ఆకలి చావులు కాదు అనాధ చావులు
గీటురాయి 18-3-1988
ఆ మధ్య అనావృష్టి కాలంలో (ఇప్పుడు కూడా ఉందనుకోండి)
మన మహబూబ్ నగర్ జిల్లాలో ఆకలికి తట్టుకోలేక తింటానికి అన్నం దొరక్క కొంత మంది చనిపోతే అలజడి చెలరేగింది. ఆర్ధిక మంత్రిగారు తన స్వంత జిల్లాలోనే అలా జరగటం అపఖ్యాతిగా భావించి ఆఘుమేఘాల మీద అక్కడికి వెళ్ళి చచ్చిపోయిన నిర్భాగ్యులను కుదిపి చూచి అబ్బే అవి ఆకలి చావులు కాదు అనాధ చావులు అన్నారు. సరేలే నాయనా అంత మాత్రం చాలు కనీసం చచ్చిపోయ్యారని ఒప్పుకున్నావు అని ఆనాడు అనుకున్నాం.
అయితే “దేశంలో ఎక్కడా ఏ ఒక్కరూ కూడా ఆకలితో మరణించలేదు” అని కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ సహాయ మంత్రి శ్రీ సుఖ్ రామ్ కాంగ్రెస్ ఎం.పీ. ల హర్షధ్వానాల మధ్య చాలా సుఖంగా చెప్పారు. కలహాండీ జిల్లాలో చచ్చిపోయిన వారి సంగతి తేల్చేందుకు కమిటీని వేయాలని కోరితే కాదు కూడదు అన్నారు మంత్రివర్యులు. చద్ది కూడు తిన్నమ్మ మొగుడి ఆకలి ఎరుగదు అంటారు. కడుపులో చల్ల కదలకుండా కుర్చీల్లో కూర్చొని దేశాన్ని పాలించే నేతలకు కష్టజీవుల కడుపు మంట అర్ధం కాదనటం నిజమేననిపిస్తున్నది.
మద్రాసు హైకోర్టులో జస్టిస్ శ్రీ కె. వెంకట స్వామి గారు ఇలాంటి అధిపతులను చీదరించుకుంటూ ఒక గుడ్డి యాచకురాలికి పెన్షన్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చారు. 67 ఏళ్ల సిద్దమ్మ కళ్ళు లేని అనాధ. 1979 లో వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు పెట్టుకుంటే 1984 లో మంజూరు చేశారు. అయితే సేలం రెవెన్యూ అధికారి ఆమె బిచ్చమెత్తు కుంటూ తనను తాను పోషించుకుంటున్నది గనుక పెన్షన్ ఇవ్వనక్కర లేదని నిర్దాక్షిణ్యపు ఉత్తర్వు చేశాడు. ఆకు ఎత్తరా అంటే విస్తళ్ళు లెక్క బెట్టినట్లుగా ఆ అధికారి లేనిపోని లొట్టలు వెతికి వెధవ పని చేశాడు. సిద్దమ్మ నోటి కాడ పెన్షన్ ఊడగొట్టాడు.
సిద్దమ్మ గుడ్డిదైతే మాత్రమేమి ? ఉసూరుమంటూ ఊరుకోలేదు. అడుక్కున్న డబ్బుల్తోటే హైకోర్టులో పిటీషన్ వేసింది. జస్టిస్ వెంకట స్వామిగారు సిద్దమ్మను పోషించే వాళ్ళెవరూ లేరు కాబట్టి అడుక్కుతింటున్నంత మాత్రాన పెన్షన్ ఆపటానికి వీల్లేదు. మీరిచ్చే ముష్టి ముప్పై రూపాయల కోసం అసలు ముష్టిని ఆపమంటారా ? 1979 నుండి ఆమెకు రావల్సిన పెన్షన్ బకాయీలు మూడు నెలల్లోగా స్వయంగా తీసి కెళ్ళి ఇచ్చి రమ్మని రెవెన్యూ అధికారిని ఆదేశించాడు. బుద్ధి చెప్పేవాడు గుద్దినా మేలేనని సిద్దమ్మ కేసు నిరూపించింది.
ఇప్పుడు దేశంలో అడుక్కునే వాళ్ళ సంఖ్య స్వాతంత్ర్యం రాక ముందు నాటికంటే రెట్టింపు అయినట్లు తెలిసింది. గరీబీ హఠావో లాంటి నినాదాలు, సోషలిజం లాంటి స్లోగన్లు వింటూ ఉండగానే నలభై ఏళ్ళు, ఆరు పంచవర్ష ప్రణాళికలు పూర్తయ్యాయి. చూసుకుంటే ఏముంది ? బూడిద పూతలు , విహారయాత్రలు ,రాజయోగులు, రెట్టింపయిన బిక్షగాళ్ళు. నీకు సిగ్గులేదు నాకు ఎగ్గు లేదు ఎప్పటి మాదిరే వచ్చిపోతుండు ఒట్లేస్తుంటాం అంటున్నారు జనం. నీ కూడు తిని నీ గుడ్డ కట్టి నాకు కాపురం చెయ్యి. నీ పప్పూ నా పొట్టూ కలిపి ఊదుక తిందాం రా అంటున్నారు నేతలు.
తినటానికి కట్టటానికి అన్నీ ఉన్నోళ్ళకు సిగ్గు ఎటూ లేదు. కనీసం ఈ రెట్టింపయిన అడుక్కుతినే వాళ్ళయినా సిగ్గుపడి సిద్దమ్మను ఆదర్శంగా తీసుకుని పెన్షన్ కోసం తలా ఒక పిటీషన్ కోర్టులో దాఖలు చేస్తే బాగుండును. బిక్షుక నివృత్తి చట్టం తెచ్చిన ప్రభుత్వం బిక్షగాళ్ళ పునరాశ్రయం సంగతి మరచిపోయింది కాబట్టి వాళ్ళ సంఖ్య దిన దిన ప్రవర్ధమానమై మన దేశ ఖ్యాతిని వాళ్ళు వీధి వీధికి చాటుతూ ఉండటం అతి సహజమైన విషయమే !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి