గెలిచిన వాడిదే గంగ
కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు “ తాంబూలాలిచ్చేశాను ఇక తన్నుకు చావండి “ అని ఇంటిల్లిపాదినీ ఇరకాటంలో పెడతాడు. ఇంట్లో తన పెత్తనానికి ఎదురులేదని నిరూపిస్తాడు. అంతటి ఆత్మాభిమానం గల మనిషి అగ్నిహోత్రావధాన్లు.
ఆంధ్రలో పర్యటించి వెళ్ళిన రాజీవ్ గాంధీ ఆ పాటి తెగువను గూడా చూపించలేక “ తెలుగు గంగ సంగతి మీరే తేల్చుకోండి ” అని సమస్యను నానబెట్టి వెళ్ళాడు. పైగా బలాబలాలు తేల్చుకోవటానికి వారం పది రోజుల్లో ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ల మధ్య సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పాడు.
నీళ్ళకోసం వాళ్ళంతా తన్నుకొనేదాకా ఆగడం ఎందుకు చివరికి తేల్చిచెప్పేది మీరేగదా, ఆ తగాదా ఆపగూడదా ? అని పత్రికల వాళ్ళు అడిగారు. నీళ్ళ చెంబు మా చేతుల్లో లేదు. వాళ్ళ లోనే ఎవరో ఒకరు దాన్ని ఊడబీక్కోవాలి.
ఎవరూ పీక్కోలేకపోతే మేమొచ్చి సామరస్యంగా పీకులాటను పరిష్కరిస్తాం అని ఆయన గారు సెలవిచ్చారు.
నేసేవాడ్ని నమ్ముకునిపొలిమేర జగడం ఒప్పుకొన్నట్లు తెలుగు రాముడు తమిళ రాముడ్ని నమ్ముకుని, తీపి తినిపించి మరీ రంగంలో దూకాడు. కర్ణాటక, మహారాష్ట్ర, కేంద్రం కలిసి పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మట్టి కాలేదుగా అంటున్నాడు. సరే ఇంతమంది కలిసి (బండ) రాముణ్ణి బాదేస్తుంటే అరవరాముడు అదేమిటి అనలేదు. నోరుగూడా పడిపోయి పాపం బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్నాడు. ఛీ, పాకీ వాడితో సరసంకంటే, అత్తరు సాహెబుతో కలహం మేలనుకొని మన రాముడు రాజీవుడితో పోరు మొదలుపెట్టాడు. ఆ జీవుడు పప్పులు పెట్టి పోరు మాపాలని చూస్తున్నాడు. పైగా తన్నుకోండి ఎవరు గెలుస్తారో చూద్దాం అంటున్నాడు. నెయ్యి నూనె చెడి హోమంలో పొగ మాత్రం మిగిలినట్టుంది తెలుగు గంగ పరిస్థితి. --- నూర్ బాషా రహంతుల్లా
గీటురాయి 25-4-1986
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి