రిజర్వేషన్ల రగడ
గీటురాయి 4-7-1986
వెనుకబడిన తరగతుల వారికి రిజర్వేషన్ శాతాన్ని 44 శాతానికి పెంచటమే కాకుండా ఆదాయ పరిమితిని 12 వేల రూపాయలుగా నిర్ణయించటం హర్షణీయం. ప్రపంచంలో ఉన్నవాళ్లూ, లేనివాళ్లు అనే రెండు కులాలే ఉన్నాయని విశాల భావాలు కలవారు సూక్తులు చెపుతున్నప్పటికీ, భారత దేశంలో మాత్రం కొన్ని వందల కులాలు ఉన్నాయని ప్రజాపరంగాను, ప్రభుత్వపరంగానూ రుజువయ్యింది.
తరతరాలుగా కొన్ని తరాల వారు, ఆగ్ర వర్ణాల వారి చేత అణచివేయబడ్డారని ప్రభుత్వం ఒప్పుకొంది. అందుకే వారి ఉద్ధరణ కోసం రిజర్వేషన్లు కల్పించింది. ఒక హరిజనుడు ఈ దేశ ప్రధాని అయిన రోజునే ఈ దేశం బాగుపడినట్లు అవుతుందని గాంధీ గారు తెగ మదన పడేవారట. ఆయన చనిపోగానే “ ఆయన భావాలను ” అటక ఎక్కించి “ ఆయన్ని” గురించి కథలు చెప్పటం మొదలేశారు మనవాళ్ళు. ఆయన స్వంత రాష్ట్రంలోనే హరిజనుల మీద వెనుకబడిన కులాలవారి మీద అగ్రవర్ణాల వారు విరుచుకుపడ్డారు.
అస్సాంలో గణసంగ్రామ పరిషత్, గుజరాత్ లో సంఘర్షణ సమితి
జనం, వెనుకబడ్డ కులాలవాళ్ళ మీద విరుచుకుపడి ఎంత మందిని చంపిందీ మనకు తెలుసు. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలో “ నవ సంఘర్షణ సమితి “ అనే రిజర్వేషన్ వ్యతిరేక సంఘం ఏర్పడింది. అప్పుడే బస్సులమీద దాడి కూడా మొదలయ్యింది.
ఇంతకాలం వెనుకబడిన కులాలలోని సంపన్నులే రిజర్వేషన్ల వల్ల లాభపడ్డారు. నిజమే. ఇప్పుడు ఆదాయ పరిమితిని విధించారు కదా ? ఆయా కులాలలోని బీదవారికి మాత్రమే రిజర్వేషన్ల వల్ల లాభం ఉంటుంది. మరి వీళ్ళు సంఘర్షణ పడదలుచుకున్నది ఆ బీదవారితోటేనా ? ఘర్షణ పడదలుచుకొనే ముందు “ నవ సంఘర్షణ సమితి “ నిదానంగా ఆలోచించుకోవడం మంచిది. రిజర్వేషన్లను కాదు కులాలనే ఎత్తివేయమని కేంద్ర ప్రభుత్వాన్ని, మతాధిపతుల్ని ఒత్తిడి చెయ్యాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి