కాదేది చౌర్యానికనర్హం
గీటురాయి 30-9-1988
“అన్నదమ్ములు కర్మమని మొత్తుకొందురు
అక్క చెల్లెండ్రు హా! యనుచు నుంద్రు
చుట్టాలు పదుగురు చుల్కగా జూతురు
తల్లి లోలోపల దృళ్ళుచుండ్రు
ఙ్ఞాతివారలు చాలా చప్పట్లు గొడుదురు
వదినెగారులు దెప్పి గదుముచుండ్రు
ఇరుగు పొరుగుల వార లిండ్లకు రానీరు
పెండ్లిండ్లకైనను పిలువరెవరు
శ్రీహరీ ! దొంగతనమెంత చెడ్డ తప్పు ?
ఎంచగా ఈడు దానికి ఏది లేదు !”
అని ఆనాడు
వంకాయల పాటి వారన్నట్లుగానే బెన్ జాన్సన్ ‘పని’ అయ్యింది. బెన్
జాన్సన్ ఒక్కడే కాదు ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన మరో ఏడుగురు దొంగల పరిస్థితి కూడా ఇలానే అయ్యిందట. దొంగపనులు చేస్తూ పట్టుబడిన వాళ్ళను పల్లెటూళ్లలో అయితే చెట్లకు కట్టేసి తంతారు. పట్టణాలలో అయితే
పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. ఒలింపిక్స్ లో అయితే ఇచ్చిన పతకాలు లాగేసుకుని ఇక ఇంటికి పద అంటారు. కాకపోతే ఛీ ఛీ, ఎంత అవమానకరమయిన పని చేశావయ్యా అని కూడా అంటారు. తిట్టినా, కొట్టినా చీదరించుకున్నా
దొంగవాడి దృష్టి మూట మీదనే ఉంటుందనే మాట నిజమే. మూట కాజేసేందుకు వాడు ఎన్ని అడ్డమయిన పనులైనా చేస్తాడు.
ఇక
దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్లుగా చాలా మంది దొంగదొరలు తప్పించుకు తిరుగుతూనే ఉన్నారు. దొంగ చెయ్యి దోపన బెడితే అమావాస్యనాడు అల్లలాడిందంట ! సవాలక్ష నీతులు చెప్పినా దొంగవాడి బుద్ధి కన్నం వేసేందుకే దౌడు తీస్తుంటుందని వాడుక. దొంగకు దొరికిందే చాలు అన్నట్లుగా ఏదిబడితే అది,
ఎంతబడితే అంత దొంగలించేవారూ ఉన్నారు.
దొంగకు భయము వేశ్యకు సిగ్గు పనికిరావంటారు. మంగలం దొరికినా సరే
దొంగిలిచాల్సిందేననే సిగ్గూ శరంలేని రకం దొంగలు ఈనాడు ఎక్కువయ్యారు. దొంగిలించేటంత దొరతనముండగా, అడుక్కుతినేటంత అదవతనమేల
అని దేశ సంపదను దొంగిలించి విదేశీ బ్యాంకుల్లో
దాచి నిజాయితే పరుల్లాగా ఫోజులిస్తున్న నాయకులకీ దేశంలో లెక్కలేదు. దొంగ గొడ్డుకు గుడికట్టినట్లుగా అదే వినాయకులకు ఓట్లువేసి నెత్తినేక్కించుకుంటున్న ప్రజలకూ
లెక్కలేదు. దొంగకు అందరి మీదా అనుమానమే.
ఇరుగుపొరుగు సాక్షులు తన వ్యవహారం ఎక్కడ బయట పెడతారోననే
భయంతో తనకు “ పరువు నష్టం” కలిగించొద్దని పెద్ద పరువుగల వాడిలా వాళ్ళను భయపెడతారు. దొంగతనం
రుజువై పెద్దలూ, పత్రికలు
ఇదేమని నిలదీస్తుంటే నాకేపాపం తెలీదు నాకే ముడుపులూ అందలేదు. నేను కేవలం ఉత్త ప్రేరకాలు మాత్రమే వాడాను నా దొంగతనమే నిజమైతే
అవమానంతో క్రుంగిపోనా ? ఎలా నిక్షేపంగా ఉన్నానో చూడండి అని ఎదురు ప్రశ్న వేస్తాడు.
ఇంతకీ
ఈనాడు ఏదిబడితే అది దొంగిలిస్తున్నారనే విషయానికి తిరిగొద్దాం. ఒలింపిక్ పతకాలు, విదేశీ రుణాలు, తుపాకులు,
సిమెంటు, ఇనుపకడ్డీలు, ఇంటి ముందు పారేసిన చెత్త... ఇలా ఏదైనా సరే “కాదేదీ చౌర్యానికనర్హం” అంటున్నారీనాటి దొంగలు, తిరుచ్చిలోని ఓ క్రైస్తవ శ్మశాన వాటికలో కొంతకాలం నుంచి సమాదులలోని శవపేటికలు మాయమైపోతున్నాయట. రాయ్ ఫేలిక్స్ అనే కాటికాపరి
అర్ధరాత్రిళ్ళు సమాధుల్ని తవ్వి శవపేటికల్ని దొంగలించి అమ్ముకుంటున్నాడట. పోలీసులు మాటేసి అయ్యను
పట్టుకుని ప్రశ్నిస్తే అప్పటిదాకా దాదాపు అయిదొందల
పేటికలు కాజేసి అమ్ముకున్నట్లు చెప్పి పళ్ళు
ఇకిలిస్తే పోలీసులకు నోటమాట రాలేదట!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి