కులము కోసం…
గీటురాయి 22-7-1988
‘పాడవోయి భారతీయుడా
ఆడిపాడవోయి
విజయగీతికా’ అన్న మహాకవే ‘కుల మత బేధాలు భాషాద్వేషాలు చెలరేగే నేడూ, ప్రతి మనిషి మరియొకని దోచుకునే వాడే, తన
స్వార్ధం తన భాగ్యం చూచుకొనేవాడే,
స్వార్ధమీ అనర్ధ కారణం అది చంపుకొనుటే క్షేమదాయకం’
అని సలహా యిచ్చాడు.
అయితే మా
స్వార్ధమే పరమార్ధం, నీ బోడి సలహా ఎవడికి కావాలి అంటూ నేడు మన జనం కుల గీతాలు గొంతెత్తి మరీ
గానం చేస్తున్నారు. స్వాతంత్ర్య
దినోత్సవ వేడుకలు వెలవెలబోయేలా అంగ రంగ వైభోగంగా కుల మహాసభలు
జరుపుతున్నారు. సకల కులాల ఓట్లతో గెలిచిన పెద్ద మనుషులు
వారి కుల సభల వేదికలెక్కి ‘కుల విద్యకు సాటిరావు గువ్వలచెన్నా’ లాంటి స్లోగన్లు చేస్తున్నారు. ఏ కులమూ
నీదంటే గోకులము నవ్విందట వెనుకటి
రోజుల్లో. ఇప్పుడు మాత్రం నవ్వటం ఆపి గోకులమంతా నివ్వెరపోవలసిందేనన్నట్లు
కుల రణరంగం తయారయ్యింది. కార్వేటి సంస్థాన
కవి పోలిపెద్ది వెంకట రాయుడు అనే విప్రుడు ఇతర కులాల కవుల్ని ఇలా అడ్డగించి ఎగతాళి చేస్తాడు ఆ రోజుల్లోనే : -
“దూదేకుల
హుసేను దొమ్మరి గోపాలు
పట్రమంగడు గాండ్ల బాలిగాడు
బయశేని నాగడు పటసాలె నారాయడు
అగముడి లచ్చిగాడా ముకుందు
చాకలి మల్లడు
సాతాని తిరుమల
గొల్ల కాటడు
బెస్త గుర్విగాడు
కోమటి
శంభుడు కుమ్మరి చెంగడు
మంగలెల్లడు
బోయ సింగడొకడు
కన్న వారెల్ల పండితుల్ కవులుగాగ
వేదశాస్త్రంబు
లేడను విప్రులేడ
?”
ఇక
వంకాయలపాటి వేంకటకవి అనే నియోగి బ్రాహ్మణుడైతే “కవి
పురుష ప్రతీకాశులై మాలలు,
తమ్ముళ్ళు, మంగళ్ళు, నంబులు బలువెజ్జులైరి
భూతలమునందు.. ఔరా ఈ యుగ ధర్మంబు లరయ మదికి విస్మయ
కరంబులై గనిపించుచుండె” అని నెత్తీ నోరూ కొట్టు కుంటాడు.
ఇప్పుడు
సైతం జరుగుతున్నది అదే. పై బ్రాహ్మణ కవులిద్దరూ ఈనాడు
బ్రతికి ఉన్నట్లయితే ఇంకెంత లబలబలాడేవారో ! అయితే వాళ్ళు పైన పేర్కొన్న కులాలన్నీ పవర్
చేజిక్కించుకోలేక పోయాయి. “బ్రాహ్మణుల్ని
సాగనంపి రెడ్లు, రెడ్లను రైలెక్కించి కమ్మవాళ్ళు
రాష్ట్రాన్ని పాలించారు. ఇంత మంది కాపులం చూస్తూ కూర్చోవలసిందేనా”
అని “కాపు తెలగ బలిజ
ఒంటరి” అనే వాళ్ళు ఒక్కుమ్మడిగా లేచి కూర్చున్నారు. ఈ (కా. తె.
బ. ఒం) కులాన్ని పై జంట వేంకట కవులు చీత్కరించిన కులాల జాబితాలో కలపాలని కూడా వారు కోరారు. ఎప్పుడో వెనకబడిన కులాలుగా గుర్తించిన
కులాలు ముందుబడకపోగా మరిన్ని కులాలు వచ్చి తమలో కలుస్తుండటం
చూచి కుటుంబ నియంత్రణ కార్యక్రమం లాగానే కుల నియంత్రణ
కార్యక్రమం ఏదైనా ప్రభుత్వం చేబడితే బాగుండునని మరీ
బాగా వెనుకబడిన కులాల వాళ్ళంతా
కోరుకుంటున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన
అవుతుందని భయపడుతున్నారు. ఇప్పటికే కిక్కిరిసి ఉన్న తమ కులాలను శరణార్ధుల శిబిరాల్లాగా మార్చవద్దని వేడుకుంటున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి