20, జూన్ 2012, బుధవారం

ఆత్మ సౌందర్యం లేని అమాత్యులు


ఆత్మ సౌందర్యం లేని అమాత్యులు
                             గీటురాయి 6-6-1986
              అందమె ఆనందం
               ఆనందమె జీవిత మకరందం

          అని కీ. శే. సముద్రాల ఎప్పుడు సెలవిచ్చారోగానీ ఆయన మాటలను అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా గుబులు పుట్టించింది. ఇనుపకచ్చడం బిగించి కఠోర తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక వికాసానికి ఆనకట్ట వేసుకున్నాడు.
       చింతామణి కోసం  అత్తగారిచ్చిన అంటు మామిడి తోటలను సైతం అమ్మివేసి నీళ్ళ బిందెలు మోసిన భవానీ శంకరం, చావు బతుకుల్లో ఉన్న భార్యను సైతం విడిచి వచ్చి కళ్ళు పొడుచుకొన్న బిల్వమంగళుడు, లక్షల విలువ జేసే వ్యాపారం కోల్పోయి అట్ల పళ్ళెం చేత బట్టిన సుబ్బిశెట్టి పాతకాలం ఉదాహరణలు.

       విమానంలోని అందగత్తెలతో అసభ్యంగా ఒళ్ళు మరచి ప్రవర్తించిన అడిక్ రామారావు, ప్రభుత్వ అతిధి గృహాన్ని తనకు నచ్చిన అందగత్తెతో శృంగారలీలలకు
ఉపయోగించిన జె.బి. పట్నాయక్ లు ఈనాటి ఉదాహరణలు. దొరికితే దొంగ దొరక్కపోతే దొర అన్నట్లు దొంగచాటుగా శృంగారాస్వాదన చేస్తున్న స్వాములు మరెందరో ఉన్నారు. వీరంతా ఎప్పుడో ఎక్కడో పొందే స్వర్గానందం ఇప్పుడే ఇక్కడే పొందుదామని తొందరపడిపోతున్నట్లుంది.

       కానీ శరీరానందమే జీవిత మకరందం కాదు. ఆత్మానందం పొందాలిరా నాయనా అంటే వినేవారెవరు ? అందాన్ని ఆనందాన్ని తనివితీరా ఆస్వాదించి చివరికి శరీర సౌందర్యం తాత్కాలికమని గ్రహించిన వాడు కాబట్టి వేమన తొమ్మిది కంతల తిత్తికి ఇమ్మగు సొమ్ములు ఏటికి చెపుమా ? అన్నాడు. సత్య్కార్యాలు చేయటం ద్వారా ఆత్మ సౌందర్యం పెరుగుతుంది. శాశ్వతమయిన ఆనందం కలుగుతుంది. ఇదే దారిపై కష్టాల్లో పుటము వేయబడిన వ్యక్తి బంగారంలాగా సుందరుడవుతాడు. ఆఖరికి అన్నివిధాలా ఆనందానికి అర్హుడవుతాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి