గతి చెడినా మతి చెడనిస్తానా!
“నిజమైనా కలయైనా
నిరాశలో ఒకటేలే
పగలైనా రేయైనా
ఎడారిలో ఒకటేలే”
- అంటూ ఉసూరు మనే వాళ్ళ దెబ్బ మన దేశానికి ఎక్కువై పొయ్యింది. ఏ ఆఫీసుకి పోయినా, ఏ అధికారిని పలకరించినా ఉత్సాహం కానరావటం లేదు. “ క్షణం తీరిక లేదు. ఏమిటో మా బ్రతుకులు ఇలా తగలబడ్డాయి. “ అని నిట్టూర్చే వాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
“ ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ “ అని ఒక పక్క చెవిలో ఇల్లు కట్టుకుని బోధిస్తున్నా తలకెక్కటం లేదు జనానికి. పైగా “ ఇరుసున కందెనబెట్టక పరమేశ్వరుని బండి కూడా పారదు” పొమ్మంటున్నారు.
ఉసూరుమనొద్దని చెప్పిన మహాత్ముడే “ కండ కలవాడే మనిషి “ అన్నాడు. మనిషి కండబట్టాలంటే దండిగా డబ్బుండొద్దా ? అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. పచ్చ కాగితం (తాయం) చూపించక పోతే పని చెయ్యలేనని మారాం చేస్తున్నారు. ఈ తాయాల బెడదను నివారించి, ఉద్యోగులు త్వరితంగా పనులు చేసేలా ఏం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఉపాయం చెప్పవయ్యా అంటే ఉరి తాడు తెచ్చుకొమ్మన్నట్లు దేశంలో కవిరాజులంతా కలిసి “ అయిదురోజుల పనివారం “ అనే హారాన్ని ప్రభుత్వం మెడకి బిగించారు. ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచి, కందెన ఖర్చు తగ్గించి, తళ తళ లాడే తెల్లని పాలనను తెచ్చే రాజయోగం ఇదేనని ‘ శల ‘ విచ్చారు.
ఆసనాలు వేస్తే పాసనాలు పుట్టినట్లు ఈ అలవాటు లేని ఔపాసనం మన రాజయోగికి (రాజీవుడికి కాదు) అచ్చిరాలేదు. పైగా మూతి మీసాలన్నీ కాలి పోయాక ‘ ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కు పోయాను దేవుడా ! “ అంటున్నాడు.
పదిమంది కలిసి ఏమిటీ ఈ నిలకడ లేని పనులు అని నిలదీసి అడిగితే నీరస పడి పోతున్నాడు. “ ఒంటరినైపోయాను ఇక ఇంటికి ఏమని పోను ? “ అని మొరాయిస్తున్నాడు.
కానీ ఒక్క విషయం ఒప్పుకోవచ్చు. ఆవులు మళ్లించిన వాడే అర్జునుడు అన్నట్లు ఉద్యోగుల ఆలమందలను 55 ఏళ్ళనీ, మళ్ళీ 58 ఏళ్ళనీ, అయిదు రోజులేననీ మళ్ళీ ఆరు రోజులనీ అటూ ఇటూ అల్లకల్లోలంగా మళ్లిస్తున్న ఈ అరుణ వస్త్రాల అర్జునుని పట్టుదల సామాన్యమైంది కాదు.
అందుకే ఈ ఆసనం వేయమని గతంలో సలహా ఇచ్చిన కవి రాజులు కొందరు మరొక ఆసనం వెయ్యమని సలహా ఇచ్చారట. అదేమిటంటే “ మంద మొత్తాన్ని ఒకే వైపు మల్లిస్తే బాగుండటం లేదు. అందువల్ల మందను రెండు భాగాలు చేసి రెండు రూటుల్లో నడిపించండి. పట్ట(ణ)పుటావులున్నాయి. అవి అంత తొందరగా మళ్లాలంటే కష్టం. ఎందుకంటే ఎటుచూసినా ఏడామడ దూరంలో ఉంటుంటాయి.రావాలన్నాపోవాలన్నాకష్టం.అందుకని పట్ట(ణ)పుటావులకు అయిదు రోజులు మిగతా ఆవులకు ఆరు రోజులు పని పెట్టండి “ అన్నారట.
మీరు చెప్పే ఉపాయాలు ఇక నేను ఎంత మాత్రం విననని ( గతానుభవాన్ని గుర్తు తెచ్చుకొని ) తెగేసి చెప్పాడట. అందుకే ఏమీ చేయలేని ఉసూరు వర్గాలు ఇప్పుడీ క్రింది పాట పాడుతున్నాయి.
“ 55 ఎళ్ళైనా 58 ఎళ్ళైనా
ఎడారిలో ఒకటేలే
5 రోజులైనా 6 రోజులైనా
ఆఫీసులో ఒకటేలే “
నూర్ బాషా రహంతుల్లా గీటురాయి 16-5-1986
https://www.facebook.com/nrahamthulla/posts/1152528084779180
రిప్లయితొలగించండి