1, అక్టోబర్ 2012, సోమవారం

రేపు మనసంగతీ అంతే


                  రేపు మనసంగతీ అంతే                                                                                                               (ఉబుసుపోక గీటురాయి 5-5-1988)

          నెరవేరింది. అక్షరాలా నెరవేరింది. నమాజు చెయ్యబోతే మసీదు మీద పడ్డట్లు అనే సామెత కర్నూలు జిల్లా కాడుమూడు గ్రామంలోని నూర్ అహ్మద్ అనే టీచర్ విషయంలో నిజంగానే నెరవేరింది. (ఆంధ్రపత్రిక 2-5-1988) . గుడికూలును నుయ్యి పూడును అని గువ్వల చెన్నడు ఆనాడే తెగేసి చెప్పాడు. ఎవరి మరణం ఎలా సంభవిస్తుందో ఈశ్వరునికే ఎరుక అని ఒక భైరాగి తత్వం పాడాడు. ఎప్పటికైనా మృత్యువు తప్పదని ఎరిగి యుండి తగిన చికిత్సతో  దాన్ని తప్పించటం తెలియక, అవతలి ఒడ్డుకు కుప్పించి దూకిపోయిన వాణ్ణి చూచి ఎడుస్తారెందుకో బ్రతికున్న వెధవలు అని ఆయన బోరున ఎడ్చాడు.

           పొరుగూరికి పోయినంత మాత్రాన దుర్దశ తప్పిపోతుందా? సన్నికల్లు    
దాస్తే మాత్రం పెండ్లి ఆగిపోతుందా? డొంకలో దాక్కుంటే పిడుగుపాటు తప్పుతుందా? కాలు అడ్డం పెడితే జలపాతం నిలుస్తుందా? వర్షాలు కురవకపోతే సముద్రం ఇంకిపోతుందా? భర్త చిన్నవాడైనంత మాత్రాన వైధవ్యం తప్పుతుందా? అసలు జరగవలసింది జరుగక తప్పుతుందా? నుదుట వ్రాసిన రాత నులిమితే పోతుందా ? సమాధానం చెప్పు ! చెప్పకపొయ్యావా నీ తల ముక్కచెక్కలైపోతుంది చెప్పు అంటూ నా చొక్కా కాలరు పట్టుకుని నిలదీశాడు నాలోని విరాగి.

          అడగమే వృత్తిగా గల ఆత్మారాముడే అడిగినప్పుడు చెప్పక చస్తానా?ప్రసూతి వైరాగ్యం ఒంటి చ్చి ఆరినదాకనే అన్నట్లుగా శ్మశాన వైరాగ్యం     తిరిగి ఊరి సెంటర్లోకి వచ్చిన దాకనే అన్నాను. గుళ్ళు గోపురాలు కూలి    ఎంత మంది చావలేదు ? తిరునాళ్ళకు పోయి తొక్కిసలాటల్లో ఎంత మంది కైలాసానికి ఎక్కి పోలేదు ? కొండ కొమ్ముల మీద నుండి బస్సులు దొర్లిపడి ఎంతమంది స్వర్గానికి మరలిపోలేదు? మక్కాలోనే ఎంతమంది చావలేదు?ఇంటిలో బంధుమిత్రుల సపర్యలతో చచ్చిన వాడికీ, వీధి అరుగు మీద నిద్రపోతూ చచ్చినవాడికీ, గుడిలోని విగ్రహం ముందు సాష్టాంగపడి చచ్చిన వాడికీ నా దృష్టిలో తేడా ఏమీ లేదు. ఎందుకంటే అందరూ కేవలం చచ్చారు అంతే.

          బతికితే డయేరియా,చస్తే కలరా అన్నట్లుగా ఒక్కోరకంగా చచ్చిన వాళ్ళకు, ఒక్కోరకంగా చావుతప్పి బ్రతికిన వాళ్ళకు, ఒక్కో రకమయిన పేర్లు పెడతాము. ఒక్కోరకమైన విలువనిస్తాము. చచ్చిపోయిన వాళ్ళను చూచి   గాలి బుడగ జీవితం ఓటి పడవ యవ్వనం అని మనలో మనమే (బ్రతికున్నవాళ్లం) చెప్పుకొని ఇవతలికి వచ్చి మళ్ళీ పాడు మజాకాలు చేస్తుంటాము. శవపేటికను శ్మశానంలో దింపినప్పుడు కలిగిన బలమైన      ఆలోచనలు తిరిగి బజారులోని మిఠాయి అంగడి దగ్గరకో మాంసం దుకాణం   దగ్గరకో రాగానే చటుక్కున  ఎ గిరిపోతాయి. సమాధిలోకి దిగిపోయిన వాడి  ఘోష ఎవడు వింటున్నాడో గాని నకు మాత్రం చిటికెలోనే మైమరుపు  వస్తుంది. మళ్ళీ సరసాలు విరసాలే మన సదాచారాలౌతాయి.

              దాగబోయి తలారి ఇంట్లో దూరినట్లుగా కొందరు కోరి చావు      తెచ్చుకుంటారు. అగ్నికి ఆహుతి అవుతున్న భవనం మీద నుంచి దింపే వాళ్ళకు చిక్కకుండా తొందరపడి దూకి చచ్చేవాళ్ళు, దారినపొయ్యే కంపను   నెత్తికి తగిలించుకొనే వాళ్ళు ఇలా నానారకాలుగా ఉంటారు.      శ్యామలాకారుడమ్మా ఈ బిడ్డ శానాళ్ళు  బ్రతుకమ్మా అంటూ అమ్మ లక్కలు జోలపాడుతుండగానే పసిబిడ్డ చస్తాడు. బిడ్డ చచ్చినా బారసాల  మాత్రం మా బాగా జరిగింది అనుకుంటారు. ఏమి జన్మంబేమి జీవనము? మాయ ఘమా ! ఇకనైనా తెలుసుకో నిజమూ ! అంటూ తాంబూర్ర కీర్తనలకు తలాడిస్తుంటాము. తెలుసుకోగలిగింది ఏముంది నా తల కాయ! దుష్టుడు దేవాలయంలో పూజ చేస్తూ చచ్చినా, నీతిమంతుడు      మురుగుకాల్వలో జారిపడి చచ్చినా మనం ముక్కుమీద వేళ్ళేసుకొని మూడుగంటల పాటు వాళ్ళను గురించి ఆలోచన చేయనవసరం లేదు. రేపు   మన సంగతీ అంతే గదా అనుకోవాలి. లేదా ఎలా ఉంటుందో గదా అని ఆలోచించాలి. ఏమైనా దేవుని తరాజులో మన పుణ్యకార్యాల బరువును పెంచుకోవాలి. చావు రూపంలోనైనా రావచ్చు. సత్కర్మలే కదా ఈ జన్మలోనైనా చనిపోయిన తరువాత అయినా     మనల్ని ఆదుకునేది.
---నూర్ బాషా రహంతుల్లా ,ఉబుసుపోక గీటురాయి 5-5-1988

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి