12, జూన్ 2012, మంగళవారం

గౌను డాబుతో గౌరవం?


     గౌను డాబుతో గౌరవం?
ప్రధాన మంత్రికి స్వాగతం చెబుదామని వస్తే నన్ను బలవంతంగా ఆపేశారు,ముఖ్యమంత్రి గారి ఆదేశాలంట అని భాగ్యనగర ప్రధమ పౌరుడు వెంగళరావుముందు బావురుమన్నాడు. ఇంకేముంది చొప్పవామిలో నిప్పు రాజుకున్నట్లయ్యింది పరిస్థితి. ఆగ్రహాలు, అనుగ్రహాలు జరిగి పోయాయనుకోండి. అది వేరే విషయం.
      
       ప్రధానికి స్వాగతం, వీడ్కోళ్ళు చెప్పటం తమ ఒక్కరి గుత్తసొత్తని అనుకుంటూ, అలా తోక వెంబడి నారాయణా అంటూ వెళ్ళటం గొప్పతనమనీ భావించే నాయకులు ఢిల్లీ పోయిన నాడు ఆ ప్రధానినే కలవటానికి ఎన్ని పాట్లు పడాల్సి వస్తున్నదో గమనించాలి. అప్పుడు వీళ్ళకు స్వాగత సత్కారాలు ఎవరు, అలా చేస్తున్నారో ఆలోచించాలి.  ఆయాసం ఒకరిది , అనుభవం ఇంకొకరిది.

       ఈ మాత్రం సంబడానికి ఎంత ఆర్భాటమో! స్వాగతాలు చెప్పటానికి పోటీలు పడటం, పరుగులు తీయడం , మరొకణ్ణి అడ్డగించటం సిగ్గుచేటైన విషయం.ఆకలి అని రెండు చేతుల్తో తింటారా? అంత అత్యాశ పనికిరాదు. నిజమైన ప్రజానాయకుడు, పరిపాలకుడు స్వాగతం చెప్పించుకోడు. తన ప్రజలకు నిష్కళంకమైన సేవకునిగా తన్నుతాను తగ్గించుకొంటాడు. ఆడంబరాలకు దూరమవుతాడు.

       ప్రధాని మెప్పు పొందాలని నాయకులు పడే తాపత్రయం, కక్కుర్తి చూస్తే అసహ్యం వేస్తున్నది. ఇవతలికి రమ్మంటే ఇల్లంతా నాదేననే రకం తయారయ్యారు. మెడబట్టుకొని గెంటుతున్నా చూరు పట్టుకుని వ్రేల్లాడే వాళ్ళను ఏమనాలి? మేయర్ వెనక్కి తిరిగొచ్చి తన ఆత్మాభిమానాన్ని నిరూపించుకొన్నట్లయితే బాగుండేది. ప్రధానికి స్వాగతం చెప్పటానికి పోనియ్యనంత మాత్రాన ఏదో గొప్ప నష్టం జరిగినట్లు, తాను ఒక రాజధాని నగరానికి మేయర్ ననే సంగతి గూడ మరిచిపోయి మరో రావు ముందు ఏడవటం సిగ్గుచేటు.

       భరతుడికి పట్టాభిషేకం, రాముడికి రాజ్యం లా ఉంది భాగ్యనగరం, సుంకరి ముందు సుఖదుఃఖాలు  చెప్పుకొంటే ఏం లాభం? మేయర్ పదవి చిన్నదయినా మేయర్ గారికి నైతిక బలం, ఆత్మాభిమానం ఉండాలి. అవి ఉంటే రామారావులు, రాజీవ్ గాంధీలు మీకే స్వాగతం పలుకుతారు. మేయర్ గారు దైర్యం పుంజుకోవాలి. నైతిక బలం పెంపొందించుకోవాలి. ఇదే విశాఖపట్టణం మేయర్ కు  జరిగి ఉంటే తఢాఖా చూపించి ఉండేవాడు. గౌను డాబుతో కోరిక లీడేరవు, ప్రకాశ రావుగారు కొన్ని స్పష్టమయిన ధ్యేయాలను, నియమాలను కలిగి ఉండాలి. అదే అత్యాశపరులకు కనువిప్పు కలిగిస్తుంది.                                                    ----  నూర్ బాషా రహంతుల్లా
                                     గీటురాయి      18-4-1986

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి