30, సెప్టెంబర్ 2012, ఆదివారం

అమ్మబాబోయ్ అతిధి



                  అమ్మబాబోయ్ అతిధి                 
                      గీటురాయి 6-5-1988

          అతిధుల్ని, బంధుజనాన్నీ, యతుల్నీ, యాచకుల్నీ పూజించేవాడే   సద్గతి పొందుతాని కవి చౌడప్ప అంటాడు. అక్కరకొచ్చే చుట్టాలకు మొక్కవచ్చుగాని, చూచి మూలిగే వాళ్ళు కేవలం లెక్క పెట్టుకోవటానికే పనికొస్తారు. అలాంటి చుట్టాలంతా ఓర్వని కుక్కలు, మేక మెడ చళ్ళు        మాత్రమే రా గువ్వలచెన్నా అంటాడు పట్టాభిరామకవి. అక్కరకు రాని        చుట్టాన్నీ, ఎక్కి చల్ అంటే పరుగెత్తని గుర్రాన్నీ, మొక్కి మొత్తుకున్నా విని        వరమియ్యని వేలుపుని వెంటనే వదిలెయ్యాలని సుమతీ శతకకారుడు      సెలవిస్తాడు.
             
       యతులు, యాచకులు, గుర్రాలు, వేలుపులు అన్నిటినీ వదిలించుకోవచ్చుగాని అతిధుల్ని వదుల్చుకోవడం అంత సులభం కాదు.        రాకోయీ అనుకోని అతిధీ అని రోజంతా పాటలు పాడుతున్నా    పట్టించుకోకుండా అతిధులు వస్తూనే ఉంటారు. ఇబ్రాహీం గారి ఇంటికి        నాలుగు పక్కలా గుమ్మాలు తెరుచుకుని అతిధులకు ఆహ్వానం పలికేవ ఆ మహనీయుని ఆతిధ్యం పొందటానికి రోజూ ఎంత మంది వచ్చేవారో మరి !   అష్టవిధ గృహస్తకర్మలలో అతిధి సత్కారం ఒకటిగా చేర్చారు. కేపిటల్   
సిటీల్లో,జంక్షన్ లలో ఉన్న వాళ్ళకు ఈ తాకిడి ఎక్కువగా ఉంటుంది.

       చుట్టానికి, అతిధికీ తేడా ఏమీ లేనట్లు చాలా మంది చెబుతారు. కానీ        కొద్దిగా తేడా ఉంది. చుట్టం వచ్చాడంటే చెప్పులు ఎక్కడ విడిచాడో చూచిరా    అన్నాడట. మగడి చుట్టమైతే ముంగిట్లో, భార్య చుట్టమయితే వం ఇంటి దగ్గర చెప్పులు విడుస్తార. దీన్ని బట్టి రక్త సంబంధీకులు, బంధువులు    అంతా చుట్టాలవుతారనవచ్చు. చుట్టాలంతా అతిధులు కావచ్చు. అయితే      అతిధులంతా చుట్టాలు కారు. దారినపొయ్యే దానయ్య కూడా మన ఇంటి    అతిధి కావచ్చు.

       ఎండాకాలం శలవులకి ఎవరింటికైనా అతిధులుగా వెళదామని అనుకుంటున్న సమయానికి జట్లుజట్లుగా మీ ఇంటికే అతిధులు రావటం       ఆరంభిస్తే ఆశ్చర్యపోకండి. అతిధి అంటే ఈ బాపతు  వాడా అని కాస్త డిక్షనరీ        చూడండి: తిధి మొదలయిన కాల నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు, ఎప్పుడూ తిరిగేవాడు అని ఉంది. ఇక అట్లాంటి     వాడికి అభ్యంతరం చెప్పటానికి మనమెవరం ?

       పైగా అతిధి మహాశయునికి ఆగంతకుడు, ఆవేశికుడు, గృహాగతుడు,        విందుతోడు లాంటి బిరుదులు కూడా ప్రదానం చేశారు నిఘంటువు రాసిన కౌశికులు. ఫలానా సమయానికి ఊడి పడబోతున్నామని ఒక ఉత్తరం     ముక్క రాసిపడేస్తే ఆతిధ్యం ఇచ్చేవారికి అనుకూలంగా ఉంటుంది. అట్లా కాకుండా ఆఫీసు నుండి మీరు ఇంటికి తిరిగొచ్చేటప్పటికి మీ ఇంట్లో    లకపాన్పు లెక్కి అతిధులు ప్రత్యక్షమయితే ఎలా ఉంటుంది ? మనం       ఎంత అభినవ ఇబ్రాహీమూలమైనా, చుట్టాల సురభులమైనా, బంధుజనం
 పాలి కామధేనువులమైనా అతిధుల్ని ఆదరించగలం గాని వారు మన    చెవులు పట్టుకొని ఆడిస్తుంటే ఆడగలమా? వచ్చింది మొదలు తిరిగి వెళ్ళే     వరకు అవతలి వాడిని ఎలా ఆర్పివెయ్యాలో, పచ్చని కాపురాల్లో ఎలా    నిప్పులు పొయ్యాలో విపులంగా వివరంగా చెవిలో ఇల్లు కట్టుకొని చెప్పే     చుట్టాలను, చెవిలో సొంటి కొమ్ము ఊదే అతిధులను ఇంటిలో ఉంచుకుని        ఎవరయినా సరే నిబ్బరంగా ఉండలేరని నా నమ్మకం.

       పిడుగుకు గొడుగు అడ్డమా అన్నట్లుగా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త      అనే బోర్డు చుట్టాలకు అడ్డం కాదు. మీ ఇంటి కుక్కలు మీకు ఎలాంటి హానీ      చెయ్యని దారినపొయ్యే వాళ్ళనెవరినో చూచి మొరుగుతాయి గాని   మిమ్మల్ని దయ్యంలాగా పట్టుకుందామని వచ్చే చుట్టాన్ని చూచి నోరు   మెదపవు. అదే దైవలీల ! దేవుడు కూడా చుట్టాల పక్షానే ఉంటాడు.అతిధి దేవో భావ అంటాడు.వాళ్ళను నియమనిష్టలతో ఆదరిచాల్సిన బాధ్యత నీదే నంటాడు. కడుపునిండా తిన్న యూదుడు ఆవరణంతా ఖరాబు చేసి పోయినప్పుడు  ముహమ్మదు వారు స్వయంగా శుభ్రం చేసుకున్న సంగతి మనకు తెలుసు గదా ! అందుకని అతిధిని సత్కరించాలే గాని చీత్కరించగూడదు. అతిధిగా   వచ్చే మనిషి కూడా తన లోపాలను సరిదిద్దుకొని రావాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి