పోరునష్టం పొందులాభం
గీటురాయి 2-9-1988
ఇద్దరు మనుషులు తన్నుకుంటున్నారనుకోండి. ఎవడో ఒకడు ఎంతకీ గెలవకపోతుంటే చూసే వాళ్ళకు
విసుగుపుడుతుంది. చూసే వాళ్ళకే కాదు
ఆ తన్నుకునే వాళ్ళకు కూడా ఏమిటీ జిడ్డు పరిస్థితి అనిపిస్తుంది. విజయమో వీర స్వర్గమో సిద్ధించటం లేదేమిటా అని
దిగులు పట్టుకుంటుంది. ఇద్దరూ సమఉజ్జీలే అయినప్పుడు తన్నుకొని తన్నుకొనీ నీరసించిపోయి పళ్ల బిగువున పోరాడుతూ
ప్రేక్షకుల్లో నుంచి ఎవరైనా పెద్దమనుషులు
వచ్చి విడదీస్తే బాగుండు అనుకుంటారు. ఐక్యరాజ్యసమితి లాంటి అతి సున్నితమయిన కంతల తడిక పెద్దమనిషి ఎవరయినా దొరికితే అతన్ని అడ్డం పెట్టుకొని : -
మాయదారి
కీచులాట మా మధ్య వచ్చింది
రాయబారం సేయవే తడికో తడిక
ఆడి వగలమారి మాటలకు ఒళ్ళంతా మండుతుంది
రాయబారమెందుకే
తడికో తడిక
అని ఊగులాడతారు. తడిక పెద్ద మనిషి రాయబారం
సఫలమై పోరు విరమించవలసివస్తే ఈ పెద్ద
మనిషి వల్ల ఆగానుగాని లేకపోతే వాడిని మక్కెలు ఇరగబొడవక పొయ్యానా అని బింకాలు పలుకుతారు ఫలానా సమయంలో వాడు నిన్ను పొర్లించి పొర్లించి
తన్నాడుగదా అంటే మీసాలకు మట్టి కాలేదుగదా అంటారు.
మూడు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను పొడిచాడట ఎవడో. ఎనిమిదేళ్ళు యుద్ధం చేసి ఈ మధ్యనే మానుకున్న ఇరాన్ ఇరాక్ లు ఏమి సాధించాయి అన్నది అన్ని దేశాలు ఆలోచించాలి. లక్షలాది
జన నష్టం, ఆస్థి నష్టం జరిగింది. కూలి నాలి చేసి కుదురాల ఉండక మొగుణ్ణి
కట్టుకొని సగమైపోతినే అని ఒకామే విచారపడిందట. అలాగే అనవసరంగా యుద్ధం చేసి అన్యాయమై పోతిమే అని ఈ రెండు దేశాలు ఇప్పుడు
చింతిస్తున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? పోరునష్టం పొందులాభం అని ఎంత మంది చెప్పినా ఆనాడు వినలేదు. ఓదార్చే కొద్దీ ఏడ్చే బిడ్డల్లాగా
సవరదీసే కొద్దీ నిక్కుతూ ఎవరు ఎన్ని
విధాల చెప్పినా వినకుండా ఎగబడి తన్నుకున్నారు. ఒంట్లో ఇంట్లో
ఉన్న సత్తువ అయిపోయిందేమో జరిగిన పరాభావాలన్నీ లోలోనే దిగమింగుకుని
పోరు విరమిస్తున్నామన్నారు. ఇంతకాలం మంకుపట్టుపట్టినా
ఇప్పుడు విడదీసే వాళ్ళకోసం ఆబగా చూస్తూ ఐరాస పిలిచిందే
చాలన్నట్లు రెండు దేశాలు పలికాయి. పలకటమే కాదు పిలుపులకు కులికాయి. కులకటమే కాదు పూర్వపు వలపులు ఒలకబోశాయి. రేపోమాపో ఎదురెదురుగా కూర్చుని మనసు విప్పి మాట్లాడుకుంటాయట.
రేపటి చర్చలు కూడా సరసాలు విరసాలు లేకుండా
సజావుగా జరిగి వీళ్ళ పోరు నిజంగానే
శాశ్వతంగా ఆగిపోవాలని ఆశిద్దాం. ముందు నడిపించి కొంకులుగొట్టే దేశాలను, మానిన పుండు మళ్ళీ సెలపోసేలా చేసే సూపర్ పవర్లను కంట్రోల్ చేసి శాంతి స్థాపన జరిగించమని
దైవాన్ని వేడుకుందాము. దైవానికి కూడా
లొంగని మొండిబండలయితే మనమేం చేయగలం ? ఇక వాళ్ళు ముండమొయ్యక తప్పదు మరి. తప్పు నుండి మరింత తప్పుడుతనంలోకి కాకుండా ఒప్పు వైపుకు సాగిపోవాలనేదే ఎవరికైనా నేనిచ్చే సలహా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి