16, జూన్ 2012, శనివారం

అయ్యబాబోయ్ ! 21 వ శతాబ్దం !!


అయ్యబాబోయ్ ! 21 వ శతాబ్దం !!
                                          

       కాశీ మజిలీ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు, హరిదాసు చెప్పే పిట్ట కథలు అంటే నేను చెవి కోసుకునేవాడ్ని. ఆ కథల్లో దేశాంతరం వెళ్ళిన ఒక్కో రాజు ప్రయాణపు తీరు గుండెలవిసిపోయేలా ఉండేది. చీమలు దూరని చిత్తవి, కాకులు దూరని కారావి, పాల సముద్రం, పెరుగు సముద్రం, మజ్జిగ సముద్రం ఇలాంటి ఏడేడు పద్నాలుగు సముద్రాలు దాటి,ల సుతల తలాతల రసాతల పాతాళాలు దాటి రాజు గారు గమ్యాన్ని చేరతారు. ఈ కొండవీటి చాంతాడంత లిస్టు విని అయ్యబాబోయ్ అని మనకు అలుపు వస్తుందే గాని హరిదాసు మధ్యలో చస్తే ఆపడు.
  
       కాలినడకన ఇంత పెద్ద ప్రయాణం మొదలెట్టిన ఒక్కో రాజుకు పంచకళ్యాణి దొరుకుతుంది. ఆగమేఘాల మీద కావల్సిన చోటికి తీసికెళుతుంది. ఒక్కో రాజుకు పాపం పాదాలే శరణ్యం అవుతాయి. టాక్సీ వాలా ముందు జట్కావాలా బలాదూర్ అయినట్లు, పంచకళ్యాణిననెక్కిన రాజు ముందు పాచారి  రాజు తీసికట్టవుతాడు.

       ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, టాక్సీలు, రైళ్లు, విమానాలు, రాకెట్లు మకొద్దు. మళ్ళీ ఎద్దులబళ్ళు గుర్రపుళ్ళే ఎక్కి పోదాము అనే రకం మనుషులు మన మధ్యే ఈ మధ్య పుట్టుకొచ్చారు.  ఆఫీసుల్లో అధికారులకి సీలింగ్ ఫ్యానులెందుకు పంకా పుల్లర్లే ఉండాలి అని వాళ్ళు ఢంకా బజాయించి చెబుతున్నారు. గుట్టలుగా పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్ళను అట్టలు దులిపి కట్టలు కట్టి మేమే మళ్ళీ పేరుస్తుంటాము గాని, ఫైళ్ళ గుట్టలను నేలమట్టం చేసే కంప్యూటర్లను ఆఫీసుల్లోకి తెస్తే మామీద  ఒట్టేనంటున్నారు. ఇలాంటి పంచకళ్యాణి
పథకాలను పట్టుబట్టి గట్టిగా బయటికి నెట్టి వేస్తున్నారు. అసలు పంచకళ్యాణి  అంటేనే పాపమన్నట్లు చెవులు మూసుకొంటున్నారు.

       అసలీ గొడవంతా రాజీవ్ గాంధీ డైలాగు విన్న తరువాతనే ఎక్కువైంది. భారత మాను పంచకళ్యాణి ఎక్కించి ఇప్పటికిప్పుడే 21 వ శతాబ్దంలోకి తీసికెళ్లుతాను చూసుకోండి నా తఢాఖా ! అని ఆయన పత్రికల వాళ్ళ ముందు బడాయి పోయాడు. ఇంకేముంది బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నట్లు ఈ పత్రికలవాళ్లు 18 వ శతాబ్దపు ఉద్యోగుల దగ్గర ఊదేశారు. ఆ  పంచకళ్యాణి కంప్యూటర్లోస్తే మందలు మందలుగా ఉన్న ఉద్యోగులంతా పోతారు. వెయ్యి మంది రాత్రింబళ్లూ బుర్రలు  బద్దలు కొట్టుకొని సంవత్సరం పాటు చేసే పనిని ఆ పంచకళ్యాణి కంప్యూటర్లు ఒక్క చిటికెలో చేసేస్తాయి అని వాళ్ళను ఎగబొడిశారు.

       ద్యోగ వర్గాల్లో కల్లోలం చెలరేగింది. మా కోడి ఈకల కలాలేంగాను ? మా సిరాబుడ్లు ఏమైపోను ? మా తుమ్మ బంక డబ్బాలేంగాను ? మా పెళ్ళాం బిడ్డలేమైపోను ? 21 శతాబ్దం రావాలంటే ఇంకా బోలెడు టైమ్ ఉంది. అయినా తలుచుకున్నప్పుడే తలంబ్రాలు కావాలంటే ఎలా ? పంచకళ్యాణిల  ప్రవేశాన్ని నిషేధించండి. 21 వ శతాబ్దానికి బాట మూసేయ్యండి అంటూ నినాదాలు నిరసన ప్రదర్శనలు మొదలేశారు.

       ఈ మధ్య మా ఊరెళితే అక్కడొక త్రాగుబోతు మంచి నిషాలో తన కవిత్వాన్ని
ప్రజలకిలా వినిపించాడు : -

       ష్టష్టాలన్నీ ఆలు ఎరుగును గాని
       ఈదులెమ్మట తిరిగే ఎదవకేమెరుక
       పంచమాస్వరము కోకిలెరుగును గాని
       కంచెలెమ్మటి తిరిగే కాకికేమెరుక
       నానా రుచులు నాలికెరుగును గాని
       రాతికుండలో తిరిగే తెడ్డుకేమెరుక
       పంచకళ్యాణి పథము  అశ్వ మెరుగును గాని
       గంతలు మోసే గాడిద కేమెరుక

       ఆహా తాగుబోతు కవిత్వానికి చుట్టూ చేరిన శ్రోతలు రంజిల్లారు. నిజమే 21 వ శతాబ్దపు మహిమ మనకేమెరుక ? అనిపించింది.
                           ---నూర్ బాషా రహంతుల్లా గీటురాయి 9-5-1986




      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి