అనర్ధాలకు దారి తీస్తున్న అనైక్యత
గీటురాయి 28-6-1991
దూదేకుల
సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా ? ఎంత మాత్రం లోటు కాదు. ఒకే రకం ఈకలు గల పక్షులు ఒకేచోట
చేరతాయంటారు. ఈ మధ్య
“పరుపులు కుడతాం” అంటూ కవ్వానుబద్ధ భుజాన వేసుకుని తిరుగుతున్న
ఇద్దరు మనుషులు నా కంట బడ్డారు. ఎంతో కాలం నుంచి పెండింగ్
లో ఉన్న పరుపు కొనుగోలు ప్రతిపాదన వాళ్ళను, చూడగానే మంజూరయ్యింది.
పరుపు కుట్టడం పూర్తయ్యాక మీరు ‘దూదేకుల
సాయిబులేనా ?’ అని అడిగాను. “కాదండీ
బాబూ, మేము కాపులం మాది ఏలూరు”
అని జవాబిచ్చారు. కులంగాదు, తలంగాదు కురవోళ్ళ పిల్ల దయ్యమై పట్టినట్లు, కాపులు గూడా దూదేకుతున్నారంటే వీళ్లను బీసీల్లో ఎందుకు
చేర్చగూడదు అనిపించింది. తురకలు లేని ఊళ్ళో దూదేకుల వాడే ముల్లా అంటుంటారు. దూదేకుల వాళ్ళు కూడా లేని ఊళ్ళో ముల్లా పని ఏమోగాని దూదేకే పని మాత్రం ఏదో ఒక కులపోళ్ళు నెత్తిన వేసుకొని చేస్తుండటం
మూలాన “కులవృత్తి” సిద్ధాంతం దెబ్బతిని పోయింది.
టర్కీ
(తుర్కీ) భాష మాట్లాడే వాళ్ళను పూర్వం తురక వాళ్ళు అని ఉంటారు. కానీ ఇప్పుడు ఉర్దూ మాట్లాడే ముస్లిములందరినీ ‘తురకోళ్ళు’
అంటున్నారు. సర్వీస్ కమీషన్
పరీక్షల్లో కూడా ఇదే మాట ప్రయోగించారు. దూదేకుల
సాయిబుల్నీ, మామూలు సాయిబుల్నీ వేరు చేసి ఇలా రెండు
పేర్లతో పిలుస్తున్నారు. “తురకా
దూదేకుల పొత్తులో మురిగీ ముర్దార్” అనే సామెత
ఉంది. “కాకర బీకర కాకు జాతారే? అంటే దూబగుంటకు దూదేకను జాతారే”
అని ఇద్దరు దూదేకుల వాళ్ళు సంభాషించుకున్నారట. బావి తవ్వితే భూతం బయటపడ్డట్లు లోతుకు పోయే కొద్దీ కొత్త సంగతులు బయట
పడుతున్నాయి.
ఈ మధ్య
నన్ను ఆకివీడుకు బదిలీ చేశారు. బదిలీ కాగితం చేతికిస్తూ ఓ సాయిబుగారు నాకు ఉర్దూ రానందుకు చాలా సిగ్గుపడి
పోయారు. ఆయన భాషాభిమానం ఎంత గొప్పదంటే, ఖురాన్ ఉర్దూ లోనే అవతరించిందట.
బావిలోని కప్పకూ గానుగ ఎద్దుకూ అవే లోకాలు అన్నట్లు ఉర్దూ పిచ్చి పట్టిన వాళ్ళకు మరో సంగతి తలకెక్కదు. అలాగే తెలుగు మాట్లాడటం
మన ప్రత్యేకత మన సంస్కృతి అంటూ ఉపన్యాసం చేసిన ఒక నూర్ బాష నాయకుణ్ణి సంకుచితత్వం
వదలి పెట్టమని హితోపదేశం చేశాను. “భాషలు
ఆయా ప్రాంతాలకు సంబంధించినవి అయితే దైవ ధర్మం విశ్వవ్యాప్తమైంది.
అన్ని భాషల ద్వారా ఆ ధర్మం వ్యాపించాలి”
అంటుండగానే, మరో సాయిబుగారు “ఆకివీడులో
మీ కేడర్ వాళ్ళు చాలా మంది ఉన్నారండీ” అన్నారు. “ఇస్లాం
లో చేరిన తరువాత అంతా ఒకే కేడర్ అవుతారు. ఇంకా ఎందుకీ భేదాలు ?” అన్నాను. “రంగా
హత్యానంతరం జరిగిన దౌర్జన్య కాండలో
నువ్వు సాయిబువైతే ఉర్దూలో మాట్లాడు అని
దూదేకుల సాయిబుని తన్నారు గదా ?
మీకు మాకు తేడా లేదా?” అన్నాడాయన. గూని వీపు నయం కాదు లెమ్మని నేను మౌనం వహించి
ఆకివీడు చేరాను. అక్కడ ఇంకో సాయిబుగారు నా వివరాలన్నీ అడిగి “ఈ దూదేకుల వాళ్ళంతా ఒక ముస్లిం తండ్రికీ
హిందూ తల్లికీ జన్మించిన సంతానమండీ”
అన్నాడు. కన్ను కైకలూరులో కాపురం డోకిపర్రులో అన్నట్లుయింది నా పని. ఎంతగా ధర్మ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రెండు రకాల సాయిబులూ కలిసి పోవటం లేదు. ఏమిటీ దుస్థితి అని ఒక స్థానిక ముస్లిం
నాయకుడిని అడిగాను”. గోంగూరలో చింతకాయ
వేసినట్లు, గోకి దురద తెచ్చుకున్నట్లు వీళ్లతో మాకెందుకండీ
తంటా? బయటి వాళ్ళకు చెప్పుకోవటం నయం”
అన్నాడు.
సాయిబుల
పిల్లల్ని చేసుకొని వాళ్లలో కలిసిపోగూడదా
ఎందుకీ అదగస్తపు బతుకు? అని ఒక దూదేకుల శ్రీవారిని
అభ్యర్ధించాను. “అమ్మో ఇంకా ఏమయినా
ఉందా? మనం బ్రతకడానికేనా ? అడుగడుగునా లదాఫ్,పింజారీ అని ఎత్తి పొడవరూ ?”
అని ఎదురు బెదిరించాడు. గ్రామాల్లో పరిస్థితి
ఇలా ఉంది. హైదరాబాదులో తల పండిన పెద్దలు, పట్టణాలలోని ముస్లిం పండితులు
ఈ అపోహల్ని అపార్ధాలను దూరం చేయటానికి కృషి
చేస్తారని ఆశిస్తున్నాను
(అక్కడ కూడా ఇలాగే లేకపోతే).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి