సైనికులే
అలిగితే...
గీటురాయి 29-7-1988
అలుగుటయే ఎరుంగని అజాత శతృడే
అలిగిననాడు,సాగరములన్ని ఏకము
కాకపోవు…
అప్పుడు అయిదారు వేల
ద్రోణులైనా కర్ణులైనా, వాళ్ళ తాత ముత్తాతలంతా ఏకమై వచ్చినా ఏమీ చేయలేరు
అని రాయబారిగా వచ్చిన కృష్ణుడు
బెదిరిస్తాడు. హిప్నటైజ్ చేయజూస్తాడు. సరే, అది పాత సంగతి. అమాయకుల్ని పట్టుకుని వారి మలుగులు విరుగగొట్టడం
తప్ప అలగటం ఎరుగని జాతి ఇంకోటి ఉంది. అదే పోలీసు.
జనాన్ని ఒలుకులకు పంపే పనులు మానుకుని ఈ మధ్య అహ్మదాబాద్
పోలీసులు అలిగారట. వీళ్ళు
అలగటం అరుదే గాని అజాత శత్రువు లేమీ కాదు. కనపడిన
ప్రతి ఒక్కడూ వీళ్ళను చూస్తే కొరివి
దయ్యాన్ని చూచినట్లుగా పారిపోవటాన్ని బట్టి
వీళ్ళు అందరికీ శత్రువులేనా అనిపిస్తున్నది.. ఒక్క
అహ్మదాబాదీయులే
కాదు హైదరాబాదీయులు, ఔరంగాబాదీయులు, ఆలిండియా
బాధీయులు అందరూ వీళ్ళంటే గడగడ వాణికిచచ్చేవాళ్ళే. వీళ్ళ కళ్ళల్లో పడకుండా తప్పుకు పోవాలని చూచేవాళ్ళే అయితే పోలీసులతో శతృత్వం పెట్టుకోవటానికి ఎవరూ సాహసించరు గనుక
వీళ్ళను అజాత శత్రువులు అనవచ్చని కూడా
అనిపిస్తున్నది.
సరే, అలిగారు. అలిగినవాళ్లు వాళ్ళు వాళ్ళవాళ్ళ
ఇళ్ళల్లోనే కూర్చున్నట్లయితే బాగుండేది. వీధి పోరాటాలకు దిగే సరికి సాగరాలన్నీ కాదు గానీ సైన్యాలు మాత్రం ఏకమయ్యాయి. అమరసింహుడు మాత్రం నరసింహుడిలాగా తయారై ఎనిమిది వేల మంది యస్సైలైనా, డెబ్బయి ఎనిమిది వేల మంది డియస్సీలైనా... వాళ్ళు వస్తారు ఛస్తారు రాజీవ్ రాజా
అని ఛాలెంజి చేస్తున్నాడు. దాయాదులంతా పోట్లాడుకుని
కూట్లో దుమ్ము పోసుకున్నట్లు, తమ తమ ఇళ్ళు తగులబెట్టుకున్నట్లుగా
సహోదర సమానులైన సైనికులు పోలీసులు
తన్నుకుని తందనాలు తొక్కుతున్నారు. ఇది
కేవలం ఘాటైన మాటల యుద్ధమే అయినట్లైతే జనం చోద్యంగా
చూచేవారే. కానీ రాళ్ళు రప్పలు,
సీసాలు గాజుపెంకులు, తూటాలు
తుపాకులు, సంఘ విద్రోహ శక్తులు ప్రయోగించే సకల వస్తు
సామాగ్రితో భీకరంగా సాగుతున్న యుద్ధం
గనుక సామాన్య పౌరులు తమ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పలాయనం చిత్తగిస్తున్నారు.
హిరణ్యకశివుడు
వేటకుపోతే నరసింహుడు ఎదురైనట్లుగా ఇరుచుకు తినే పోలీసులకు అమరసింహుడు ఎదురయ్యాడు.
ఇంటి కుక్క మీదకు వేటకుక్కను
ఉసిగొల్పినట్లుగా సైనికులను పోలీసుల మీదికి ఎగదోశాడు. ఇరు ప్రక్కలవాళ్ళు ఎంత చెప్పినా వినకుండా ఏం
చేస్తారో చూస్తానంటూ ఎదురు ప్రశ్నలు
వేస్తున్నాడు. పోలీసు సంఘాల గుర్తింపు రద్దులూ, పోలీసు నాయకుల
ఉద్యోగాల పీకివేతలూ మొదలైన పిచ్చి పనులకు పూనుకున్నాడు.
ఇంకా ఏమి చేస్తాడో ఆయనకే ఎరుక !
దేశంలో
ఇలా జరుగుతున్నది. ఇంతకీ చెప్పదలిచిందేమంటే, జనం తిరుగబడ్డప్పుడు
పోలీసుల్ని వాడుకుంటారు. పోలీసులు తిరుగబడినప్పుడు సైనికుల్ని వాడుకుంటున్నారు. సైనికులు గూడా తిరుగబడితే ఎవర్ని వాడుకుంటారా అన్నది నాలో ప్రశ్నగా
మిగిలిపోయింది. ప్రభుత్వ అధినేతలకు
ఎప్పుడైనా ఈ పరిస్తితి ఎదురుకావచ్చు. కీడెంచి
మేలెంచమన్నారు. భవిష్యత్తులో సైనికులు గూడా తిరుగబడితే వారిని అణిచివేయటం కోసం ప్రజలు, పోలీసులు ఎంత మాత్రం ముందుకు రారు. నాయకులా స్వయంగా సైన్యాన్ని ఎదుర్కోవటానికి
కలలో కూడా సాహసించారు గనుక, రాబోట్లలాంటి వాటిని సిద్ధం చేస్తే బాగుంటుందేమో ఆలోచించాలని ప్రభుత్వానికి నా సలహా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి