31, డిసెంబర్ 2012, సోమవారం

ఉయ్యాల వైద్యం



ఉయ్యాల వైద్యం
గీటురాయి 12-7-1991
         
          ఉయ్యాల జంపాల ఊగరావయా
      ఎనలేని భోగాల ఊగి తూగి                                      || ఉయ్యాల ||

అంటూ పసిపిల్లల్ని గుడ్డ ఉయ్యాల్లోనో, తొట్టి ఉయ్యాల్లోనో లాలిపాడుతూ ఊపితే ఎక్కువ మంది పసిపిల్లలు నిద్రపోతారు. ఏతాము పాటకు ఎదురు లేనట్లుగా చిట్టినాన్నలు గొడవ చేయకుండా గమ్మునుంటా రు. అయితే కొంతమంది గడుగ్గాయలు ఊపేకొద్దీ ఎడుపెక్కువ
చేస్తారు. ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లుగా ఉయ్యాల స్పీడు పెరిగే కొద్దీ చంటివాడి ఏడుపు జోరు కావటమే గాక ఉయ్యాలలోని పొత్తిగుడ్డలన్నీ ఖరాబు అవుతాయి. ఇందుకు ఉయ్యాల భయమే కారణం అంటారు.

       పసివాళ్ళ విషయం అలా ఉంచితే పెద్ద వాళ్ళు సైతం ఈ భయంతో సతమతమౌతుంటారు. కండలు మెలిదిరిగి, కోరమీసాలతో దర్శనమిచ్చే వస్తాదు కూడా రంగుల రాట్నం, జెయింట్ వీల్, తాటి చెట్లకు వేసిన పెద్ద మోకుల ఉయ్యాల మొదలైనవి ఎక్కాలంటే గుండే పిచపిచలాడి చస్తాడు. అట్లతద్ది పండక్కి మగవాళ్ళు టుంగుటుయ్యాల పోటీలు పడి తొక్కితే, ఆడవాళ్ళు ఎదురు ఊపుల ఉయ్యాల ఊగుతారు. సన్నగా, పీలగా ఉండే వాళ్ళు ఎంతో ఎత్తుకు పోతుంటారు. లావుగా పీపాలాగా ఉండే వాళ్ళు రెండు ఊపులకే కిందికి దిగిపోతారు. ఊపటం ఆపకపోతే పెద్దగా కేకలు వేస్తూ నేల మీదికి దూకేస్తారు కూడా. ఉడత ఊపులకు కాయలు రాలతాయా, ఇంకా ఊపండి అంటూ కొందరు అదేపనిగా, ఊపే వాళ్ళకు అలుపొచ్చేదాకా ఊగుతారు. పండగపూ ఒక్క ఊపైనా ఊగాలని పట్టి బలవంతాన కొంతమందిని ఉయ్యాల మీద కూర్చోబెడితే అమ్మోనాయనో అంటూ కళ్ళు తిరిగి దబాలున కిందపడేవాళ్లు, కడుపులో ఉన్నదంతా కక్కేవాళ్లూ, ఉయ్యాల దిగనీ నీ పని చెబుతానే వాళ్లూ, దిగినాక ఊపిన వాళ్ళను కొట్టేవాళ్లూ... ఇలా అట్లతద్దినాడు ఇస్తినమ్మ వాయనం అంటే పుచ్చుకో వాయనం అన్నట్లు అవుతుంది. వాతఆవరణం. అట్టు పెట్టినమ్మకు అట్టున్నర ముట్టుతుంది.

       పెద్ద పెద్ద భూస్వాముల ఇళ్ళల్లో ఇనపగొలుసులకు వేలాడుతూ బల్ల ఉయ్యాలలుంటాయి. దాని మీద ఊగుతూ భోగుల్లాగా నిద్రపోయే స్వాములు సైతం, ఉయ్యాల వెళ్ళి గోడలకు తగిలేం పెద్ద ఊపులు వేస్తే దిమ్మర పోయి కింద పడతారు. పాతరలో పడ్డ కుక్కను తీయబోతే కరవవచ్చినట్లుగా ఒక్కొక్కసారి కిందపడ్డ ఆసామిని లేవదీయటానికొచ్చినవాడు దెబ్బలు తింటాడు. ఉపకారానికి పోతే అపకారం ఎదురవటం అంటే ఇదే.

       సరే, ఈ ఉయ్యాల గురించిన ఊగులాటం ఎందుకని మీరనొచ్చు. వాటి అవసరం వచ్చింది కాబట్టే ఈ ఉపోద్ఘాతం ఇచ్చాను. ఈ మద్య మాట తప్పిన ఎమ్మెల్యే ఒకాయన్ని హాహాకారాలు పెట్టేలా ఉయ్యాల ఊపార బీహార్ జనం. చేసిన వాగ్దానం నెల రోజుల్లో నెరవేరుస్తాను బాబో అని మరో వాగ్దానం చేయించుకుని మరీ ఉయ్యాలలో నుంచి దినిచ్చారట. ఇలాంటి ప్రయోగం మన ఆంధ్ర వాళ్ళు కూడా చేస్తే మంచి ఫలితాలుండొచ్చు. మేనిఫెస్టోలతో అరచేతిలో వైకుంఠం చూపించే రాజకీయనాయకులు, నాసిరకంగా పనులు చేయించి లక్షలు స్వాహా చేసిన కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, రోగుల ప్రాణాలతో చెలగాటమాడే డాక్టర్లు, సుఖభోగాల్లో తేలుతూ ప్రజాక్షేమం పట్టని సినిమా యాక్టర్లు, నిర్మాతలు, డైరెక్టర్లు, గజ దొంగలు, బందిపోట్లు, రౌడీషీటర్లు, కేసులు తేల్చక నానవేసే న్యాయవాదులు,డ్జీలు, పోలీసులు... ఇలా అన్నీ రంగాల్లోని హేమాహేమీలకు ఈ ఉయ్యాల వైద్యం ఏడాదికొసారి అట్లతద్దినాడే చేయిస్తే పండుగకో నిండుదనం వస్తుంది. పుణ్యం పురుషార్ధం కలిసొచ్చి పండుగ సార్ధకం అవుతుంది. మరి రెడీగా ఉండండి అక్టోబర్ 25 నే అట్లతద్ది !


      





                            

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి