నడుం బిగిస్తేనే పదిలం గీటురాయి 13-5-1988
నడుము
చూడు నడుమందము చూడు
నడుముకు ఉన్న బిగువును చూడు
ఓ మగడా నే మునుపటి వలెనే లేనా ?
అంటూ ఓ నెరజాణ తన నడుము నాలుగు వంకరలుగా
తిప్పి మగణ్ణి సముదాయిస్తుంది. “కందిరీగ నడుము దానా కంచిపట్టు రవికదానా ?” అంటూ
ఓ వయ్యారిని వర్ణిస్తూ ఒక నడి వయస్కుడు వివశుడైపోతాడు. మనిషి దేహంలో నడి మధ్యన ఉన్న భాగం గనుక దీన్ని నడుము అన్నారట. ఈ నడుముకు ఉన్న ఇంపార్టెన్స్ అంతా ఇంతా
కాదని నాకు ఈ మధ్యనే అనుభవపూర్వకంగా
తెలిసింది.
నడుము
మునిగే దాకనే చలి నలుగురు వినే దాకనే సిగ్గు అన్నారు. నడుము మునిగిందంటే ఇక ఎముకలు కొరికేంత చలి అయినా మనకు లెక్కా జమా ఉండదన్న మాట. సంస్కృతం తెలిసిన వాళ్ళయితే ఈ నడుమును అవలగ్నము,
కౌను, క్రోఢము, మధ్యమము లాంటి ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. పేరు ఏదయినా అర్ధం
మాత్రం ఒకటే అన్నట్లుగా నడుము అంటే నడుమ భాగం అని తేలుతున్నది.
పోట్లాటలో పైపైకి వచ్చే వాడిని చూచి
నడుములు ఎగబట్టుకొని వస్తున్నాడు
అంటారు. ఏదైనా ఒక పనిని చేయాలని పూనుకోవటాన్ని
నడుము బిగించటం అంటారు. దేవుడు కూడా
తన ప్రవక్తలకు పనులు అప్పజెప్పి నడుము కట్టుకొని చెప్పులుతొడుక్కొని బయలుదేరమని అజ్ఞాపిస్తాడు.
18 సంవత్సరాల పాటు బలహీనపరచే దయ్యం పట్టి నడుము వంగిపోయి సరిగా నిలబడలేని స్త్రీని
ఏసుక్రీస్తు వారు స్వస్థపరచినట్లుగా లూకా
సువార్త లో ఉంది.
నడమంత్రపు సిరి నరం మీద పుండు
భరింపరానివి అంటారు. నడుము నొప్పి అంతకంటే
భరించరానిది అని నా అభిప్రాయం. శరీరంలోని నవనాడులు
నడుము అనే సెంటర్లోనే కలుస్తాయట. ప్రభుత్వం పన్నులు పెంచి ప్రజల నడుములు విరుగగొడుతూ ఉంటుంది. నవనాడులూ జివ్వుమనిపిస్తుంది. గుర్రానికి నడుము
విరిగితే ఇక అది ఎందుకూ పనికి రానట్లే
అవుతుంది. వసూలైన డబ్బంతా గుప్పిట్లో ఉంచుకొని కేంద్రం రాష్ట్రాలతో చతురులాడుతూ ఉంటుంది. రాష్ట్రాలు నడుం విరిగిన గుర్రాలాగా బాధపడుతూ ఉంటాయి.
మే 22 నుండి 28 వరకు
జరిగే తెలుగు మహానాడు మహోత్సవ సందర్భంగా నడుముకు పని కలిగించే రకరకాల పోటీలను
అన్నగారు ప్రకటించారు. ఎడ్లలాగుడు, కబాడి, కుస్తీ, టగ్ ఆఫ్ వార్,
పరుగు, సైకిల్ తొక్కడం, మినుముల బస్తా మొయ్యడం లాంటివన్నీ నడుములు ఎత్తకుండా ముగ్గులు వెయ్యడం లాంటి
పనులకు రాటుదేలి రమ్మని అన్నగారు ఆహ్వానించారు. ఇక బుర్రకథలు,
హరికథలు, చెక్కభజనలు, కోలాటాలు,
నృత్యాలు అన్నీ నిలువుగాళ్ళ మీద నిలబడి తిరుగుతూ నడుములు అవిసిపోయేలా చెయ్యాలి.
చొప్పలాంటి రెండు రూపాయల బియ్యం, కీళ్ళు నడుము నొప్పులు తెచ్చే పామోలీన్
నూనె వాడుతూ ఉన్న పేద జనం ఇందులో బహుమతులు గెలుచుకోలేకపోవచ్చు. ఏమైనా నడుములు
దిట్టంగా ఉన్న వాడికే మహానాడులోగానీ మరెక్కడైనా గాని ప్రైజు వస్తుంది.
ఎన్జీవో నాయకులు తమలోతామే తన్నుకొని
నడుములు విరగ్గొట్టుకున్నారట. కూర్చుంటే లేవలేని స్థితిలో పడ్డారట. కుంటోడి తిప్పలు కుంటోడివి గూనోడి తిప్పలు గూనోడివి అన్నట్లుగా వీలుంటే ఇదే అదను అంటూ
అన్నగారు దున్నపోతులాంటి పదవినెక్కి యమపాశాలు బిగిస్తూ తమాషా చూస్తున్నారు.
అందుకే ప్రజలారా,
ఉద్యోగులారా, మీ నడుములు కాపాడుకోండి. అలివిగాని పనుల జోలికి పోకండి. ఇంతకీ
నా అనుభవం మీకు చెప్పలేదు. ఇరవై అయిదు కిలోల బరువైన రోలును అవలీలగా లేపగలననే ప్రయత్నం
చేస్తే నడుము కలుక్కుమన్నది. నాలుగు రోజులపాటు నడుమునొప్పితో తీసుకున్నాను. నమాజుకు
సైతం నడుములు వంగలేదు. నడుము నొప్పి మందులకి నలభై ఎనిమిది రూపాయలు ఖర్చయ్యింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి