నడమంత్రపు సిరి
గీటురాయి 1-7-1988
చింతకాయలు
అమ్మే దానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి
కాయలు అన్నదట. అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట,
వీపు చూచుకునేందుకు అద్దం కూడా అడిగాడట. ఇంకా తాను
నడిచినంత దూరం తివాచీ పరవాలని కోరాడో లేదో నాకు తెలియదు. ఏక్ దిన్ కా సుల్తానులు
వెలగబెట్టే అధికారానికి ప్రజలు అంచనాలు వేస్తుంటారు. కానీ,
గాలి వాటున అకస్మాత్తుగా ఐశ్వర్యం వచ్చి పడిన అయ్యలు చేసే
చిల్ల(ర) పనులకు విలువ కట్టరు వెర్రిజనం అని కొందరు నాతో అన్నారు.
అంగడంగడ
బిచ్చమడిగి, వేషాలు వేసి, జాబులు తెచ్చి,
పైజార్లు బట్టి,
బజార్లు తుడిచి,
సవారీలు మోసి, గుర్రాలు మేపి, గుడిరాళ్ళు తవ్వి,
పొగ చుట్టలు పీల్చి,
భోగం చానల ఇళ్లకు కావలికాసి, సోది చెప్పి,
పశువులు కాసి,
తెప్పలు దీసి, వేశ్యలకు పాదాలు ఒత్తి, మీద దొర అయిన వాడు నీతి మార్గంలో నడువటం నేర్వగలడా అని ఒక కవి కూడా
చాలా చీత్కరించాడు.
ఎవరెస్టు శిఖరం మీద కెక్కి కూసినా కాకి
నెమలి కాదు. గంగా గోదావరి నదుల్లో
కలముంచినా తల వెంట్రుక దర్భకాదు. తెగ తిని తల పిక్కలు
ఎగబలిసినా దున్నపోతు గున్న ఏనుగ కాదు. పొదుగు
లావై ఎంత పొడుగ్గా పెరిగినా కుక్క ఆవు
కాదు. ఉన్నత స్థానంలో కూర్చున్నా భ్రష్టుడు బ్రష్టుడేగాని శిష్టుడు కాదు... అని సవాలక్ష అలంకారాలతో మరొకాయన మనకు నూరిపోశాడు.
వీళ్ళందరూ
చెప్పే విషయం ఎంత వరకు నిజం అని కొంచెం ఆలోచించాను.
దర్జీవాడ్ని చూస్తే సాలెవానికి కోపం అన్నట్లుగా ఒక్కసారిగా ఐశ్వర్యవంతులయిన వాళ్ళ భాగ్యాన్ని చూచి
ఓర్వలేకనే ఇలా శాపనార్ధాలకు
పూనుకున్నారేమో అనిపించింది. నడమంత్రపు సిరి, నరాల మీద
కురుపు భరించలేముగాని, అదృష్టవశాత్తు వచ్చిపడిన ఐశ్వర్యాన్ని భరించటం ఏం కష్టం ?
నిక్షేపంగా అనుభవించవచ్చు. ఇక్కడ ప్రశ్నల్లా ఏమిటంటే
ఆ ఐశ్వర్యాన్ని ఆ అయ్య ఎలా వినియోగిస్తున్నాడా అనేదే.
నోటిలో
వెండి చంచాతో పుట్టిన వాళ్లయినా,
ఆగర్భ శ్రీమంతులైనా, చేసేవి చండాలపు పనులైతే వాళ్ళ సిరికి సార్ధకత ఏమిటి ?
నడమంత్రపు సిరి వచ్చిన వాళ్లయినా న్యాయబద్ధంగా జీవించే వారయితే వాళ్ళ గతాన్ని గురించి ఆడిపోసుకోనక్కర లేదు. మనిషి మనస్సు,
నడవడిక, ఏ సమయంలోనయినా
మారవచ్చు. ఆ మార్పు దైవ సన్నిధిలో లెక్కించబడుతుంది.
ఓర్పులేని మనుషులు ఆ మార్పును గమనించకుండా పదే
పదే గతాన్ని గుర్తు చేసి మారిన మనుషులను బాధపెడతారు. ఛీ ఛీ అనేది ఈ నోరే శివశివా అనేదీ ఈ నోరే. చెరకు గడ వంకర పోయినంత మాత్రాన
దాని తీపి చెడుతుందా ? అలాగే పాపి పశ్చాత్తాపపడి దైవ క్షమాపణ వేడుకుని కొత్త జీవితం మొదలు పెడితే అది దేవునికి సంతోషదాయకం అవుతుంది. మనకు కూడా అది సంతోష
కారణం కావాలి. మశూచికం మచ్చలు మొహం
మీద సదా నిలిచే ఉంటాయి. అవి మనకు కనిపిస్తూనే
ఉంటాయి. మచ్చలను చూడకుండా ప్రస్తుత ఆరోగ్య స్థితిని చూచి తృప్తి పడాలి. నోటిని అదుపులో ఉంచుకోవాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి