భా.జ.పా. రాజకీయ వింత
గీటురాయి 16-5-1986
న్యూఢిల్లీలో మే పదవ తేదీన జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం 25 సూత్రాల ఆర్ధిక కార్యక్రమాన్ని ఆమోదించింది. గాంధేయ సోషలిజం, దీన దయాళ్ ఉపాధ్యాయ సమగ్ర మానవతా వాదం, జయ ప్రకాష్ నారాయణ అంత్యోదయ, గ్రామోదయ వాదాల మేలు కలయికగా ఈ ఆర్ధిక కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రకటించింది.
అయితే “ గాంధేయ సోషలిజం “ అనే సాంకేతిక పదం స్వయంగా భా. జ. పా. లోని కొందరు ప్రతినిధులకే మింగుడు పడలేదు. గాంధీ గారికి - సోషలిజానికి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటిది ఆ రెండు పదాలను కలపటం వీరికి ఆశ్చర్యం కలిగించింది. పైగా గాంధీ గారు బ్రతికున్న రోజుల్లో గాంధీ సిద్ధాంతాలను దుమ్మెత్తి పోసింది జనసంఘం వాళ్లే.ఆయన చనిపోయేదాకా జనసంఘం వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఆయన మరణానంతరం ప్రజల్లో ఆయన సిద్ధాంతాల పట్ల పెల్లుబికిన ఆదరణను బట్టి జన సంఘం తన ప్రచార పంథాను మార్చుకొన్నది.
ఆ జనసంఘం నవీన రూపమైన భా.జ.పా. అచ్చమయిన గాంధీ మార్గాన్ని గాని, అచ్చమయిన సోషలిజాన్ని గాని దారిద్ర్య నిర్మూలన కోసం ఎన్నుకోక, “ పరస్పరం పొసగని రెండు విభిన్న ధృవాలను” కట్టగట్టి ఎన్నుకోవటం విచిత్రంగా ఉంది. అందుకే గాంధేయ సోషలిజం అనే పదాన్ని తొలగించమని కొందరు ప్రతినిధులు అడిగారు.
గాంధేయం అంటే అహింసా, సామరస్య పూర్వకమైన యజమాని కార్మిక సంబంధాలు, వర్ణాశ్రమ వ్యవస్థ. సోషలిజం అంటే శ్రమ దోపిడీకి అవకాశం లేని సమ సమాజ వ్యవస్థ. ఈ రెండు ఎలా పొసగుతాయి ? అందుకే ఇవి రెండూ “ పరస్పర విరుధ్ధమైన రెండు విభిన్న ధృవాలు” అని నేటి భా.జ.పా అధ్యక్షులు ఎల్.కె. అద్వానీ సయితం గతంలో అనేవారు. అయితే ఆయన కూడా అధ్యక్ష పదవి రాగానే ఈ విచిత్ర వాదానికి తల వంచారు.
గాంధీ గారి ప్రధాన సిద్ధాంతం ‘ అహింస ‘ ను ఎన్నుకొన్న భా.జ.పా. కార్యకర్తలు చిన్న సైజు త్రిశూలాలను ధరించటం ఎందుకో అర్ధం కావటం లేదు. శిక్కులు కృపాణాలు ధరిస్తున్నారు గనుక భా.జ.పా. హిందువులు త్రిశూలాలను ధరించాలని వారు వాదిస్తున్నారు. మరి గాంధీ గారి సంగతేమిటి ? సోషలిజం పరిస్థితి ఏమిటి ?
“ గాంధేయ సోషలిజం “ అంటే “ అజాగళస్థానం “ అన్నట్లు అర్ధంగాని ఉపయోగించని మాటలాగే ఉంది గాని దరిద్ర నారాయణులను నిజంగా ఉద్ధరించేలా లేదు. రెండు పడవల మీద కాలేస్తే ఏమవుతుంది ? జనాకర్షణ పొందిన గాంధేయ వాదం, సామ్య వాదాలను కలిపి ప్రజలను సులభంగా బుట్టలో వేసుకోవచ్చన్న అత్యాశతో భా.జ.పా. అవలంభించిన ఈ నూతన ప్రచార పంధా నిజ స్వరూపాన్ని కాలమే బయట పెడుతుంది.