30, జూన్ 2012, శనివారం

తీపి బాధల వలపుకాడు మన్మధుడు


తీపి బాధల వలపుకాడు మన్మధుడు
                                    ఆంధ్ర పత్రిక           1-11-1986
                  చంద్రుని వెన్నెలకు, మన్మధుని మదన తాపానికి దగ్గర సంబంధం ఉంది. మన్మధుని నెలయల్లుడు అని కూడ అంటారు. ఎందుకంటే మన్మధుడు చంద్రుని సోదరియగు లక్ష్మీదేవి  కుమారుడు. చంద్రుని మేనల్లుడు. నెయ్యపురేడు మన్మధుడు తామరలను వికసింపచేయువాడు సూర్ర్యుడైతే, వికసించిన తామరలను ముకుళింపచేయువాడు చంద్రుడు. ఈ నెలజోడు అయిన సూర్యచంద్రులు శ్రీ కృష్ణుని నేత్రములు అని ప్రసిద్ధి. చంద్రుని శిరమున దాల్చిన నెలదారి శివుడు. చంద్రునికి గురువగు బృహస్పతి బార్యయైన తారయందు
బుట్టిన నెలపట్టి బుధుడు. రతీదేవి భర్తయైన మన్మధునికి రణరణకుడని పేరు, మన్మధుని తండ్రి విష్ణువు. మన్మధునికి శత్రువు శివుడు.

              మన్మధుని వాహనము చిలుక, మన్మధుని రధము వాయువు. మన్మధుని వింటినారి తుమ్మెద. మన్మధుని డాలు చేప, ధ్వజము మొసలి. విల్లు చెరకు. బాణాలు అయిదు గనుక పంచబాణుడు లేక పంచరుడు. ఈ అయిదు బాణాలు అయిదు మన్మధావస్థలను కలిగిస్తాయి.

అరవిందము       - ఉన్మాదన
అశోకము          - తాపన
చూతము          - శోషణ
నవమల్లిక          - స్తంభన
నీలోత్పలము     - సమ్మోహనము
శుక్లపక్షమందు జన్మించి అభివృద్ధి చెందుతూ కృష్ణపక్షమందు
క్షీణిస్తూ సంచరించే చంద్రుని వెన్నెల ప్రభావం మన్మధుని మీద చాలా వుంది. వెన్నెల యొక్క స్థాయి మన్మధావస్థ తీవ్రతను నిర్ణయిస్తుంది. చంద్రోదయమున చంద్రకాంతమనే రాయి స్రవిస్తుందట. అందుకనే దాని పేరు నెలరాయి. చంద్ర కిరణాలకు కరిగే శిల నెలట్టు, చంద్రకాంతమణి, చకోరపక్షి వెన్నెలను త్రాగుతుందట.

        రాత్రికి ప్రభువు గనుక చంద్రుని నిశాపతి, నిశాకరుడు, నిశాధీరుడు, నిశాకేతుడు అన్నారు. రాత్రులందు సంచరించే నిశాచరులు, రాక్షసులు, జారులు, దొంగలు, పాములు, గుడ్లగూబలు, చక్రవాకము, నక్క మొదలైనవి.
శ్రీరాముడు నిశాచర వినాశకరుడు అంటారు. జారులు రాత్రికోసం ఎదురు చూస్తారు. యదార్ధవంతులైన ప్రేయసీ ప్రియులు వెన్నెల కోసం ఆశిస్తే, దొంగచాటు వ్యవహారాలవాళ్లు చీకటినే ప్రేమిస్తారు.

        బ్రహ్మ విష్ణువు యొక్క నాభి నుండి పుట్టినందున మన్మధునికీ అన్న అయినాడు. వలపునకు రాజు గనుక మన్మధునికి వలరాజు, వలరేడు, వలపురాయుడు అని పేర్లు. కాముడు, చక్కనయ్య అనగా మన్మధుడే. విష్ణువునకు, లక్ష్మీ దేవి యందు పుట్టినట్లు చెప్పుచున్నప్పటికీ, మన్మధుడు
త్రిమూర్తులతోపాటు స్వయంభువునిగాను, స్వయంజాతునిగాను లెక్కించబడుచున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి