31, డిసెంబర్ 2012, సోమవారం

బంగారంలాంటి సలహా



బంగారంలాంటి సలహా
గీటురాయి 6-12-1991
         
          ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడంటారు. ఈశ్వరరావు పరిస్థితి అచ్చం ఇలాగే తయారైంది. ఎప్పుడూ దిగులు ముఖం పెట్టుకొని అప్పు అడిగే ఈశ్వర్రావును అసలు సంగతి ఏమిటి అని అడిగాను. ఢామ్మని పగలిన నీళ్ళ కుండలాగా భోరున ఏడుస్తూ తన కథ వివరించాడు. తాను అక్కడా ఇక్కడా పరాని పాట్లుపడి సంపాదించి తెచ్చిందంతా భార్య బంగారం కోసం ఖర్చు చేస్తుందట. బంగారం పోగయ్యిందన్న సంబరమేగాని ఇంట్లో గానీ లేక డబ్బుకు కటకట లాడాల్సి వస్తుందనీ, ఈ అప్పుల వేట తప్పటం లేదనీ వాపోయాడు.

              ఏ బ్యాంకులోనో డబ్బు దాచుకోవచ్చు గదా అని ఓ ఉచిత సలహా పారేశాను. రేప్పొద్దున బ్యాంకులో వేద్దాం లెమ్మని బీరువాలో దాస్తే, రాత్రికి రాత్రే ఈశ్వర్రావు భార్య ఆ డబ్బు కాజేస్తున్నదట. ఇంటిగుట్టు పొరుగిళ్ళలో చెప్పే చెల్లెలు, దొంగిలించే భార్య, చేసే అప్పులు తీర్చే అప్పులతో యమ యాతనలు పడే ఈశ్వర్రావు కొంప నరకప్రాయమయ్యిందట.ఆ ఇంటికేం బంగారం లాంటి సంసారం అంటారు గాని ఆ బంగారమే ఈ సంసారంలో చిచ్చు పెడుతుందని గ్రహించాను. వచ్చిన డబ్బంతా బంగారం రూపంలోకి మారిపోతే అవసరాలు తీరేదెలా?అవసరానికి బంగారం అమ్ముదామంటే ఆ భార్య ఊరుకోదు. పుట్టింటికి ప్రయాణమౌతుంది. ఇంట్లో నానా అల్లరీ చేస్తుంది. ఇంటి పేరు క్షీర సాగరం వారు. ఇంట్లో మజ్జిగ చుక్కకు గతిలేదు అన్నట్లయ్యింది ఈశ్వరావు కుటుంబ పరిస్థితి. ఇంట్లో ఇల్లాలి పోరు, బయట బాకీల పోరు – ప్చ్ ! ఈశ్వరరావు ! ఎవర్రా నిన్ను ఆదుకొనేది అని ఆఫీసు స్టాఫంతా ఈడిగిలబడ్డారు.

              పొట్టకూటికి పైసలు దొరకని దేశంలో పొదుపు పొదుపు అని పెద్ద ఉద్యమం చేపట్టారు. పొదుపు పేరుతో పేదవాళ్లు జమ చేసిన డబ్బంతా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు తరలి వెళుతోంది. మనం చేసిన పొదుపుకు బ్యాంకుల వాళ్ళు ఇచ్చే వడ్డీ తక్కువ, మనం చేసిన అప్పుకు గుంజే వడ్డీ ఎక్కువ. ఈ వడ్డీ వ్యాపారం తోటే బ్యాంకులు బ్రతుకుతున్నాయి. ఇక్కడ కీలకమైన విషయం ఏమంటే ఒకసారి మనం డబ్బు బ్యాంకులో ఫిక్స్ డ్ అయిందంటే, అది భార్య జాతీయం చేసుకున్న బంగారం లాగా మారిందన్నమాటే. దాన్ని తీసుకుందామంటే సవాలక్ష షరతులు. ఆగబోగాలు అంకమ్మవి, పొలికేకలు పోలేరమ్మవి అన్నట్లుగా భార్య పెద్ద బ్యాంకర్ లాగా మారితే, ఈశ్వర్రావు దరిద్రపు పెద్దన్న లాగా తయారయ్యాడు. ఆకలిగొన్న సింహానికి నిగ దొరికినట్లుగా ఆవిడ సంతోషపడుతున్నదేగాని, అవతల ఈశ్వర్రావు ఎన్ని అవస్థలు పడుతున్నాడో గమనించడం లేదు. తెలుగింటి ఆడపడుచులు, భాగ్యనగరంలోని బూబమ్మలు కూడా ఈశ్వర్రావు కొంపలో కొనసాగుతున అలజడిని గమనించి, బంగారం కోసం పాకులాడి బంగారం లాంటి కాపురాలు కూల్చుకోవద్దని గోల్డ్ బాండ్ లాంటి సలహా పారేస్తున్నాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి