30, సెప్టెంబర్ 2012, ఆదివారం

అప్పు చేసి పప్పు కూడు



అప్పు చేసి పప్పు కూడు                                                            గీటురాయి  25-3-1988
            అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
              గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

              అనే ప్రబోధం అప్పు తీసుకుని ఎగ్గొట్టాలనుకునే వంచకుడికి     పరమానందకరంగా ఉండవచ్చు గాని నిజానికి అది చాలా తప్పుడు సందేశం.        మనిషిని బాధ్యతారహితునిగా, జులాయిగా మారిపొమ్మని నచ్చజెప్పే        సూత్రం అది.
             
              అప్పు లేకపోతే ఉప్పు గంజైనా మేలు, అప్పులేనివాడే అధికబలుడు     అని సర్దుకుపొయ్యే వాళ్ళు ఆర్ధికంగా అభివృద్ధి చెందకపోయినా ఏదో తమ        కున్నంతలో తాపీగా సంతృప్తిగా బ్రతుకు వెళ్ళదీస్తారు. వాళ్ళు చనిపోయినా   ఎవరూ తిట్టుకోరు. కానీ అప్పు చేసయినా నిప్పులాంటి సారాయి తాగి చచ్చిన    వాడిని అప్పు ఇచ్చిన వాడు శతవిధాలా దూషిస్తాడు. చావు రాక అప్పు   తీర్చలేక అలాగే మధ్యస్తంగా ఉండే జీవచ్ఛవాలు సంఘంలో    ప్రమాదకరమయిన అంటువ్యాధులు కలిగించే క్రిములలాగా      తిరుగుతుంటారు.పత్తి రైతులు అప్పుల్లో మునిగి ఉండకపోతే ఆత్మహత్యలకు పాల్పడే వారు కాదు. పండించే వాడికి అనేక ఆహారపు     పంటలు ఉన్నాయి. అవన్నీ వదిలి అత్యాసతో పత్తి, పొగాకు లాంటి వాణిజ్య    పంటలు వేసి ఎక్కువ సంపాదన మొదలెట్టారు. సరే ఇదైనా స్వంత ఊళ్ళో      స్వంత చేలో అయితే నష్టం వచ్చేది కాదు. బళ్ళారి, నంద్యాల మొదలైన   ప్రాంతాలకు తరలిపోయి అక్కడ చేలు కౌలుకు తీసికొని పత్తి వేశారు.      పోరుగూరు చాకిరీ, పోరుగూరి వ్యవసాయం తనను తినేవే కానీ తాను తినేవి        కావు అని ఊరికే అన్నారా ? ఇరవై వేలున్న ఆసామి మరో ఇరవై వేలు      అప్పుచేసి ఇతర రాష్ట్రంలో పారవేసి వచ్చాడు. కడకు అప్పు తీర్చలేక       ఆత్మహత్య మేలన్నాడు.

              ఇక వడ్డీ ముందర వడిగుర్రాలు కూడా పారవు అన్నట్లుగా వడ్డీ       అసలునే మించిపోతున్నది. మన కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి తెచ్చి      అప్పు 1987-88 లో 36,855 కోట్ల రూపాయలు (దీని మీద వడ్డీ 1034 కోట్లు)     దేశ ప్రజల నుండి తీసుకున్న అప్పు 1,70,834 కోట్ల రూపాయలు. ( దీని        మీద 10416 కోట్లు వడ్డీ). అప్పు ఆరు తెన్నులు ముప్పు మూడు తెన్నులు   అన్నట్లుగా ఈ తెచ్చిన అప్పును, దాని మీద వడ్డీని కట్టడానికి మన బడ్జెట్ లో పాతిక శాతం హరించుకు పోతోంది. అందుకే అన్నారు అప్పు ఆరు      మాలకన్న రొఖ్ఖం మూడు మాడలు మేలు అని. ఇలాంటి సుద్దులు     పెడచెవిని బెట్టి మన దేశ నాయకులు అప్పు చేసి మన భారతమాతకు కొప్పు     దీరుస్తున్నారు.

              అప్పు తీసుకున్నప్పుడు  చెప్పు చేతల్లో ఉండాలి అన్నారు. రూపాయి (మారకం రేటు) విలువ తగ్గించాలని, విదేశీ పెట్టుబడిదారులకు రాయితీ లివ్వాలని రకరకాలుగా మన దేశానికి షరతులు విధించారు. అన్నిటికీ తల ఆడించి మనవాళ్ళు అప్పు తెచ్చారు తెస్తున్నారు. అప్పు సప్పుచేసి ముచ్చెలు      కొంటే అప్పు తీరక మునుపే బొచ్చలు బొచ్చలైనాయి అన్నట్లు బోఫోర్స్        లాంటి లావాదేవీలు కూడా మన దేశ దౌర్భాగ్యానికి వన్నె తెస్తున్నాయి.

              అపావాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా ? అప్పు లిచ్చిన వాళ్ళు దేశాన్ని చెవులు పట్టుకుని ఆడిస్తున్నారు. ఆబ్బ చస్తే ఆ       పట్టు పంచే నాది అంటూ కాచుకుని కూర్చున్నారు. అప్పు అదనుకు రాదు ఆకటికీ రాదు అన్నట్లు తీసుకున్న అప్పు మాత్రం సద్వినియోగం కావటం        లేదు. ఇచ్చే వాళ్ళు కూడా మనకు పనికొచ్చే పనుల కోసం అప్పు ఇవ్వటం     లేదు. మన నోటికాడ కూడును, కూరగాయాల్ని ఎగుమతి చేసి,        క్రూడాయిలు కొరివి నిప్పులు దిగుమతి చేసుకుంటున్నారు. 40 ఏళ్ళ స్వతంత్ర పాలనలో ప్రజలందరికీ కడుపు నిండా కూడు దొరికే పరిస్థితి        రాలేదు. దేశ జనాభాలో 37.5 శాతం మంది దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారని     ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. దరిద్ర రేఖ దిగువన ఉండే జనం కేవలం కూటి       కోసమే అప్పులు చేస్తారు. వాళ్ళకీ అప్పులు దొరకవు. గుడ్డ, గూడు అనేవి       ఇక వారు ఆశించటానికి వీలు లేదు. వడ్డీ తలారి వాడిలా గులు     కుంటున్నది. అప్పు చేసే వాడికి ఎంత ధైర్యం కావాలి ? వడ్డీల వాడి చేతిలో   చిక్కి దేశమే శల్యమైపోయింది. (ధరల) రాకెట్లు, (ఆకలి) ఇక్కట్లు ఏక కాలంలో కలసిమెలసి జీవించే వింతైన దేశం మనది. మొండి చేతి వాడికి నువ్వులు తినటం నేర్పినట్లుగా అప్పులిచ్చేవాళ్ళు న దేశాన్ని        ఆటలాడిస్తున్నారు. వాస్తవానికి మన దేశం ఇప్పుడు మేకపోతు గాంభీర్యం మాచకమ్మ సౌందర్యం ప్రదర్శిస్తున్నట్లుగా ఉంది.

              ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే నేనుకూడా ఇన్ స్టాల్   మెంట్ పద్ధతిలో ఒక టి. వీ. కొని మనదేశం లాంటి పరిస్థితుల్లోనే పడ్డాను.       అందుకే అయ్యల్లారా, అప్పు చెయ్యబోకండి, ముప్పు (కొని) తెచ్చుకోకండి !




             

             

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి