కర్నాటక క్రిష్ణా, ఈ కరప్షన్ లీల ఎవరిది ?
గీటురాయి 23-5-1986
ఉత్తరమో దక్షిణమో లేనిదే ఈనాడే కాదు పూర్వ కాలంలో కూడా పనులు జరిగేవి కావని చాలా దాఖలాలున్నాయి. ఇక్ష్వాకుల కాలం నుండి లంచం యొక్క ప్రతి రూపమే బహుమతి అని కొందరి ఉవాచ. కానీ కేవలం ఈ బహుమతులు అందరూ స్వీకరించరు. సరాసరి ఆఫీసులోకెళ్ళి సమర్పించబోతే దయ్యం పట్టిన వాడిని కొట్టినట్లు కొడతారు, బయటికి నెడతారు.దీనికి విరుగుడు ఇక్ష్వాకుల కాలంలోనే కనిపెట్టబడింది.“ ఇక్ష్వాకుల తిలకా ఇంత తిన్నావు, ఇకనైనా పలకవా “ అని ఎంతో మొత్తుకొని ఉపయోగం లేక ఆయన లోగుట్టులన్నీ బయట పెట్టి ఎవడబ్బ సొమ్మనుకొన్నావని బెదిరించి పనులు చేయించూకొన్నాడొకాయన, అందరూ అలా బెదిరించలేరు గదా !
అందుకే ఇంకొకాయన చాలా గొప్ప ప్లాను వేశాడు. సరాసరి ఇక్ష్వాకుల తిలకుని ఇంటికెళ్ళాడు. ఆయనగారి భార్యను పట్టుకొని నారీ శిరోమణీ, జననీ అని ముందు పొగిడాడు. కుమారా నీ కోర్కె ఏమిటి ? అని అడిగిందామె. కోర్కె చెప్పి “ నను బ్రోవమని చెప్పు తల్లీ “ అన్నాడు. “ ఎలాగయ్యా ఆయన వినే ఘటం కాదే “ అన్నది. ఆయన ఎప్పుడెప్పుడు ఎలా చెబితే వింటాడో కొన్ని చిట్కాలు చెప్పాడు.
“ తల్లీ నిన్ను పక్కన చేర్చుకొని చెక్కిలి నొక్కుతూ చక్కగా మరుకేళిలో సొక్కిపోయిన టైం లో చెప్పు “ అన్నాడు. ‘ అప్పుడూ వినకపోతే ? ‘ అందామె. “ ఆయన నిను గూడి ఏకాంతంలో ఏకశయ్యమీద ఉన్నప్పుడు చెప్పమ్మా“ అన్నాడు. ‘మంచం దిగగానే మరచి పోతాడేమో ఎలా ?’ అందామె. “నిద్ర మేల్కొని ఆఫీసుకి రాబోయేవేళ బోధించు నెలతా ! “ అన్నాడు. ఈ ప్లాను సక్సెస్ అయ్యి ఆ లోకాంత రంగుడు ఈ అభ్యాగతుని పని నెరవేర్చాడు. అయితే ఆ కాలంలో అవినీతి నిరోధక శాఖలు, కోర్టులు, లోకాయుక్త లేదు గనుక సరిపోయింది.
కర్నాటక ముఖ్య మంత్రి రామకృష్ణ హెగ్డే గారి భార్యామణికి బహుమతులిచ్చి అనేక మంది ఇలానే ఆమెను ఊదరగొట్టి ఆయన చేత పనులు చేయించుకొన్నారట. సారాయి కేసులో వచ్చిన అపవాదుకు కించిత్తు చింతించి పదవి వదిలి మళ్ళీ చేపట్టిన హెగ్డే గారి భార్యామణి సిఫారసుల పరంపర తీగలాగితే దొంకంతా కదిలిన చందంగా ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటీ బయటికొస్తున్నాయి. పచ్చకాగితాలు, పచ్చల పతకాలు ఇంట్లో కొచ్చాయి బాగానే ఉందిగాని, తన భార్యామణి లాలనకు పరవశించి పోయి చకచకా పనులు జరిపించిన హెగ్డే నేడు బంగారప్పల కూపీలకు తల్లడిల్లి పోతున్నాడు. బయటికి పళ్ల బిగువు చూపిస్తున్నా “ ఎంత పని చేశావే నారీ శిరోమణీ ” అని లోపల్లోపలే కుమిలి పోతున్నాడట పాపం !!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి