ఇంటర్వ్యూరాజకీయాలు గీటురాయి 1-4-1988
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలకు లైసెన్స్
అర్హతలేని ఉద్యోగాలు లంచం ఇస్తే ఓ యస్
సిఫార్సు లేనిదే శ్మశానమందు దొరకదు రవంత చోటు
పేరుకు ప్రజలది రాజ్యం పెత్తం దార్లదే భోజ్యం
అంటూ
ఆరుద్రగారు చాలాకాలం క్రితమే ఈ దేశాన్ని గురించి ఆదుర్దా పడ్డారు. సిఫారసు, లంచము అనేవి ఉత్తర దక్షిణాలుగా
పేరుపడ్డాయి. అరకాసు పనికి ముప్పాతిక బాడుగ
అన్నట్లుగా అటెండర్ ఉద్యోగానికి సైతం వందల
సంఖ్యలో అప్లికేషన్లు, వేలల్లో లంచాలు సిద్దమౌతున్నాయి. అర్జీలకు పనులు కావు, ఆశీర్వచనాలకు బిడ్డలు పుట్టరు
అన్నట్లుగా ఉత్తర దక్షిణాలు తేవటం తెలియని
మనిషి తూర్పుకు తిరిగి దండం పెట్టక తప్పటం లేదు.
రాష్ట్రంలో
ఉద్యోగాలు దొరక్క గత నాలుగేళ్ళలో 75 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని హోమ్ శాఖ మంత్రి శ్రీ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ లో చెప్పారు. దేశంలో ఆకలి చావులు
లేవని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి భజన్
లాల్ బల్ల గుద్ది చెబుతుంటే,
కార్మిక మంత్రి జగదీష్ టిట్లర్ దేశంలో
ఉపాధి కల్పనా కేంద్రాల్లో మూడు కోట్ల రెండు లక్షల నలభై ఏడు వేల మంది నిరుద్యోగులు (3,02,47,000)
పడిగాపులు గాస్తున్నారని వాళ్ళకు
నిరుద్యోగ భృతి ఇచ్చే ప్రసక్తే లేదని ఢంకా భాజాయించి చెప్పారు. ఇక మన రాస్త్రంలో ఇరవై ఆరు లక్షల మంది
నిరుద్యోగులు నమోదు చేయించుకున్నారని
(వ్యాధి నిరోధక టీకాలు వేయించుకున్న వాళ్ళలాగా) వాళ్ళ
లెక్కలు మాత్రం కంప్యూటర్ల సాయంతో చక్కగా నిర్వహిస్తున్నామని కార్మిక మంత్రి శివారెడ్డి సెలవిచ్చారు. మన రాస్త్ష్ట్ర జనాభా దేశ జనాభాలో ఎనిమిది
శాతం ఉంది. నిరుద్యోగుల జనాభా దేశ నిరుద్యోగుల్లో
8.6 శాతం ఉంది. ఇక నమోదు చేయించుకోని
నిరుద్యోగులెంతమందో దేశం మొత్తం మీద
చచ్చిపోతున్న వాళ్ళెంతమందో ఆ దేవుడికే తెలియాలి.
కలలో
కనిపించిన లంకెల బిందెలు పెరికీ పెరికీ నీళ్ళఛాయ మాత్రం అయినట్లుగా ఇంటర్వ్యూకు పిలుపు వచ్చి నిరుద్యోగులు నానా యాతనా పడుతుంటారు. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
అన్నట్లుగా ఇంటర్వ్యూ జరిపే
అయ్యవార్లు అహంకారం చూపిస్తుంటారు. నామినేట్ చేయబడిన నడమంత్రపు రాజకీయ వాదులైతే మరీ అడ్డగోలుగా వ్యవహరిస్తారు.
ఉత్తర దక్షిణాలు తప్ప మరేదీ వారికి ప్రీతి పాత్రం కాదు గనుక నిరుద్యోగి ఎలాంటి
సమాధానం ఇచ్చినా ఫలితం ఒకేలా ఉంటుంది.
ఎగిరెగిరి దంచినా ఒకటే
కూలి ఎగరకుండా దంచినా ఒకటే కూలి
అన్నట్లుగా ఉంటుంది. కొన్ని సార్లు ఎక్కువ
తెలివి ఏడ్పుల కారణం, తక్కువ తెలివి తన్నుల కారణం అన్నట్లుగా కూడా పరిణమిస్తాయి.
విద్యావేత్తో, పండితుడో అయితే కొంత నయం, రాజకీయ వాది గనుక ఇంటర్వ్యూ బోర్డు మెంబర్ అయితే
అతన్ని ఒప్పించటం నిరుద్యోగి తరం కాదు.
పంచపాండవులంటే
తెలియదా మంచం కోళ్ళలాగా ముగ్గురు అంటూ రెండు
వ్రేళ్ళు చూపించబోయి ఒక్క వేలు చూపాడట ఒకడు, బెల్లం అంటే తెలియదా
అల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అన్నాడట మరొకడు. లంచమిచ్చి ఉంటే ఇలాంటి సమాధానాలు కూడా సత్యవాక్యాలుగా చెలామణీ అవుతాయి. నిప్పులాంటి నిజాలు చెప్పి
పప్పులో కాలువేసే వాళ్ళు కూడా ఉంటుంటారు. నిజానికి వ్రాత పరీక్షలు రాసి పాసయిన వాళ్ళలో చాలా
మంది నోటి పరీక్షలో నెగ్గలేరు. ఇంటర్వ్యూ అనేది సర్కస్ వాడు తీగమీద నడిచే ఫీట్ లాంటిది.
అందువలన
దేశంలోని నిరుద్యోగులందరికీ ఇంత భృతి దొరికి,
మన రాజ్యాంగంలో “పని హక్కు” ప్రాధమిక హక్కుగా చేయబడాలని అందరూ ప్రార్ధించాలి. అన్నట్లు ఈ మధ్యనే నేను కూడా
ఆం. ప్ర. ప. స. క. వారు నిర్వహించిన ఓ
ఇంటర్వ్యూ కెళ్ళాను. మీ ప్రార్ధనల్లో నన్ను కూడా కాస్త ఙ్ఞాపకం పెట్టుకుంటారు కదూ !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి