ఇరుకింటి భాగోతం గీటురాయి 18-5-1988
పస చెడి అత్తింట పడి యుండుటది రోత
పరువు తప్పిన యెడ
బ్రతుకు రోత
ఋణపడి సుఖమున
మునిగి యుండుట రోత
పరుల కలిమికి దుః
ఖపడుట రోత...
అంటూ తెగ రోత చెందిన
కవివర్యుడు “ఇరుకు ఇంటిలో నివసించుట మహా పెద్ద రోత” అని ఎందుకు అనలేదో నాకు అర్ధం కావటం
లేదు. “ఇరుకు ఇంటిలో సరుకు దించటం ఇంకా ఎంతో
రోత” అని ఎందుకు వ్రాయలేదో నాకు అంటు బట్టటం
లేదు. పస చెడి అత్తగారింట్లో పడి ఉండటం (ఇల్లరికము=ఇల్లు+ఇరకము) రోత అని
తెలుసుకోగలిగాడంటే అతని అత్తగారి ఇల్లు ఇరుకైనదై ఉండవచ్చు. ఇటొస్తే ఇటు తన్ను అటు
పోతే అటు తన్ను తగిలి ఉండవచ్చు. ఇంట్లో వాళ్ళ ఛీత్కారాలు చీదరింపుల నుండి మొహం
చాటు చేసుకోటానికి కూడా రెండో గది ఉండకపోవచ్చు. అసలు అత్తగారి ఇల్లే ఒక పుంగనూరు
సంస్థానం లాగా అతనికి అనిపించి ఉండవచ్చు. నా పరువు గంగలో కలిసింది దేముడోయ్ అంటు
పిచ్చివాడిలా జుట్టు పీక్కుంటూ చివరికి బ్రతుకు మీదనే రోత పెంచుకుని ఉండవచ్చు.
కవిగారి జీవితం ఇంత రోతగా తయారు కావడానికి అత్తగారి ఇల్లు ఇరుకైనదవటమే కారణం. అదే
ఓ విశాలమైన భవనం అయ్యుంటే అల్లుడి గారి జాతకం ఎంత బాగుండేది ! ఈ
గదిలో చీదరించుకుంటే ఆ మూల మరో గదిలో దాక్కుని భోజనాల వేళకు హాజరయ్యే వాడు. పీట
పగిలేటట్లు, మొలత్రాడు తెగేటట్లూ, పీకల దాకా తిని పనులకు
ఎగనామం పెట్టి హాయిగా పక్క గదుల్లో పడుకునే వాడే. ఉన్నది ఒకటే రూమ్ అయితే
ఇక
తప్పుకునే వీలు లేక ఇంటిల్లిపాది పనీ
నెత్తినబడి బ్రతుకు రోత వెయ్యదూ ?
ఒక వేళ ఇల్లరికం వెళ్ళకపోయినా
ఇల్లు ఇరకాటం గాను ఆలుమర్కటం లాగాను ఉంటే వాడి బ్రతుకు గూడ రోత గానే ఉంటుంది. కొంప
అంటుకపోతున్నదే అంటే నీళ్ళ బాన నిప్పుల దగ్గర పెట్టి నవ్వుకునే పెళ్ళాంతో ఎలా
వేగటం ? జానెడు ఇంటిలో మూరెడు కర్ర అన్నట్లుగా పెట్టంత ఇంటిలో గంపెడు
పిల్లల్ని పెట్టుకుని వాళ్ళను సముదాయించలేక చచ్చే వాళ్ళను సవాలక్ష మందిని చూచాను.
కొంప చెరుపకురా సుపుత్రా అని గొంతు చించుకొని అరచినా వాడు మూలనున్న కర్ర ముంగిట్లో
తెచ్చి వెయ్యక మానడు.
ఇక ఇద్దరు పెళ్ళాల మగడు
ఇరుకునబడి చచ్చాడు అంటారు. ఒక్క పెళ్లాన్ని ఆమె కన్న పిల్లల్ని ఉంచటానికే సరైన
ఇల్లు లేక అలమటించే అయ్య మరో పెళ్ళాన్ని కోరి బ్రతుక గలడా?
ఇద్దరు భార్యలూ కలిసి అతన్ని ఇరుచుక తినరా ? అప్పుడెప్పుడో పాత రోజుల్లో వాళ్ళ
పప్పులు ఉడికాయి గాని ఇప్పుడైతే వల్ల గాని పనిలాగానే కనబడుతున్నది. నన్నడిగితే
ఇరుకును మించిన శిఖ, గోచీకి మించిన దారిద్ర్యం లేవు అంటాను. ఇరుకు ఇళ్ళల్లో ఎంత
మంది ఉన్నారో ప్రభుత్వం లెక్కలు తియ్యలేదు గాని మురికి వాడల్లో మూడు కోట్ల మందీ అసలు ఇళ్లే లేని వారు 24 కోట్ల మందీ ఉన్నారని జాతీయ నిర్మాణాల సంస్థ అంచనా వేసింది. కుమ్మరి ఆవంలో గచ్చకాయ
వేసినట్లుగా గండం గడిచి పిండం బయటపడినట్లుగా పార్లమెంటు సమావేశాల్లో కొన్ని
కిరాతకమైన ప్రకటనలు వెలువడ్డాయి. గాడిదలాగా పరుగెత్తినావేమంటే గుంపులో చేరబట్టి నా
బెదురు తీరింది అన్నాడట ఎవడో.
పని హక్కును ప్రాథమిక హక్కుగా చెయ్యాలనీ,
నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనీ, థంపన్ థామస్ అనే జనతా సభ్యుడు రాజ్యాంగ
సవరణ బిల్లును ప్రతిపాదిస్తే 74 మంది కాంగ్రెస్ ఎం. పీ. ల గుంపు దానికి
వ్యతిరేకంగా ఒట్లేసి ఓడించి తమ బెదురు తీర్చుకున్నారు. ఉద్యోగాలలో చేరే వయో పరిమితిని
గూడా పెంచేది లేదని జగదీష్ టిట్లర్ చిట్లగించారు. ఇరుకుదో బొరుకుదో ఇల్లంటూ ఒకటి
ఉంటే అంతే చాలుననుకుంటున్న వారికి ఆశానిపాతం లాంటి వార్త మోహిసినా కిద్వాయ్ గారు
వినిపించారు. గృహవసతి కల్పనను రాజ్యాంగ బద్ధమైన అవసరంగా రూపొందించటం కుదరదు అని
ఆమె మొరాయించారు. అందువలన ఇల్లరికం పోయిన అల్లుళ్లయినా,
ఇల్లంట్రం వచ్చిన కోడళ్లయినా ఇరుకు మ్రానుల్లోని (పంగల కొయ్యల్లోని) పశువుల్లాగా పడి ఉండాల్సిందే గాని బ్రతుకుపై
రోత చెందగూడ దని కేంద్రం తరఫున నా మనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి