31, డిసెంబర్ 2012, సోమవారం

అక్షర జ్యోతి వెలిగించండి



అక్షర జ్యోతి వెలిగించండి
గీటురాయి 4-9-1992

అక్షర దీక్ష అమలు కోసం రాత్రింబడులెలా నడుస్తున్నాయో చూద్దామని వెళ్ళిన నాకు : -

చదువు రాని వాడవని దిగులు చెందకు
ఏమి చదివి పక్షులు పైకెగుర గలిగెను
చదువు చదివి చేపపిల్ల ఈదగలిగెను ?”

అంటూ మదురమైన పాట చెవిన బడే సరికి అగి పోయాను. తిండి కోసం వచ్చారా ? దరిద్రపు పాట వింటూ అక్షర దీక్ష ను ఆదమరుస్తున్నారంటూ నా పక్క నొచ్చిన వాళ్ళు అదలించారు. ఔషదానికి అపథ్యానికి చెల్లు, రోగం పై పెచ్చు అన్నట్లు అక్షర దీక్ష వల్ల కొన్ని చోట్ల జనంలో అవలక్షణాలు చోటు చేసుకున్నాయి. ఆడమగా ఒకే చోట గుమికూడి రాత్రిపూటల్లో చదవటం వల్ల వారి సాన్నిహిత్యం చెడు పనులకు త్రోవ తీస్తున్నాట్లు కొన్ని చోట్ల ఆరోపణలు నచ్చాయి.

కాసు గొడ్డుకు రూకబందె అన్నట్లుగా ఈ ముసలోళ్ళు చదివేదీ లేదూ చచ్చేదీ లేదు లక్షల రూపాయల్లో ఖర్చు మాత్రం అవుతున్నది. పిల్ల కాయల్ని చదివించాలంటే ఖర్చుకు దిమ్మతిరిగిపోతున్నది. ప్రభుత్వ బడుల్లో సరైన సౌకర్యాలు లేవు. అక్షర దీక్షకు పెడుతున్న ఖర్చు కూడా ప్రభుత్వ బడుల్లోనే పెడితే రేపటి పౌరుల పరిస్థితి మెరుగయ్యేది. ఇల్లెల్లా కొడితే తట్టెడు పెంకులు లేవు అన్నట్లు ఈ దీక్ష ఎంత గట్టిగా పట్టినా ఫలితాలు మాత్రం నిరాశా జనకంగా ఉన్నాయి. ఇచ్చిన వాచకాలు చదివారా అంటే చదివారని కాకుల లెక్కలతో రిపోర్టులు రాసుకోవటం మినహా ఒరిగిందేమీ లేదు. ఇదంతా గట్టిని విడిచి పొట్టుకు పోరాడినట్లుగా ఉంది.

వయోజన విద్యా పథకంలో పెద్దైనాక చదువుకుందువు లెమ్మని ఓ పేద తండ్రి తన కొడుకుతో చెబుతున్నట్లు ఒక కార్టూన్ వేశారు. అక్షర దీక్షలో పెద్ద వాళ్ళకిచ్చిన పలకలు వాళ్ల పిల్లలకిచ్చేశారు. ఇప్పుడు జన శిక్షణాలయాల పేరుతో పెద్ద వాళ్ల చేత పేపర్లు చదివిస్తున్నారు. అన్న దీక్ష ముందు అక్షర దీక్ష బలాదూర్ అన్నట్లు వాచకాలన్నీ చాలా చోట్ల మిఠాయి పొట్లాల కోసం కొట్లల్లో అమ్మేశారు. పిల్లలకు పాఠాలు చెప్పవలసిన టీచర్లు మద్దెల, హార్మోనియం లు మెడకు తగిలించుకొని, పాటలు పాడుతూ జనంలో పడి డ్యాన్సులు వేస్తూ అక్షరాలు నేర్పుతున్నారు. అక్షర దీక్షను విడిచి కొన్ని చోట్ల లేడీ టీచర్లు శీల రక్షణ దీక్ష పట్టవలసి వస్తున్నది.

అక్షర దీక్ష అమలయ్యే జిల్లాల్లోనైనా కరెంటు కోత ఆపలేదు. చీకటి శక్తుల్ని తరిమి కొట్టి అక్షరాలు నేర్వమని లాంతర్లు ఇచ్చారు. గుడ్డి కన్నా మెల్ల మేలు అనుకోవచ్చు గానీ, శుక్లాలు, చత్వారం ఇత్యాది నేత్ర వ్యాదులు ఆవరించిన ముసలోళ్ళు మాకు కళ్ళు కనపడవని బడి మానేశారు. రోజంతా పొలం పనుల్తో అలసిపోయిన కూలిజనం రాత్రి బడి మానేసి నిద్ర పోతున్నారు.

అందువలన చెప్పొచ్చేదేమిటంటే, అక్షరదీక్షకు బదులు బాలబాలికలకు నిర్భంధ ఉచిత విద్యను అమలు పరిచే దీక్షను కేంద్ర ప్రభుత్వం చేపడితే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి