కులాలను రద్దు చేయలి ! ఆంధ్ర పత్రిక 15-8-1986
తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారికి పెంచిన రిజర్వేషన్ల వల్ల అగ్రవర్ణాల వారి ఆగ్రహానికి గురయ్యింది. రాష్ట్రంలో కుల సమరాలు జరిగే వాతావరణం నెలకొన్నది. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ రిజర్వేషన్లను సమర్ధించాయి.అయితే ఈ పార్టీల యొక్క మద్దతు లేకుండానే అగ్రకులాల వారు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం నిర్వహిస్తున్నారా అనేది లోతుగా పరిశీలించవలసిన విషయం.స్త్రీలకు విద్యా ఉద్యోగాలలో 30 శాతం స్థానిక సంస్థలలో 9 శాతం రిజర్వేషన్లు కల్పించటం జరిగింది. స్త్రీలకు సమాన ఆస్తి హక్కు బిల్లుని కూడా తెలుగుదేశం ప్రభుత్వం తెచ్చింది. అయినా రిజర్వేషన్ వ్యతిరేక ప్రదర్శనల్లో విద్యార్ధినులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఆశ్చర్యం కలిగించింది.
అయితే ఇక్కడి విషయం ఏమిటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మగవాళ్ళు పాల్గొన్నట్లే ఆగ్ర కులాల ఆడవాళ్ళూ పాల్గొంటారు. స్త్రీలకు ప్రత్యేకంగా కల్పించిన రిజర్వేషన్లను రద్దు చేయటం ద్వారా మరో స్త్రీ ఉద్యమాన్ని చూడవచ్చు.
ప్రతిభా పాటవాలను సమాధి చేసినట్లు, ఉరి తీసినట్లు రిజర్వేషన్ వ్యతిరేకులు ప్రదర్శనలు ఇస్తున్నారు. తెలివి తేటలు ఆగ్ర వర్ణాల వారి గుత్త సొత్తు కాదని, అవకాశం ఇస్తే లక్షలాది అంబేద్కర్లు పైకొస్తారని రిజర్వేషన్లను సమర్ధించే వారు ప్రతినినాదాలు ఇస్తున్నారు.
వాస్తవానికి సంఘంలో కొన్ని కులాలు సాంఘికంగా, ఆర్ధికంగా విద్యావిషయకంగా వెనుకబడి ఉండటం శతాబ్దాల తరబడి జరుగుతూ వచ్చింది. ఇది ఈనాటి సమస్యకాదు. గుణకర్మలను బట్టి నాలుగు వర్ణాలుగా మానవజాతిని నేనే చేశాను అని చెప్పిన కృష్ణుడు యాదవ కులంలో పెరిగాడు. ఆయన ఏ అగ్రవర్ణాన్ని ఎన్నుకోలేదు.
అయితే కుల విభజనకు గుణాన్ని గాని కర్మను గాని ప్రాతిపదికగా తీసికోక కేవలం వారసత్వాన్నే ప్రాతిపదికగా తీసికోవటంవల్ల కొన్ని కుటుంబాల వారికి కొన్ని రకాల పనులు శాశ్వతంగా అంటగట్టబడ్డాయి. వారిని ఊరికి, దూరంగా నెట్టివేశాయి.
పారిశ్రామిక విప్లవానంతరం పనులన్నీ చాలావరకు యంత్రాలు చేస్తున్నాయి. అయితే ఈనాటికీ ఈ ప్రజలకు ఆ కులాల పేర్లనే తగిలించి పిలవటం, రిజర్వేషన్ల పేరుతో ఆయా కులాలను శాశ్వతం చేయటం శోచనీయం. ఇందువల్ల ఈ ప్రజలు వారిచుట్టూ కట్టబడిన కులవలయాల్లో నుంచి ఇక బయటికిరారు కులాభిమానం కులాల పోటీ అనివార్యమవుతాయి.
అందువల్ల కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒక చట్టం తేవాలి. సమస్త కులాలను రద్దు చెయ్యాలి. కుల సంఘాలన్నిటినీ నిర్మూలించాలి. కులాలను సూచించే పేర్లు పెట్టుకోవటం ప్రజలు ఆపేయాలి. పేరు మతాన్ని సూచించవచ్చు గాని కులాన్ని కాదు. ఎందుకంటే మతస్తులంతా సమానులై యుండాలి. ధరఖాస్తు మీద కులాన్ని తెలుపమని కోరకూడదు. భూసంస్కరణలు అమలు జరిపి దరిద్రులను లేవనెత్తాలి. ఉన్నది రెండే కులాలు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు. వీరిద్దర్నీ సమానంచేస్తే ఏ రేజర్వేషన్లు అక్కరలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసిన పని.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి