చి ఏదేదో మార్చి, మార్చి నాటికి మహాడంబరంగా దేశ ప్రజలను ఊరిస్తూ సూట్ కేసులో తెచ్చి (పేడ కుప్పకు దిష్టి తీసినట్లుగా తీసి) పార్లమెంటులో ప్రకటించే బడ్జెట్ లో ‘పన్నులు, లోటు’ అనే పదాలే ఉంటాయి. చెప్పు పట్టుగుడ్డలో చుట్టి చెంప పగిలిందాకా కొట్టినట్లు ఉంటుంది ఆ బడ్జెట్. చెప్పుకాలు నెత్తిన పెట్టి శఠగోపురం అన్నట్లు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే చెట్టు ఎక్కించి నిచ్చెన తీసినట్లుగా ఉంటుంది. మార్చి నెలలు ఎన్నో మారాయి. ప్రజా నాయకుల స్థితిగతులు మారాయి. పేద ప్రజల అవస్థలు మాత్రం మారలేదు. మార్చగలిగిన వారి మనసులు ఇలా ఉన్నంత కాలం అవి మారవు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి