నేటి విద్యార్ధులు రేపటి
నిరుద్యోగులు
గీటురాయి 19-8-1988
పరిగేరుకున్న గింజలు
కరువున కడ్డంబురావు కాస్తుండిడునా
తిరిపెమున లేమి తీరదు
గురుతర సత్కీర్తిగన్న గువ్వల చెన్నా !
అన్నట్లుగా
ఇప్పుడు రాష్ట్ర ప్రబుత్వ ఉద్యోగాల వేటకు ముప్పై నాలుగేళ్ళ ముసలోళ్ళు గూడా
అర్హులేనని ప్రభుత్వం ప్రకటించింది. పిల్లల చేతిలో పప్పు బెల్లాలు పెద్ద వాళ్ళు
లాక్కు తింటున్నట్లుగా ప్రభుత్వం భావించింది కామోసు ! అది ఏమి ఖర్మమో గాని ఈ కర్మ
భూమిలో జీవనం నిత్య దరిద్రం పరమ దౌర్భాగ్యం లాగానే ఉంది. ఎవడి ముఖాన చూచినా నిరుద్యోగపు రోగ లక్షణాలు తాండవిస్తున్నాయి.
వీధివీధికి భరతమాత వంటికి పట్టిన మొండి గజ్జిలాగా అడుక్కు తినేవాళ్ళు
దర్శనమిస్తున్నారు. అంతకు ముందు అమ్మగారి ‘గరీబీ హఠావో’
స్లోగన్ సక్సెస్ అయ్యి అడుక్కునే వాళ్ళంతా అంతమయ్యారు కాబోలు,
ఆమె గారి కొడుకులుంగారు “బేకారీ హఠావో”
అని పని దొరకనోళ్ల అంతు చూడ్డానికి బయలుదేరారు. ఆమె ఒక ఇరవై, ఈయనొక అరవై సూత్రాలు మాత్రం దేశం మీద
సూక్తి ముక్తావళి లాగా వినిపించారు. తీరా వెనక్కి తిరిగి చూస్తే దేశ పరిస్థితి కూడు పారేసి కుండనాకినట్లుగా ఉంది. దేశం మీద నాలుగు కోట్ల
మందీ, మన రాష్ట్రంలో 27 లక్షల మంది నిరుద్యోగులు ఎంప్లాయ్ మెంట్ ఎక్చేంజీల కెళ్ళి నిరుద్యోగ వ్యాధి నిరోధక టీకాలు
వేయించుకొచ్చుకున్నారట.అంటే వాళ్ళ పేర్లు నమోదు
చేయించుకున్నారన్నమాట.
కేంద్రం
ఏదో చేసిన ముత్తయిదువలాగా మెదలకుండానే కూర్చుంది. పని హక్కుని రాజ్యాంగంలో చేర్చమంటే వల్లకాదు అంది. కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వమంటే వల్లనంటే వల్లను అంది. ఇక కరువు భత్యం ఇవ్వటానికే కన్నీళ్ళ పర్యంతం అవుతున్న
మన కాషాయధారికి ఇన్ని లక్షల మంది బికారుల్ని చూచి కన్ను కుట్టిందో ఏమో, చెప్పు చాల్లేదని కాలుకోసినట్లుగా
వయోపరిమితిని దిగకోశాడు. నేటి విద్యార్ధులు రేపటి నిరుద్యోగులు అయిన వాళ్ళు వానర సైన్యం లాగా తయారై బస్సుల
టైర్లు గాలి తీసి, కొన్నిటిని తగలపెట్టిన తరువాత అన్న తను
చేసిన తప్పును సరిదిద్దుకున్నాడు. కొడితే కొట్టాడు గాని కొత్త కోక పెట్టాడు అని ఈ
కొత్త జీవో సంబరంతో నిరుద్యోగులు నిమ్మళించారు. కానీ కోకడాబుతో కోరిక లీడేరునా అన్నట్లుగా ఉంది పరిస్థితి ! పొయ్యి పక్క వెన్న ముద్దలాగా
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఉంది. ఉద్యోగం అనేది కలలోని కౌగిలిలాగా నిరుద్యోగుల వయస్సు నిండే దాకా ఊరిస్తుందే తప్ప ఓ పట్టాన రాదు. కన్నొక్కటి
లేదుగాని కంతుడు కాడా అన్నట్లు నిరుద్యోగి ఉద్యోగి కావటానికి
తప్ప అన్నిటికీ అర్హుడే అవుతాడు.
ఈ
నిరుద్యోగ నివారణకు ప్రభుత్వం చేస్తున్న ఏ పనైనా మొలది విప్పి తలకు
చుట్టుకున్నట్లుగా మాత్రమే ఉంటున్నది. ఐ ఏ యస్ లాంటి అత్యున్నతమైన పరీక్ష సైతం
ఇరవై ఆరేళ్లకే రాసేయ్యాలని శాసనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయం చేస్తే బస్సులు తగలబెట్టో, ఎమ్మెల్యేలను చావబాదో
పని సాధించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతకంటే తప్పుడు పనులు చాలా చేసింది. అయినా దాని మెడలువంచటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. దానిని’ ఎవరూ పట్టుకోలేరు. కేంద్రమొక మిధ్య అని
వాపోయే వారి మాట నిజమేననిపిస్తున్నది. నిజంగా ఒక మాయా స్వరూపమే దేశాన్ని
శాసిస్తున్నది. ఉపాధిని కల్పించే ఏ భారీ ప్రాజెక్టును ప్రారంభించాలన్నా ఆ
మిధ్యాదేవి గారి అనుమతే అవసరం.
మంచిగా
ఉంటే నేను చేశాననుకో మంచిగా లేకపోతే రాష్ట్రాలు చేశా యనుకో అంటుంది కేంద్రం.
రాష్ట్రనికో రూలు వర్తింపజేస్తుంది. దేశ వ్యాప్తంగా ఒకే ఉద్యోగ విధానాన్ని ఇంత
వరకు కేంద్రం అమల్లోకి తేలేకపోయింది. ఆదాయాన్ని తెచ్చిపెట్టే పన్నుల విషయంలో దేశ
వ్యాప్తమయిన పరిపక్వ బుద్ధిని చూపే కేంద్రం, నిరుద్యోగులకు ఉపాధిని కల్పించే విషయంలో కూడా అదే రకమైన విశాల
బుద్ధిని ప్రదర్శించాలి. రాజ్యాంగంలో పని హక్కును ప్రాధమిక హక్కుగా చెయ్యాలి.
నిరుద్యోగ భృతిని కల్పించటం,
భూసంస్కరణలు ద్వారా ఆదాయ పంపకాన్ని సరిగా నిర్వహించవచ్చు. గంగా కావేరీ నదుల
అనుసంధానం లాంటి భారీ ప్రాజెక్టుల్ని కేంద్రమే చేపడితే లక్షలాది ఎకరాలు సాగులోకి
వచ్చి, వరదలు తగ్గి, నీటి కరువు తీరి, నిరుద్యోగులు ఉద్యోగులౌతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి