హఠయోగం వదిలేసిన రాజయోగి
చావాలని సన్యాసం తీసుకొంటే, గంతా బొంతా అంతా కలిసి గాడిద మోత అయ్యిందట. సన్యాసం పుచ్చుకున్న రామారావు గారు నిశ్చింతగా కడుపులో చల్ల కదలకుండా ఇంటో పడుకున్నట్లయితే ఎంత బావుండేది? కాని పాపం ఆయనలో ఉన్న రాజయోగికి నిద్రపట్టలేదు. తిరిగి తిరిగి సింహాసనం సాధించారు. వాస్తవానికి సింహాసనం ఎక్కాక సన్యాసం పుచ్చుకున్నారో, సన్యాసి అయ్యాకే సింహాసనం అధిష్టించారో పై వానికే తెలియాలి.
చెప్పాల్సొచ్చిన విషయం ఏమిటంటే, రాష్ట్రాన్ని ఉద్ధరిద్దామని వచ్చిన ఈ రాజయోగి, అప్పుడప్పుడు తానేమీ చేయలేక పోతున్నానని నిస్సహాయంగా నిట్టూరుపులు విడుస్తున్నాడు. చింతపండు అంటే పొంతకుండ తెచ్చే రకాలు పదవుల్లో తిష్ఠ వేశారమో అని వాపోతున్నాడు. ఇంటా బయటా కూడా ఆయన మాట వినేవాళ్లూ కరువయ్యారు. ఏదో మొండిగా బండిని నెట్టుకొస్తున్నాడు. తగాదా పెట్టి తమాషా చూసేవాళ్ళే బాగున్నారు.
చివరికి ఆయన చేయిపడ్డ కృష్ణా నది ఎండిపోతుందేమోననిపిస్తున్నది. చిటికెడు నూనె తెచ్చి చిన్నింట్లో దీపం, పెద్దింట్లో దీపం వత్తికి మా వదిన నెత్తికి, మంగలి కత్తికి, మా బావ జుట్టుకు సరిపెట్టాలి అన్నట్లు కృష్ణా నదిలో నీళ్ళు ఎన్ని ప్రాజెక్టులకు వస్తాయో సవివరమైన అన్వేషణ జరగ లేదు. ఇప్పుడు హైదరాబాదుకు కూడా కృష్ణా నది నీళ్లే తెస్తాడట. మద్రాసు కివ్వటానికే మిగులు నీళ్ళు లేవే, ఇన్ని నీళ్ళు ఎక్కడి నుండి తెస్తారు అని ఆయన ప్రత్యర్ధులు అడుగుతున్నారు. ఎండిపోయిన కుంటను జీవనది అని తెగ ఆనకట్టలు కట్టి కాలవలు తవ్వినట్లుంది ఈ వ్యవహారం.
గోదావరిని కృష్ణా నదితో కలిపితే నీటి సమస్య చాలా వరకు తగ్గుతుందని మేధావుల సలహా. గంగను కావేరితో కలపాలని, భారీ ప్రాజెక్టుల్ని కేంద్రమే భరించాలని రామారావుగారి భారీ కోరిక, కేంద్రం వింటేగా? అందుకే ఆయనకా నిరాశ!
--- నూర్ బాషా రహంతుల్లా
--- నూర్ బాషా రహంతుల్లా
గీటురాయి 2-5-1986
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి