సన్నాసీ ! సరిరారు నీకెవరు
గీటురాయి 15-1-1988
చంద్రబాబు నాయుడు గనుక రాష్ట్రంలో ఎక్కడైనా పోటీచేసి గెలిస్తే మీసాలు తీసేస్తానని గతంలో రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటనను ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే అవి కేవలం వెంట్రుకలే గదా అని పెదవి విరిచారు. అంతగా కావాలనుకుంటే ఒక వైపు మీసం మాత్రమే గొరిగించుకోవాలని కొందరు షరతు విధించారు. మీసాల పరపతి పెద్దగా లేదని అర్ధం అయింది కాబోలు ఈసారి సన్యాసం తీసుకుంటానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. సరే నీచేత ఆ పని చేయిస్తాలే అని చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశాడు. నాన్నా, వర్షం కురుస్తోంది అని పిల్లవాడు అంటే, కురువనియ్యిలే అని తండ్రి అంటే, సరే కురువనిస్తాలే అన్నాడట పిల్లవాడు. రాజకీయాలలో జయాపజయాలు, గెలుపు ఓటములు ప్రజాభీష్టాలని ఎరుగని రాజకీయ నాయకులు మాత్రమే ఇలా చతురులాడు కుంటూ ఉంటారు.
సన్యాసం అంటే ఏమిటి ? ఇప్పుడు మన ముఖ్యమంత్రిగారు పుచ్చుకున్న లాంటిది కాదు. కామ్య కర్మలన్నిటినీ విడిచి పెట్టడం. కామ్య కర్మలు ముఖ్యంగా అయిదు : 1. ఉత్చ్యేపణము అంటే పైకి లేవటం 2. అవక్షేపణం అంటే దిగబడి పోవటం, పక్కదారి పట్టడం 3. ఆకుంచనం అంటే ముడుచుకుపోవటం. 4. ప్రసారణం అంటే చాచటం లేదా సాగటం 5. గమనం అంటే కదలటం. ఈ అయిదింటినీ విడిచిన వాడే సన్యాసి. ఇంకా వివరంగా చెప్పాలంటే 1. నోటికి వమనము 2. చేతులకు దానము 3. కాళ్ళకు గమనము 4. శిశ్నమునకు ఆనందము 5. గుదమునకు మలవిసర్జనము లేనివాడే సన్యాసి అని శాస్త్రాలు బోధిస్తున్నాయి. ఈ పనులు మానటం సన్యాసి కాదలచిన రెడ్డి గారికి సాధ్యం కావేమోనని నా నమ్మకం.
సన్యాసులు కాదలుచుకున్న వారు ఈ విషయాలు పూర్తిగా గమనించి మరీ ఆ పనికి పూనుకోవాలని నా సలహా. సన్యాసికి ఉండే ఇతర పేర్లు ఏమిటంటే 1. భిక్షువు (ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తుకొనేవాడు) 2. పరివ్రాట్టు
(సమస్తాన్ని త్యజించి పోయేవాడు) 3. కర్మన్దీ (కర్మందుడనే ఋషి సూత్రాలను అధ్యయనం చేసేవాడు) 4. పారాశరి (పరాశరుని కొడుకైన వ్యాసుని బ్రహ్మ సూత్రాలను పాటించేవాడు) 5. మస్కరి (కామ్య కర్మలను నిషేధించే స్వభావము కలవాడు) 6. బోడి తపసి (తలనున్నగా గొరిగించుకుని తపస్సులో నుండువాడు) 7. కాలిపుట్ట గోచులసామి (కాషాయపురంగు గోచీలు మాత్రమే ధరించేవాడు) 8. ఇల్లుబాసి తిరుగు (సొంత ఇల్లు విడిచి లోకం మీద పడి తిరిగేవాడు) 9. జడదారి (జడలను ధరించువాడు) 10 యతి (ఇంద్రియములను జయించిన వాడు) 11. ముని లేక మౌని (మౌనము దాల్చియుండు వాడు).
నాకు తెలిసినంతవరకు సన్యాసి యొక్క సమగ్ర రూపం ఇది. రాజశేఖరరెడ్డి గారు గాని, సన్యసిస్తామని ప్రతినలు పూనే మరే రాజకీయ నాయకులు గాని పైన చెప్పిన పనులకు సిద్దపడటం లేదు. కేవలం పదకొండో పనికి మాత్రమే పాల్పడి కొంతకాలం తరువాత మళ్ళీ నోళ్ళు తెరుస్తున్నారు. నిజమైన సన్యాసులు రాజకీయ సన్యాసులను చూచి విచారిస్తున్నారు. నిజమైన సన్యాసులు రాజకీయ సన్యాసులను చూచి కొందరు ఎమ్మేల్యేలు, ఎంపీలు మా పదవులు ఖాళీ చేస్తాం రండి, పోటీ పడండి అని పిలుస్తున్నారు. ఆడిన మాటకు నిజంగా నిలబడే రకమయినా వాళ్ళ భవిష్యత్తు నిర్ణయించే ప్రజల నాడి ఎలా ఉందో వీళ్ళు గమనించడం లేదు. కేవలం సన్యాసులు అయ్యేందుకు పోటీలు పడి మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లు జరిపించి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తే ఆ పాపం సన్యాసులయ్యాక కూడా పట్టి విడువదని వీళ్ళంతా గ్రహించాలి.
ఇంత విపులంగా ఎందుకు చెబుతున్నానంటే సన్యాసులుగా మారి లోకానికి భారం కావటం తప్పు. చక్కగా సంసారం చేసుకుంటూ ఉత్పాదక కార్యక్రమాల్లో పాల్గొని దేశాభివృద్ధికి పాటుపడడం ఒప్పు అని నమ్మే వాళ్ళలో నేనూ ఒకణ్ణి. ఈనాడు సన్యాసం చివరి దశలో చాలా కష్టంగా ఉంటుంది, గొంతులో ఇన్ని నీళ్ళు పోసే వాళ్ళు కూడా ఉండరు. సన్యాసం పుచ్చుకున్నా కావడి బరువు మోయక తప్పదు. కావడి బద్దను దానికుండే ఇత్తడి గంటలను దానికి వేలాడే భిక్షా పాత్రలను దొంగల బారినుండి కాపాడుకోవాలి. పైగా సన్యాసి భార్య అటు విధవా కాకుండా ఇటు పుణ్యస్త్రీ కాకుండా సంఘంలో పరాభవం పాలౌతుంది. సన్యాసి సన్యాసీ రాసుకుంటే బూడిద రాలుతుందంటారు. కానీ దొంగ సన్యాసుల తోడు దొరికి వారితో స్నేహం కుదిరిందంటే వారి మధ్య కల్లు కుండలు మాయమైపోతుంటాయి. గంజాయి మొదలయిన దమ్ము పీల్చుడులు అలవాటై ఆరోగ్యం చెడిపోతుంది. ఏ రకంగా చూచినా సన్యాసం పుచ్చుకోవటం నష్టపెట్టే పనిగానే నాకు తోస్తున్నది. మీరేమంటారు ?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి