చేదు నిజాలు
గీటురాయి 26-8-1988
విధి
ఒక విషవలయం విషాధ కథలకు
అది నిలయం
పువ్వు
మాటున పొంచిన ముల్లు నాటే దాకా తెలియదు
కడలికడుపున
బడ బానలము రగిలేదాకా తెలియదు ||విధి||
అని నారాయణ రెడ్డి గారు వ్రాసిన పాట అక్షర సత్యమై కూర్చుంది.
సయ్యద్ మోడీ, జియా ఉల్ హక్, సైదులు గార్ల మరణ వార్తలు రేడియోలో వినేదాకా తెల్లారి పొద్దున పేపర్ చూసే దాకా
నాకూ తెలియదు. వాన రాకడ ప్రాణం పోకడ
ఎవరికీ తెలియదన్నారు. కానీ ఇప్పుడు వాన రాకడ మన వాతావరణ
శాస్త్రజ్ఞులు పుణ్యమా అని ముందుగానే
తెలుస్తున్నది. కానీ ప్రాణం పోకడ మాత్రం
ఎవరికి ఎలా ఎప్పుడు ఎందుకు జరుగుతుందో అంతుబట్టని
విషయంగానే ఉంది. ఇది గూడా కనుక్కుంటే ఎంత బాగుండును ?
అప్పటి దాకా :-
ఏ
నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ?
విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ?
అన్న
కొసరాజు గారి పాటను కొసరి మరీ మనం పాడుకుంటూ ఉండాల్సిందే.
అంగరక్షకులుగా
ఉండవలసిన వారే ఇందిరాగాంధీని బలి తీసుకోగా ఆమె
చితికి నిప్పంటిస్తూ రాజీవ్ గాంధీ కూడా :
ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో
ఎవరికి ఎవరూ సొంతము ఎంతవరకీ బంధము?
అనే
అనుకోని ఉంటాడు ఆత్రేయ లాగా.
“కల కానిది విలువైనది బ్రతుకు”
అని జీవించటం కోసం పడి చచ్చిన శ్రీ శ్రీ గారు కూడా చివరికి “పోతే
పోనీ పోరా, ఈ పాపపు జగతిలో శాశ్వత మెవడురా”
అంటూ వెళ్ళిపోయాడు. ఈ జీవితం అనుక్షణం ప్రళయమేనని అన్నాడు. ప్రకృతి శక్తులు జయించు నరుడా ప్రాణ రహస్యం తెలియదేమని పరిహసించాడు. పైగా ఇదంతా ప్రాణం పోసిన
దేవునిలీలే అన్నాడు. తలచేది జరుగదు
జరిగేది తెలియదు అని వగచాడు.
చావుకే చావుంటే ఎంత బాగుండునని కొందరు
మునులు గతంలో తపస్సులు చేస్తూ చనిపోయారు.
చనిపోయిన తపోధనులను చూచి కూడా కొందరు
తెలివి మాలిన వాళ్ళు సంజీవి పుల్ల, అమృత పానము అమరగానము
అంటూ ఆపసోపాలు పడి ఆఖరుకు అవుటయ్యారు. గుణం మానవే గూటాల
పోలీ అంటే నా మనువైనా మానుతాను గాని నా గుణం మానను అన్నదట. చావనైనా చస్తాను గాని చెడ్డ పనులు మానను అనే రకం జనం చాలా మంది ఉన్నారు. ఒరే తాగ బాకురా
చస్తావ్ అంటే ఎప్పుడైనా
చచ్చేదేగా తాగి చావనీ అనో లేక త్రాగుతూ
చావనీమనో అనే వాళ్ళున్నారు. గుడ్డివాడు
ఎటు రువ్వినా గురేనన్నట్లుగా చావుని గురించి అడ్డదిడ్డంగా
ఎలా బడితే అలా మాట్లాడి మనల్ని ఒప్పిస్తారు. ఒప్పుకోక మనం మాత్రం ఏం జేస్తాం? మనమే మన్నా మృతుంజయ రావులమా ఏమి ?
గయుణ్ణి
విడిచిపెట్టు నేను చంపాలి అని కృష్ణుడు అర్జునుణ్ణి అడిగితే అది అధర్మం అనిపించిన అర్జునుడు కృష్ణునితో ఇలా
అంటాడు :-
చనినారార్వురు
చక్రవర్తులు మహీ చక్రంబు పాలించి,
ధర్మనిరోధిన్
చనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై
తమతో వారలు మూటకట్టుకొని ఐశ్వర్యంబు
గొంపోయిరే?
రాజ్యములేల, వైభవము లేల ధర్మమూన్ లేనిచో !
జీవితమంతా
ఐశ్వర్యం కోసమే అవజేసే వాళ్ళకీ పద్యం పారాయణ యోగ్యం.
మామూలు మనుషుల సంగతి అలా ఉంచి,
దేశాధినేతలైన వాళ్ళు ఎంతో మంది
దిక్కులేని చావులు చస్తుండటం, మనం అయ్యో పాపం ఏమిటీ దురవస్థ అని సంతాపం చెందటం
మామూలైపోయింది. ఉరిసిన పుండు మీద ఉప్పూకారం
చల్లినట్లుగా వాళ్ళు బ్రతికున్న కాలంలో చేసిన తప్పుడు
పనులేవైనా గురుతుకొస్తే అయ్యో వీళ్ళు చచ్చి ఏ లోకానికి పోతారో గదా అని మరింత
బాధ కలుగుతుంటుంది. ఇప్పుడు బ్రతికున్న నేతలైనా ధర్మబద్దంగా
జీవిస్తూ నిజాయితీతో కూడిన పాలన ప్రజలకు అందిస్తే వారు చనిపోయాక ప్రజలు, వారు స్వర్గార్హులనే నిశ్చయతతో
నిశ్చింతగా ఉంటారు. బ్రతికీ బాధించి చచ్చీ బాధించేటట్లుగా ఉండొద్దని కనబడిన
నాయకుణ్ణల్లా ప్రాధేయ పడవలసిన అవసరం
మనమీద ఉంది. మనందరికీ చావు ఖాయం గనుక ఈ ధర్మబోధ మనకు మనం చేసుకుంటూ మన నాయకులకు
గూడా చేస్తూ ఉండాలి. కదూ ! ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి