ఇదీ మన భక్తి
గీటురాయి 30-3-1990
దూదేకుల సిద్దా సాహెబ్ గారిని ఆ రోజుల్లో కొందరు
శాస్త్రులు ఇంటర్వ్యూ చేశారు. భక్తి తొమ్మిది స్థాయిల్లో ఉంటుందని ఆయన వారికి చెబుతాడు. అవి ఏమిటంటే శ్రవణము,
కీర్తనము, స్మరణము, సేవనము,
అర్చనము, వందనము,
దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము.
మిగతా
స్థాయిల సంగతి ఎలా ఉన్నా శ్రవణము కీర్తనము అనే రెండు స్థాయిలు దాటి మనుషులు దైవభక్తిలో
ముందుకు పోలేకపోయారన్నది నిజం. పోయిన
వాళ్ళు బహు కొద్దిమంది. పాటలు పాడటం – పాటలు వినడం
ఈ రెండు పనులు చాలా తేలిక. ఇక దాస్యము, ఆత్మనివేదనము అంటారా
అవి ఎక్కువ మందికి అసాధ్యమైన పనులుగానే కనబడుతున్నాయి.
నేల మీద
బూరె అని వ్రాసి, ఇంత తింటావా అంత తింటావా అని అడిగినట్లు
పరమ భక్తులని పేరు గాంచిన వారు ఒక లాంటి మిధ్యా వాదాన్ని, భక్తి పేరిట శృంగార
సంకీర్తనల్నీ వెదజల్లిపొయ్యారు. నిజమైన బూరె కమ్మగానే ఉంటుంది గాని, బూరె
అనే అక్షరాలే కమ్మగా ఉండవు కదా ? అలానే
“దేవుని స్తుతియించుడీ
ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడీ” అని కొందరు
క్రైస్తవ సోదరులు దావీదు కీర్తనను గళమెత్తి కమ్మగా పాడుతారు. సన్నని తంతుల సీతారతో, చక్కని
స్వరములతో, తంబురతో,
నాట్యముతో, తంతి వాయిద్యముతో, మ్రోగు
తాళములతో, పిల్లనగ్రోవి బూరధ్వనితో సైతము ఆ మహాదేవుని స్తుతించండి అంటూ
శ్రావ్యంగా పాడుతారు.
ఈ భక్తి శ్రవణ
స్థాయిని దాటి కీర్తన స్థాయిలో పడిందన్న మాట. అయితే
నాకు ఈ శ్రావణానందం ఎక్కువసేపు నిలువలేదు. మంచి శుక్రవారం రోజు మొన్నీ మధ్య చర్చికి హాజరయ్యాను. “When
I survey the Wondrous cross” అనే పాట
ఎత్తుకొన్నారు. గిటారు, హార్మోనియం, వయొలిన్
మొదలైన సంగీత వాద్యాలతో గాయక శిఖామణులు తయారయ్యారు. “See
from His head, His hands, His feet – sorrow and
love flow mingled down…” అనే చరణం వచ్చింది. ఎంతో బాధతో హృదయవేదనతో పాడవలసిన ఈ పాటను చెవులు గింగుర్లెత్తే వాయిద్యాలతో, రాగతాళ యుక్తంగా, బృందగీతం లాగా అర్ధాన్ని ఆస్వాదించకుండా పాడుతున్నా రేమిటా అని నాకు బాధవేసింది.
“అపరాధిని
ఏసయ్యా – కృప జూపి బ్రోవు మయ్యా... ప్రక్కలో బల్లెపుపోటు – గ్రక్కున బొడిచితి నేనే”
అనే పాట నిజమైన భక్తిపరుడు ఎలా పాడాలి ? కానీ ఓ చర్చిలో డ్రమ్ము, సైడ్రమ్ము, తాళాలు, చప్పట్లు,
కంజీరాలతో యమజోరుగా పాడారు. నాకైతే సిగ్గు వేసింది. ఇక్కడ ఈ కీర్తన భావంలో
లీనం కాకుండా కేవలం శ్రవణ పేయంగా పాడజూసిన
పసిభక్తులు ఆత్మ నివేదన స్థాయికి ఎదగాలని ప్రయత్నం
చేయటం లేదు.
ఇక స్మరణం
సంగతి “ఓ రామ నీ నామ మెంతో రుచిరా... జుంటితేనెల కన్నా, పనసతొనల కన్నా, వెన్న మీగడల కన్నా ఎంతెంతో రుచిరా”
అని నామస్మరణం చేశారు బాగానే ఉంది. అదే నోటి తోటి “ఎంతో చేదురా”
అని కూడా అంటున్నారు. అర్చనం, సేవనం ప్రక్కన పెట్టి అసలు దేవుణ్ణి ఎలా బుట్టలో వేసికోవాలా, ఆయనకు ఎలా గ్యాస్ కొట్టాలా అనే యావలో భక్తులు పడిపోయారు.
ముఖస్తుతి బెడిసి కొట్టినప్పుడు ముఖాన పట్టుకొని దేవుడంతటి వాడిని దూషించి దులిపేయటానికి సైతం మనిషి వెనుకాడలేదు.
“నను
బ్రోవమని చెప్పవే” అని దేవుళ్ళ భార్యలను రికమెండేషన్ కోసం పంపారు. ఆయన గారు “చక్కగా మరుకేళిలో సొక్కియున్నప్పుడో, మీరిద్దరు కలిసి
ఏకాంతంలో ఏకశయ్యపై నున్నప్పుడో” కాస్త చెప్పు వింటాడు అని
ఆవిడకు నూరిపోశారు. “పతిదేవు వడిలోన మురిసేటి వేళ విభునికి మామాట
వినిపించవమ్మ” అని చిట్కా చెప్పారు. ఎంతకీ కోర్కె లీడేరని భక్తుడు “ఎవడబ్బసొమ్మను
కొన్నావు” నీకే నేను పెట్టుబడి పెట్టాను అని చొక్కా కాలరు పట్టుకుని దేవుణ్ణి నిలదీశాడు.
ఇక వందనము, దాస్యము ఎంత చక్కగా చేస్తున్నారో మనము ఎరిగినవే. తరువాత స్థాయి సఖ్యము. అంటే దేవుడితో వివాదం తీరి భక్తుడు మరో రకం పాట అందుకుంటాడు. “కమలాకుచ
చూచుక కుంకుమతో – నియతారుణి తాతుల నీలతను ”
అంటూ దేవుడి బుగ్గలపై సిగ్గులు మొగ్గలు తొడిగేలా చేస్తాడు. “కూచోన్నతే
కుంకుమ రాగ శోణే
నమస్తే” అంటూ దైవం మెలికలు
తిరిగి పోయేలా చేస్తాడు. “పట్టుపానుపు పైన పవ్వళించరసామి”
అని దేవుడిని పడుకోబెట్టి జోల కూడా పాడుతాడు. దూదేకుల సిద్దయ్య చెప్పిన తొమ్మిది రకాల భక్తి నాకు నిజానికి తొంభై రకాలుగా కనపడుతున్నది. ఏ రకంగా భక్తి చేసినా మనిషి
కోరేది ఒక్కటే. అది సుఖం. భక్తి కూడా
సుఖంగా ఉండాలి. మనం కొట్టే గ్యాసుకు దేవుడు ఉబ్బితబ్బిబ్బుకావాలి.
మనం తిడితే దేవుడు ఒంగి లొంగిరావాలి. మన బాటకు
ఆయన అడ్డు రాకూడదు. అడ్డొస్తే అయిపు లేకుండా చెయ్యాలి. దేవుడు మనం చెప్పినట్లు వినాలి. దేవుడు ఉన్నదే మన కోసం. లేకపోతే దేవుడుంది
ఎవరి కోసం ? అందువల్లనే దేవుడు మనిషి కోరుకున్న రూపంలోకి మారుతూ మనిషి చేతిలో మైనపు
ముద్దలాగానో, మట్టి సుద్దలాగానో ఉండి తీరాలి. నీ చేతికి ఎముకలేదంటే, సంపదలియ్యాలి. నీ రూపం మనోహరం అంటే ఐసై పోవాలి. మరి ఇంత మంచి దేవుణ్ణి కీర్తించాలంటే ఎంత మంచి వాయిద్యాలు కావాలి ? అందుకే ఈ మధ్య పెద్ద కేసియోలు, లౌడ్ స్పీకర్లు కూడా వాడుతున్నారు. అందుకే నా కనిపిస్తుంది “సర్వసృష్టిలో మనిషి తల మానిక” అని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి