నేల మీద పాత పుస్తకాలు
గీటురాయి 5-8-1988
ఆశ కొలది చదివి అరిగించుకొనలేక
కక్కలేక
పుస్తకాల పురుగు
మందు
కొరకు తిరిగె మలబద్దకమ్ముతో
రమ్యహాసలోల
రామకృష్ణ !
అని
ప్రస్తుత అధికార బాషా సంఘం అధ్యక్షులు శ్రీ నండూరి రామకృష్ణమాచార్య గారు ‘తారాతోరణం’ అనే పుస్తకం (1949) లో వ్రాసి
20-1-1960 న ఆనాటి విద్యామంత్రి శ్రీ ఎస్. బి. పి. పట్టాభిరామారావు గారికి ఆ
పుస్తకాన్ని సవినయంగా సమర్పించుకుంటే, సదరు పుస్తకం చెక్కు చెదరకుండా 28 ఏళ్ల తరువాత 24-7-1988 న
ఆబిడ్స్ ఫుట్ పాత్ మీద పాత పుస్తకాలలో దర్శనమిస్తే కొని ఇంటికి తెచ్చాను. మరి ఆ పుస్తకం
చదివి అర్ధం చేసుకునే తెలివి లేకనో, అరగించుకునే శక్తి లేకనో, మలబద్ధకం మందుకోసం ఎక్కడ తిరిగేదిలే అనే భయం చేతనో, అలనాటి మంత్రి పుంగవుడు ఆ తోరణాన్ని చిత్తు కాగితాల వానికి
అమ్మి ఉంటాడు.
పాపం, కృష్ణమాచార్య గారి దొక్కరిదే కాదు చాలా
మంది కవులు తమ స్వహస్తాలతో లిఖించి సమర్పించుకున్న ఎన్నో గ్రంధాలు నాకు ఫుట్ పాత్
దుకాణాలలో దర్శన మిస్తుంటాయి. ఎన్నని కొనేది ? పెద్ద పెద్ద వాళ్ళే చదవటానికి వెరచి విసిరేసిన గ్రంధ రాజాలు
నాకు మాత్రం మలబద్దకం కలిగించవని గ్యారంటీ ఏమిటి అని నేను కూడా వాటిని తాకకుండా
వచ్చేవాడిని. కానీ ఈ తోరణం కాస్త ముళ్ళు లేకుండా సరళంగానే ఉన్నట్లు కనపడి మెడకు
చుట్టుకొచ్చాను.
ఇంతకీ
పాత పుస్తకాలమ్మే వాళ్ళు వ్రాతగాళ్లకు చదువరులకు చేస్తున్న సేవ అంత ఇంతా కాదని చెప్పవచ్చు. పాకీ వాళ్ళు లేకపోతే ప్రజలకు ఎంత కష్టమో పాత పుస్తకాలు, పేపర్లు కొనేవాళ్ళు లేకపోతే గూడా అంతే కష్టం. ఎందుకంటే పాకీవాళ్ళు రాకపోతే ఆ పని మనమే
చేసుకోగలం. అంటే రోజూ ఇల్లు ఊడ్చుకునే మనం వీధిలో కూడా
ఓ చీపురు వేయగలం. ఊడ్చిన చెత్తంతా అవతల పారవేయగలం. కానీ పాత పుస్తకాలను
ఎలా పారవేయగలం ? అలాగని ఎక్కడ అమ్మిరాగలం ? అందుకే పాత పుస్తకాలవాళ్ళు
ఆపద్భాంధవులు, అనాధ రక్షకులు, మహా మధ్యవర్తులు, అన్ని వర్గాల వారికి ఆప్తులు అంటాను.
పాత
ఒక రోత, కొత్త ఒక వింత అంటారు. కొత్త ఎద్దుపేడ
ఇంటిల్లిపాదీ ఎత్తినట్లుగా కొత్త పుస్తకాలను ఎగబడి
కొని చదువుతారు. కొందరైతే తన్నుకొని చింపుతారు కూడా. సరే. అది పాతబడగానే మోజు
తీరగానే, ఏ చిత్తు కాగితాల వాడికో అమ్మేస్తారు. అక్కడి నుండి అది అలా అలా ప్రయాణించి, మరీ పాతదై ఎప్పటికో ఏదో ఒక ఫుట్ పాత్
మీదకు చేరుతుంది. ఒల్దీజ్ గోల్డ్ అంటూ పాత బంగార కోసం వెదుకులాడే తాతయ్యలకో లేక
నాలాంటి వెనుకబడిన జాతి యువకులకో అదే కనుల విందు చేస్తుంది. ఆ పాత పుస్తకాల పాపి
కూడా పాత పుస్తకాల పురుగే అయ్యుంటే, దాని ధర మన ఆత్రమంత గానే పెరిగి, కొననియ్యకుండా, వెనుదిరిగి వెళ్లనియ్యకుండా, తైతక్కలాడుతుంది. జేబుకు పట్టిన చిలుము వదిలించుకుని, కొన్న పాత పుస్తకాల మూట ఇంటికి వేస్తుకొస్తే, ఇంట్లో శ్రీమతి కొత్తగా విడుదలయిన ఓ నవలా లేదు సవలా లేదు, మట్టికంపు కొడుతున్న సనాతన గ్రంధాలు చంక నెట్టుకొచ్చావు. ఈ
ఇంట్లో పెట్టుకోను గూడా చోటు లేదని సతాయిస్తుంది. పాత చేటకు పూత అందం అన్నట్లుగా వాటిని కాస్త నవీన నవల
ముఖ పత్రంలాగా డెకరేట్ చేయిస్తే,
అలాంటి ప్రమాదం ఉండదు. పాతగుడ్డ కుట్టు నూలు చేటు అన్నట్లుగా గనుక ఉంటే, అలాంటి పరమ పాత పుస్తకాన్ని భార్య కంట
పడకుండా ఎక్కడో దాచుకోవాలి.
ఫుట్
పాత్ మీద పరచిన పాత పుస్తకాలను ఏరుకోవటం త్వరగా చూడటంలో, మనసైన వాటిని మరొకడి కంటే ముందే
ఎంచుకోవటంలోను, మనం ఎంచుకున్నదే కావాలని మరొకడు వేలం పాటకు ఎగబడినప్పుడు
జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే అలాంటి పరిస్థితిలో శూరత్వం వహించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి