ఏ దేశ సంస్కృతో ?
గీటురాయి 24-01-1992
“క్రొత్త
ఏడు మొదలు బెట్టేను
మన
బ్రతుకునందు” ||క్రొత్త||
అంటూ
కాంబోజీ రాగం త్రిపుట తాళంతో కీర్తన పాడుతారు. లోకస్తు లంతా. కొత్త నీరొచ్చి పాత నీరు కొట్టుకు పోయినట్లు పాత ఏటికి వీడ్కోలు చెబుతారు. పాత ఒక
రోత, కొత్త ఒక వింత అన్నట్లు అందరూ కొత్త ఉత్సాహాన్ని
ప్రదర్శించుతారు. పైగా కొత్త ఎద్దు పేడ ఇంటిల్లిపాదీ ఎత్తినట్లుగా హడావుడీ
చేస్తారు. ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకొంటినమ్మ
వాయనం అన్నట్లు “హేపీ న్యూయర్ టుయూ” అంటూ ఎదురు బదరుగా చెప్పుకుంటారు.
కొత్త
ఏడాదిలో ఏదో ఘనకార్యం సాధించబోతున్నట్లు ఫోజులిస్తారు. పాత సంవత్సరం పాడుగాను అంటూ
శాపనార్ధాలు పెడతారు. కొత్తది గొర్రెల మడుగు పాతది బర్రెల మడుగు అన్నట్లు ప్రసంగాలు చేస్తారు. అయితే
మళ్ళీ ఈ కొత్త సంవత్సరం ఆఖరుకి ఒక్కసారి అయ్యల ప్రవర్తన ఆరా తీసి చూస్తే కొత్తది నేర్వలేదు
పాతది మరవాలేదు అన్నట్లే ఉంటుంది. మనతత్వం మారాలిగాని ఏళ్ళు ఎన్ని మారితే ప్రయోజనం
ఏమిటి ? కొత్త అప్పుకు పోతే పాత అప్పు పైన బడ్డట్లుగా కొత్త
సంవత్సరంలో కొత్త కొత్త జాడ్యాలకు గురయ్యే జనానికీ లోకంలో కొదువలేదు.
సిగరెట్లు
మానేస్తాననీ,
సారాయి త్రాగననీ ,అత్యాచారాలు చెయ్యననీ, వేశ్యల వలలో చిక్కుకోననీ,
మత్తు మందులకు బానిస కాననీ, లంచం తీసుకోననీ, అప్పులు చెయ్యననీ,
అబద్ధాలు చెప్పననీ, దొంగతనం చెయ్యననీ, తగాదాలు రేపననీ,
బూతు మాటలు పలకననీ,
దైవధ్యానం మరువననీ, కష్టపడి పనిచేసి పైకొస్తాననీ,
పాత బాకీలన్నీ తీర్చేస్తాననీ, తల్లిదండ్రుల్ని సరిగా చూసుకుంటాననీ...
ఇలా ఎన్నో శపధాలు కొత్త ఏట చెయ్యవచ్చు. అయితే
వాటిని నిలుపుకోగలవారు ఎంతమంది ? కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు జనవరి ఫిబ్రవరి మాసాల్లో చేసిన శపధాలను నూటికి నూరు శాతం అమలు జరిపి మార్చి నెలకే మారి పొయ్యే
అయ్యలవల్ల మరింత నష్టం జరుగుతోంది. ఎందుకంటే
దుర్వ్యసనాలకు బానిసయైన వ్యక్తి పశ్చాత్తాపపడి సన్మార్గం లోకి వచ్చి మళ్ళీ పాప
మార్గం పట్ల ఆకర్షితుడై వెళ్ళి పోతే అతని వల్ల సంఘానికి చాలా కీడు జరుగుతుంది.
పొయ్యి పక్క వెన్న ముద్దలాగా పదిమందీ అతని వల్ల కరిగి పోతారు. అనుభవ
పూర్వకంగా అతను చేసే పాప ప్రసంగాలపట్ల ప్రభావితులై చుట్టూ చేరిన వాళ్ళంతా
చెడిపోతారు. “ఎన్నాళ్ళో గడిచాక, ఇన్నాళ్లకు కలిశాక,
ఉప్పొంగిన గుండెలకేక ఎగిసేను నింగిదాకా” అనుకుంటూ ఒక తిరోన్ముఖ గుంపు తయారైనా ఆశ్చర్యం లేదు. వాళ్ళను మార్చటం ఎవరి వల్లా కాదు.
ఇంతకీ
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొనే పేరుతో బోలెడు
డబ్బు గ్రీటింగులకీ, డైరీలకీ, కేకులకీ ఖర్చు పెట్టడమే కాకుండా,
రాత్రంతా సారాయి తాగి వీధుల్లో వెర్రి కేకలేస్తూ తిరిగే గుంపులు బయలు దేరాయి. ఇది
ఏ దేశ సంస్కృతితో అర్ధం గావడం లేదు. ఆడామగా విచక్షణ లేకుండా పట్టణాలలోని అపార్ట్
మెంట్లలో అర్ధరాత్రి శివాళ్లు జరుగుతున్నాయి. గట్టిని విడిచి పొట్టుకు
పారాడినట్లుగా ఈ కొత్త సంవత్సరపు వేడుకలుంటున్నాయి.
గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా శిష్యా అన్నాడట ఎవడో. దురలవాట్లు, హింసా ప్రవృత్తీ మాని శాంతిదాయకమైన సంవత్సరంగా కొత్త ఏటిని మనమే మలచాలి. కాలం
దానంతట అదే దేన్నీ తీసుకు రాదు. చరిత్ర మన చేతల ద్వారానే నిర్మించబడుతుంది. మత కలహాలకు, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు స్వస్తి
చెప్పి శాంతి స్థాపనకోసం శపధం చేద్దాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి