11, జూన్ 2012, సోమవారం

అవినీతి జాడ్యం


అవినీతి జాడ్యం

          అధికారి అన్యాయానికి వెరవాలి అని సామెత. అన్యాయానికి అధికారి ఒక్కడే కాదు అందరూ వెరవాల్సిందేనని, పైగా అన్యాయాన్ని సహించకూడదనీ, అసహ్యించుకోవాలనీ నా అభిమతం. మీలో మీరు ఒకళ్ల ఆస్థిని మరొకరు
అన్యాయంగా కబళించవద్దు. బుద్ధి పూర్వకంగా అక్రమంగా ఇతరుల ఆస్థిలో భాగం ఏదైనా కాజేసే అవకాశం లభిస్తుందనే దురుద్దేశ్యంతో (లంచాలిచ్చి) దాన్ని న్యాయ నిర్ణేతల వద్దకు తీసుకొని పోవద్దు అని దేవుడు సెలవిచ్చాడు. (ఖురాన్ 2 : 188)

       దేవుడు ఏ పనైతే చెయ్యొద్దంటాడో ఆ పనినే  చేయాలని మనిషి తాపత్రయ పడుతుంటాడు. తత్ఫలితంగానే మానవులకీ దుస్థితి దాపురిస్తున్నది. లంచమివ్వబోయిన కాంట్రాక్టర్ ను చీదరించుకొంటే తప్పు బాబూ దీన్ని లంచం అనుకోకు, ఇది బహుమతి! ఇక్ష్వాకుల కాలం నుంచి దీని పేరు ఇదే అని గొప్ప నిర్వచనం ఇచ్చాడట.

       లంచం పుచ్చుకొనే వాడి దృష్టికి లంచం మాణిక్యంలాగా ఉంటుందట. అలాంటివాడు ఏమి చేసినా దానిలో యుక్తిగా ప్రవర్తిస్తాడు. ఇదంతా న్యాయ విధుల్ని చెరపటానికే కదా బురదలో పడి  పైకి రాలేని వాడు మరి నాలుగుర్ని ఆ రొంపిలోకి లాగాలని చూసినట్లు లంచగొండి సమాజానికి ఎంతో చెరుపు తెస్తాడు.
  సారాయి త్రాగు చలి తగ్గుతుంది   అంటూ పరమ నీచమయిన సలహాలిస్తాడు.

       ఒంగోలు జిల్లాలో రైతులకివ్వాల్సిన సబ్సిడీని స్వాహా చేసిన అధికారుల అవినీతి ఈ మధ్య బట్ట బయలైంది. ఆ స్వాహా పర్వంలో ఎంతో మంది అధికారులు భాగస్వాములై ఉంటే కేవలం ఒక ఫీల్డ్ అసిస్టెంటును బదిలీ చేయాలని చూస్తున్నారట. ఈ కుంభకోణం మీద ఉన్నతాధికారులు దర్యాప్తు జరపకుండా తాత్సారం చేసినందువలన అధికారులు రికార్డుల్ని తారుమారు చేశారట. వెంటనే రికార్డులకు సీలు చేయాలని స్థానిక శాసన సభ్యుడు శ్రీ పొనుగుపాటి కోటేశ్వరరావు కోరారు.

       హైదారాబాద్ పే అండ్ అకౌంట్స్ ఆఫీసు ఉద్యోగుల జేబులను అవినీతి నిరోధక శాఖ వారు సోదా చేశారు. దానికి ఉద్యోగులు నిరసన తెలిపారు. రాను రాను ఈ ఆవినీతి జాడ్యం ముదిరి పోతున్నది. లంచం పుచ్చుకొనే వారూ, ఇచ్చేవారూ కూడా కొంచెం ప్రశాంతంగా కూర్చోని  తమ జన్మ సాఫల్యత ఏమిటో ఎలానో ఆలోచించుకోవాలి!                  -----   నూర్ బాషా రహంతుల్లా
                                                      గీటురాయి 9-5-1986


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి