ఏడ్పు ఏడందాల లాభం
నవ్వు నాలుగందాల చేటు – ఏడుపు ఏడింటికి అనర్ధం అంటుంటారు.
ఈ సంగతి ఏమో గాని నవ్వాల్సిన సమయంలో
నవ్వటం ఏడవాల్సిన సమయంలో ఏడవటం గనుక
చేయకపోతే చేటు తప్పదని ఈనాటి శాస్త్రజ్ఞూలు
తేల్చి చెబుతున్నారు. ఖేదానికి మోదానికి తేడా తెలియని రాళ్ళ లాంటి మనుషులు కొందరుంటారు. వాళ్ళు నవ్వరూ ఏడ్వరూ. ఇతరులెవారైనా తమ ముందు నవ్వినా ఏడ్చినా
స్పందించరు. తప్పుకుపోతుంటారు.
అసలు వాళ్ళ ముఖాలలో ఏ భావమూ మనకు కనిపించదు.
అలాంటి వారి ముఖాలను “
ఆండ్రీ గ్రోమికో ఫేసెస్” అంటారట. ఇలాంటి వాళ్ళకు పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ అని తేల్చారు.
“నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే
వస్తాయి. ఏకన్నీటి వెనకాల ఏముందో ఎవడికి
తెలుసు“
అని ఓ కవి ప్రశ్నించాడు. నవ్వే ఆడదాన్ని, ఏడ్చే మగవాడినీ నమ్మరాదని కొంత మంది సూత్రీకరిస్తే,
అసలు నవ్వలేని వాళ్ళ నెవరినీ నమ్మవద్దని
కొందరు తీర్మానించారు. నవ్వే వాళ్ళ ముందే జారిపడి కొందరు ఏడుస్తూ ఉంటారు. పొర్లించి పొర్లించి చక్కలిగిలి పెట్టినా కొంతమంది నవ్వరు. ఇహి అంటారు అంతే. అట్లకాడ ఎర్రగా కాల్చి వాతలు
పెట్టినా కొందరు ఏడవరు. అబ్బా అంటారు.
కన్నీళ్ళు రాకుండా ఎంతగా నవ్వినా ఎంతగా
ఏడ్చినా ఎంత మాత్రం ప్రయోజనం ఉండదని మానసిక వైద్యులు కొంత మంది గంట కొట్టి చెబుతున్నారు. “దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు” అని
ఏసుక్రీస్తు చెబితే, విషాదవదనం
హృదయాన్ని గుణ పరుస్తుంది అని సొలోమోను చెప్పాడు. వాళ్ళ మాటలు నిజమేనని తెలుస్తోంది. ఏడ్చి మొహం కడుక్కున్నట్లు
అనే సామెత చాలా తీసివేతగా నిర్లక్ష్యంగా
అంటుంటాము. ఫలానా పని చేయటం ఏడ్చి మొహం కడుక్కున్నట్లుగా
ఉంది. అంటే ఏమీ బాగోలేదు అనే అర్ధంతో వాడుతారు. కానీ హృదయపూర్వకంగా ఏడ్చి , మనసు
తేలిక పరుచుకుని, మొహం
కడుక్కున్నాక ఎంత హాయిగా ఉంటుందో అలా ఉందని దాని
అసలు అర్ధం. ట్రాజెడీ సినిమాకు
వెళ్ళిన తెలుగు ఆడపడుచులు ఏడ్చి మొహం తుడుచుకున్నట్లుగా
బయటికొస్తారు.
అప్పుడే పుట్టిన
శిశువు ఏడవకపోతే పెద్దవాళ్ళకు పుట్టెడు దుఃఖం ముంచుకు
వస్తుంది. ఏడుస్తున్నావెందుకు బ్రాహ్మడా అంటే, ఒకనాడు నా మొహం నవ్వి చచ్చిందా అన్నాడట.
ఏడ్చి వెంకట స్వామి అనిపించుకున్నట్లు,
ఏడ్చి తద్దినం పెట్టించుకున్నట్లు ఉండకుండా ఎవరికీ కాన
రాకుండా గది లోకి పోయి తలుపులు మూసి
బిగ్గరగా శక్తి కొద్దీ ఏడవాలట.
ఆ ఏడవటం కూడా మొక్కుబడి కార్యక్రమంలాగా కాకుండా, నిజంగానే బాధపడుతూ కన్నీళ్ళు బయటికి పేల్లుబికి
వచ్చేలా ఏడవాలట. అలా చేస్తే దేహంలోని
నవనాడులూ
సేదదీరి హృదయాలు తేలికపడి ఆరోగ్యం
బాగుపడుతుందని కలకత్తా డాక్టర్ శ్రీ ప్రణయ్ పోతే దార్ అంటున్నాడు. ఈయన ఆ మహా పట్టణంలో ఒక “ఏడ్పుల వైద్యశాల “(క్రై క్లినిక్
) నడుపుతున్నాడు. నిత్యం పని వత్తిడులతోగాని, ఇంటి సమస్యలతోగాని, ఆధ్యాత్మిక మిధ్యాత్మక
చింతనలతో గాని సతమతమై పోతూ అనారోగ్యం
పాలైన బాధాసర్పదష్టులు
తీరిగా కూర్చుని ఏడవటానికి అందులో
ఆయన సకల సౌకర్యాలు సమకూర్చాడు. అక్కడ చేరిన పేషెంట్లు ఎవరికి వారే విడివిడిగా ఏకాంతంగా ఏడ్చుకోవచ్చు. లేదా పదిమందితో కలిసి బృందగానంగా కూడా
విలపించవచ్చట. ఒకవేళ ఎంతగా ప్రయత్నించినా
ఏడుపురాని గ్రోమీకోలకు గోర్భచెవులకు విషాదభరితమైన కథలు చెబుతారట. అప్పటికీ వారి వదనాల మీద విషాదం అలుముకోకపోతే గుండె చెదిరిపోయే స్థాయిలో, విషాద సినిమాలు
ఏడుపు నిషా ఎక్కిందాకా చూపిస్తారట.
ఏడుపు రావటం తోటే వాటిని ఆపకుండా కళ్ళు
చెమ్మగిల్లి ధారాపాతంగా ఓ బొచ్చె నిండేంత
వరకూ కన్నీళ్లు రప్పిస్తారట. ఆ దెబ్బతో మనిషి
సంపూర్ణ స్వస్తత పొందుతాడట. మానసిక రోగాలన్నీ ఈ వైద్యంతోనే మటుమాయం అవుతాయట. కానీ ఖర్చులేకుండా రోదన తోనే రోగాలు పోయే ఈ పద్ధతిని ప్రభుత్వం ప్రోత్సహించి ప్రతి
మండల కేంద్రంలో ఒక “ఏడ్పుల ఆసుపత్రి “ కట్టిస్తే బాగుంటుందని నా సూచన.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి