ఓ గొప్ప పరిష్కారం
గీటురాయి 12-1-1990
“నా
కవితా వధూటి వదనంబు నెగాదిగా జూచి రూపరేఖా
కమనీయ వైఖరులు గాంచి, భళీ భళీ యన్న
వాడె,
మీదేకులమంచు ప్రశ్నవెలయించి చివాలున
లేచి పోవుచో
బాకున గృమ్మినట్లగును ప్రార్ధివ చంద్ర !వచింప సిగ్గగున్ !”
అని ఆనాడు
గుర్రం జాషువ గారు బాధపడ్డారు. కులం ఏదో తెలుసుకున్న
తరువాతనే గౌరవం ఇవ్వటం మన దేశ
సంస్కృతిగా స్థిరపడిపోయింది. కులం
తక్కువ వాడనే ఏకలవ్యుడి వేలు నరికించారు. కులం
తక్కువవాడనే కర్ణున్ని అపహసించారు. కులం తక్కువ వాడనే అంబేద్కర్ ను అంటరానివాడిగా చూచారు. కులం తక్కువ వాడనే జగ్జీవన్ రామ్
తాకిన విగ్రహాన్ని గంగా జలంతో శుద్ధి చేశారు.
కులం తక్కువ వాళ్ళు కావటం వల్లనే
దళితుల్ని ఆలయాలలోకి రాకుండా అడ్డుపడుతున్నారు. కులం
తక్కువ వాళ్లందరికీ ఆస్తిహక్కు లేకుండా, ఆయుధం ధరించే హక్కు లేకుండా, మనుధర్మ శాస్త్రాలు అమలు చేశారు. కులం
తక్కువ వాడు కూటికి ముందు అంటూ
చీత్కరించటం సామెతగా మారింది. అంటరాని వాళ్ళుగా
ప్రకటించి సాటి మానవుల్ని ఊరిబయట ఉంచి శతాబ్దాల తరబడి వారిని సాంఘికంగా,
ఆర్ధికంగా, సాంస్కృతికంగా అణచివేశారు. సత్యకామ జాబాలి మొదలు అంబేద్కర్, వి.టి. రాజశేఖర్,
వీరమణి, కత్తి పద్మారావు వరకు దళిత నాయకులందరి వాదనా ఇదే. 25-12-1989 న
హైదరాబాదులో మనుస్మృతిని తగులబెడుతూ దళిత
నాయకులంతా ఈ విషయాలే మాట్లాడారు.
అయితే
హిందూ మతంలోని సంస్కరణ వాదులు మాత్రం జరిగిన అన్యాయాలేవో
జరిగిపోయాయి. ఇక మీదట పాత తప్పులు సరిదిద్దుకోవాలని సూచిస్తున్నారు. ప్రతిభ అనేది అగ్ర కులాల వారి గుత్త సొత్తు ఏమి కాదని వారు
నిరూపిస్తున్నారు. అసితకేశకంబళ్,
మక్కలి ఘోషాల్, పూర్ణకాశ్యప,
ప్రకృథ కాత్సాయన్ మొదలైన మేధావులంతా హీన కులాల వారేనని వారు చెబుతారు. పైగా రామాయణం రాసిన వాల్మీకి బోయ, భారతం రాసిన వ్యాసుడి తల్లి
బెస్త, నాయనమ్మ చండాల స్త్రీ,
అవ్వ మాదిగ అని అంటారు. తెలివికి
కులానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాకపోతే తరతరాలుగా కులాల పేరుతో దళితుల మీద దోపిడీ కొనసాగింది.
గనుక వారిని అందరి స్థాయిలోకి తేవటం కోసం
వారు చదువుకొని ఉద్యోగాలలోకి వచ్చేందుకు రిజర్వేషన్లు ఇచ్చారు గనుక అది సమంజసమే నంటున్నారు.
అన్ని పార్టీల నాయకులు ఈ విధానాన్ని సమర్ధించారు.
కాని దేశంలో ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు అనే రెండు కులాలే ఉన్నాయి కాబట్టి కులం ప్రాతిపదిక మీద గాక ఆర్ధిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్లు ఇవ్వాలని అల్లర్లు లేవదీశారు కొందరు. అలాగైతే ఉన్న వాళ్ళ ఆస్తి లేని వాళ్ళకు పంచి అసమానతలు రూపు
మాపండి. భూమిని పరిశ్రమలను జాతీయం
చెయ్యండి. కులాలను రద్దు చేసి అందరూ విచక్షణా రహితంగా
వివాహాలు చేసుకోండి అని దళితులంతా ఎదురు ప్రతిపాదనలు చేశారు. ఎక్కడైనా బావా అను గాని ఇక్కడ మాత్రం అనోద్దు అని అగ్రవర్ణాల నాయకులు కొందరు అడ్డుపడ్డారు. అటు కులాలను రద్దు
చేయక, ఇటు రిజర్వేషన్లు
ఇవ్వక మమ్మల్ని అడకత్తెరలో పెట్టాలని చూస్తే సహించమనీ, హరిహరాదులు
ఏకమై వచ్చినా మమ్మల్ని ఆపలేరని హరిజనులు అరిచారు.
ఇరు
పక్షాల వారి వాదోపవాదాలు, అల్లర్లు ఆందోళనలు సభలూ సమావేశాలు ఊరేగింపులూ ఉపన్యాసాలు చూశాక కుల
నిర్మూలన అనేది ఇండియాలో అసాధ్యమైన విషయం
అని నిర్ధారణ అయ్యింది. కులసంఘాలు మరింత
పటిష్టం అవుతున్నాయి తప్ప అవి కూలిపోవటం లేదు. కాంగ్రెస్ నేతలే కొంతమంది ఈ మధ్య జనాభా ప్రాతిపదిక మీద అన్ని కులాలకు రిజర్వేషన్లు
ఇవ్వటం మంచిదని సూచించారు. ఇది శాశ్వత పరిష్కారాన్ని ప్రసాదించే ప్రతిపాదన. ఎలాగంటే మన దేశ జానాభాలో ప్రస్తుతం స్థూలంగా షెడ్యూల్డ్ కులాల వారు 18% , షెడ్యూల్డ్ తెగలవారు 8%, వెనుకబడిన తరగతులవారు 44%,
అగ్రకులాల వారు 12%, ముస్లిములు 12%, క్రైస్తవులు 3%, సిక్కులు 2%, బౌద్దులు జైనులు 1% ఉన్నారు. ఈ
నిష్పత్తిలో అందరికీ రిజర్వేషన్లు
ప్రసాదిస్తే సమస్యకు శాశ్వత సమాధి కట్టవచ్చు. ప్రతి పదేళ్ళకు జరిగే జనాభా లెక్కల్లో కులాలవారీ జనాభా
వివరాలు కూడా సేకరిస్తే రిజర్వేషన్ల
శాతం ఈజీగా లెక్కకట్టి ఆయా కులాల వాళ్ళకు ఇవ్వవచ్చు. ఏమంటారు ?