పుట్టుక పరమార్ధం తెలుసుకో పుత్రా ! గీటురాయి 29-4-1988
ఈనాడే బాబూ నీ పుట్టిన రోజు
ఈ ఇంటికే కొత్త వెలుగు తెచ్చిన
రోజు ||ఈనాడే||
అంటూ అమ్మ నాన్నలు
అబ్బిగాడి పుట్టిన రోజును అట్టహాసంగా జరుపుతుంటారు. చాకు తోటి కేకు ముక్కలు
కోయించి నోళ్ళు తీపి చేస్తారు. నిక్షేపం లాంటి కొవ్వొత్తులు కేకు చుట్టూ నిలబెట్టి
నిప్పు ఆర్పిస్తారు. హేపీ బర్త్ డే టూయూ అంటూ ఎగిరి గంతులేస్తారు. అయితే అబ్బిగాడు
ఎదిగి అందరికీ ఆనందకరంగా తయారవుతాడో కళ్ళకు పొగపెట్టే రకం అవుతాడో వాడిని కన్న
తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. అందుకే కాబోలు ఒకాయన : -
పుట్టిన రోజు పండుగే
అందరికీ
మరి పుట్టింది ఎందుకో
తెలిసేది ఎందరికీ ||ఎందరికీ||
అంటూ ఎదురు ప్రశ్న
వేశాడు. ప్రతి మనిషి కూడా తన జన్మకు పరమార్ధం తెలుసుకోవాలంటాడు. ఇంత గారాబం చేసి పెంచిన కొడుకు ఇంట్లోంచి తరిమేసే రకంగా తయారయితే
ఆ కన్న వాళ్ళ కన్నీళ్ళకు అంతెక్కడ? ఇంతకాలం వాడిని గుండెలమీద మోసి పెంచిన
శ్రమకు విలువెక్కడ?
అందుకే ఒక మతిమంతుడు
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు పుట్టగానే కలగదు,వాడి సుగుణాలను ప్రజలంతా పొగిడే రోజున
కలుగుతుంది అన్నాడు. ఇక ఆ పుట్టిన వాడు గనుక కొరగాని వాడైతే వాడు కొరగాకుండా పోవటమే గాక తండ్రి గుణాలు గూడా చెరుస్తాడట. చెరుకు గడ చివర్న వెన్ను పుట్టి చెరుకులో తీపి మొత్తం చెరిచి పారేసినట్టుగా ఈ కొరగాని కొడుకు తండ్రికి మిగిలి ఉన్న కాస్తో కూస్తో పరువు ప్రతిష్టలన్నీ
కబళించి వేస్తాడు. రోజు కొక తగాదా ఇంటి మీదకి తెస్తాడు. పచ్చటి ఫలవృక్షం మీద
పుట్టగొడుగులాగా వ్యాపించి సారాన్ని గుంజి పారేస్తాడు.
“కడుపు చించుకు పుట్టిందొకరు – కాటికి
నిన్ను మోసిందొకరు” అన్నట్లుగా కన్నవారి అంత్యక్రియలకు
సైతం అతిధుల్లాగా హాజరయ్యేవారు” , ఎటైనా పారిపొయ్యే వారు,
ఆ పని సమాజానికే వదిలేసే వారు కూడా ఉంటారు.
ఇలాంటి వాళ్ళను కాస్త
సరైన దారిలో ఉంచటం కోసమే జానపదులు గూడా ఇలా పాడుకుంటారు : -
“ఇల తలిదండ్రులే తొలిదైవములని తలచిన వాడే పుత్రుడు
ఎందుకొచ్చె నరజన్మంబని యోచించిన వాడే పుత్రుడు
అందరిలో అపకీర్తి
దెచ్చి దుః ఖించిన వాడే శత్రుడు”
ఫరో, హేరోదు మొదలైన రాజులు తమ జన్మదిన
వేడుకలను రంగ
రంగ వైభోగంగా విందులు విలాసాలతో
జరిపించినట్లు హోలీ బైబిల్ లో ఉంది. సొలోమోను చక్రవర్తి “జన్మదినం కంటే మరణ దినం మేలు” అంటారు. ఎందుకంటే “బాధించబడే (ముసలి) వారు ఆదరించే దిక్కు లేక
కన్నీళ్ళు విడుస్తారు. వారిని బాధపెట్టే (కుర్ర) వాళ్ళు బలవంతులు కాబట్టి ఆదరించే వాళ్ళు ఉండరు. కాబట్టి బ్రతుకుతున్న
వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళకంటే ఇంకా పుట్టని
వాళ్ళు ధన్యులు” అని అంటాడు. “ఒకడు నూరు మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలం జీవించినా,
అతను సుఖానుభవం ఎరుగక,
తగిన రీతిలో సమాధి చేయబడకపోతే అతని
గతికంటే పడిపోయిన పిండం గతి మేలు” అని తీర్మానిస్తాడు.
చిన్నప్పటి నుండీ సొలోమోను గారి భావాలే నాకూ వంటబట్టినందువల్ల
ఈ పుట్టిన రోజు పండుగలకు దూరంగా ఉండేవాడిని. మొన్న
ఏప్రిల్ 18 వ తేదీన నా 30 వ పుట్టిన రోజు నాకు తెలీకుండానే గడిచిపోయింది. ఆ మరునాడే ఓ మిత్రుడు తన కొడుకు ‘స్వీటీ’
బర్త్ డే పార్టీకి రావాల్సిందనీ,
కోడి మాంసం విందు ఆరగించి వెళ్ళమనీ ప్రాధేయపడ్డాడు.
పుట్టిన రోజు పండుగల గురించి ఆ రోజు నా మెదడులో తిరిగిన
రీలు మీ ముందు ఉంచుతున్నాను. నా అభిప్రాయాలూ కరెక్టో కాదో కాస్త
ఆలోచించి చెప్పమని ఉబుసుపోక రీడర్లకు మనవి చేస్తున్నాను. మీ పిల్లలకు పుట్టిన రోజు పండుగలు జరపటంలో నాకు
అభ్యంతరం లేదు గాని వారు
పెరిగి సంస్కారవంతులయ్యేలా చూచుకోండి.
https://www.facebook.com/nrahamthulla/posts/1169370386428283
రిప్లయితొలగించండి