శీనాయణం
గీటురాయి 22-1-1988
సంతానానికని సప్త సాగర యాత్రకెళితే, ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్తా ఊడ్చుకుపోయిందట. వెట్టి చాకిరీ నుండి విడుదలయ్యానని చంకలు గుద్దుకుని సంబరపడిన శ్రీనివాసులు రెడ్డి గారికి ఈనాడు వట్టి చాకిరీ మాత్రమే తగులుతుంది. ఇంతకీ ఆయన పడుతున్న పాటు ఎందుకో జనానికి అర్ధం కావటంలేదు. పదవిపోతే ప్రాణం పోయినట్లుగా విలవిలలాడిపోయాడు. ప్రభుత్వ ఉత్సవం జరుగుతున్న రోజునే బంద్ కు పిలుపునిచ్చి అతి తెలివి రాజకీయానికి బాట వేశాడు. పోల్చి చూస్తే నాదెండ్ల భాస్కరరావే నయమనిపించాడు. పైగా మనం చేసిన తప్పులకు ఇలా బంద్ లు చేయించి ప్రజల్ని బాధపెట్టడం సబబుకాదని ప్రకటించి మంచివాడనిపించుకున్నాడు నాదెండ్ల.
గొర్రెల గోత్రాలు గొల్లలకెరుక, గొల్లల గోత్రాలు గొర్రెలకెరుక అంటారు. అలాగే రాజకీయ నాయకుల గోత్రాలు వారు వదిలి వచ్చిన పార్టీ అధిష్టాన వర్గాలకు బాగా ఎరుక. చంకలదాకా మునిగిన వాడికి సిగ్గేమిటి ? కొంపదీసి కాంగ్రెస్ లో చేరుతారా ఏమిటి అని విలేఖరులు అనుమానం వచ్చి అడిగితే అవునన్నట్లు ధ్వనించే సమాధానమిచ్చారు శీనయ్య. కాంగ్రెస్ తో నాకు సిద్ధాంత విభేదాలే లేవు అన్నారు.
కటిక చీకట్లో ఒంటరిగా మిగిలిపోయిన వాడు పెద్దగా అరుస్తూ తనను తాను ధైర్య పరచుకున్నట్లు ఉంది శీనయ్య పరిస్థితి. అతన్ని కాంగైలో చేర్చుకోవటం కాలిది తీసి నెత్తికి రాచుకున్నట్లుగా ఉంటుంది. ఇవ్వాళ రామారావుకు చేసినట్లే రేపు రాజీవ్ కి చెయ్యడని నమ్మకం ఏమిటి అని రాష్ట్రంలో కాంగై నాయకులలో గతంలో శీనయ్య కాటుకు గురైన వారు వాదిస్తున్నారు. అయినా కేంద్ర నాయకత్వం ‘అన్న శత్రువు మనకు మిత్రుడు’ అని చెప్పి వారిని అనునయిస్తున్నది.
కాంగీ పతాకాన్ని తుంగలో తోక్కేసి
పచ్చజెండా ఎత్తిపట్టినపుడు
అమ్మ కొలువును వీడి అన్న పంచను జేరి
ప్రాంతీయతత్వాలు పాడినపుడు
పదవి కోసం రామభజన పోటీలలో
అద్వితీయ స్థానమందినపుడు
గతమంతా అవినీతి గాధగా వర్ణించి
తెలుగు దేశము ఘనత తెలిపినపుడు
ఏమి సిద్ధాంత భేదాలు ఏడ్చినాయి ?
చాలు శీనయ్య ఈ గోల చాలు చాలు
ఇంకనైనను బొంకుల డొంక వదిలి
సవ్యమైనట్టి బాటలో సాగవయ్య !
అని శ్రీ గజ్జెల మల్లారెడ్డి సున్నితంగా అంటించిన ‘చురక’ ప్రకారమే శీనయ్య సవ్యమైన బాటలోకి వస్తున్నాడనటానికి “ఛలో హైదారాబాద్” పిలుపే నిదర్శనం.
రాజీవ్ గాంధీ, బలరాం జక్కర్, బూటాసింగ్, పి.వి. నరసింహారావు, శివశంకర్, జలగం వెంగళరావు, జగదీష్ టిట్లర్, రాంనివాస్ మీర్జా మొదలయిన హేమాహేమీలకు రామారావు మీద 111 ఆరోపణలతో కూడిన పత్రాలు సమర్పించి రావటమే కాక, సాక్షాత్తూ రాజీవ్ గాంధీతో కలిసి దిగిన ఫోటోనే “ఛలో హైదారాబాద్” పిలుపు కోసం సమర్ధనగా వాడుకోవటం పై నాయకులకు ఇష్టంగానే ఉందా ? శీనయ్య సేనకు ప్రేరణ, సకల బలం కాంగైయులేనని ప్రజలు అనుకోవచ్చా?
ఆ మధ్య “స్త్రీ జాతికే అవమానం“ అనే శీర్షికతో రాష్ట్ర కాంగైయులు సోనియా గాంధీ బొమ్మ ముద్రించిన వాల్ పోస్టర్లు అంటించారు. ఆ వాల్ పోస్టర్ అంతా చదివితేగాని అర్ధం కాలేదు అది తెలుగు దేశానికి వ్యతిరేకమైనదని. అలాగే శీనయ్య పిలుపుకు రాజీవ్ గాంధీ ఆశీస్సులున్నాయా లేక సీనయ్యే స్వయంగా రాజీవ్ బొమ్మను వాడుకుంటున్నారా అనేది క్షీరనీర న్యాయంలాగా విడదీయ వీలులేనట్లుగా తయారయ్యింది. ప్రతిపక్షాలను చీల్చి, బలహీన పరచి తరువాత తానే పీఠమెక్కే “కాంగ్రెస్ కల్చర్” లో శీనయ్య గుళికలాగా మిళితమై పోవటం చూస్తే తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గర కొచ్చినంత సంబరంగా ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి