లోభికి నాలుగందాల నష్టం
గీటురాయి 14-10-1988
గాజుం బూస యనర్ఘ రత్నమగునా ?
కాకంబు రాయంచ యౌనా ?
జోరీగ మధువ్రతేంద్రమగునా ?
నట్టెన్ము పంచాశ్వమౌనా ?
జిల్లేడు సూరావనీజ మగునా ?
నానాదిగంతంబులన్ రాజౌనా ఘన లోభీ
దుర్జనుడు ?
భర్గా ! పార్వతీ వల్లభా !
అంటూ
ప్రస్తుతం ఎన్జీవోలు మొదలుకొని మజిలిసీయులు, కాంగీ మునిసిపలీయుల వరకు ప్రతి పక్షీయులంతా శార్ధూలాల్లాగా పెద్దన్న మీద విరుచుకుపడుతున్నారు.
యాంటీ ఎంటీయారీయులంతా ఒక పధకం ప్రకారం
ఐక్యం అవుతున్నారు. ‘లోభి బీదకంటే బీడు, లోభి వాని నడుగ లాభంబు
లేదయా’ అనే స్లోగన్లను సిద్ధం
చేసుకుంటున్నారు. లోభికి నాలుగందాల నష్టం అనే సామెత, నా దగ్గరేముంది బూడిద తప్ప అనే అన్నగారి విషయంలో నిజమయ్యింది. పోతూ పారవేస్తూ పోయి వస్తూ ఏరుకు తినే పద్ధతిలో కొనసాగుతున్న
అన్నగారి పాలనలో అన్ని వర్గాల జనం
అలసిపోయ్యారని మిత్రపక్షం వారు కూడా చిత్రమైన కూతలు కూస్తున్నారు. కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా ఈ వ్యవహారమంతా ఉంది గనుక అభివృద్ధి అంటూ ఏమీ
లేదని ఆర్ధిక వేత్తలంటున్నారు. అసలు
తీసుకోవటమే గాని ఆ చెయ్యి ఇవ్వటం ఎరుగదని ఎన్జీవోలు, మునిసిపాలిటీల వాళ్ళు అంటున్నారు. ఇక
అన్నగారి వ్యవహారం చూస్తే “నేను
లోభినైతే కేంద్రంలోని రాజీవుడు పరమ లోభి. పై నుండి పైసలు రాకపోతే నేను ఎక్కడ నుండి
తెచ్చివీళ్ళందరికీ ఇచ్చేదీ “ అని వాదిస్తున్నాడు.
ఇవ్వకపోతే
ఎదుర్కో మా ఉద్యమాలు అంటూ వీళ్ళు దీక్షలకు, దహనాలకు పాల్పడుతున్నారు.
ఎంతో కొంత నష్టం జరిగాక గాని అన్నకు కనువిప్పు
కావటం లేదు. వివిధ వర్గాలలో పేరుకు పోయిన అసంతృప్తిని గమనించి వారి సమస్యలను పరిష్కరిద్దామన్న ఆలోచన ఆయనకు ఉంటే పరిష్కారం సుళువుగా గాకపోయనా సాధ్యమే. కానీ తన ఆలోచన తప్ప మరొకని వాదాన్నే
తలకెక్కనివ్వని ఒంటెత్తుపోకడవల్ల క్రమంగా తన కాళ్ళ చుట్టూ కంప తయారవుతున్న నిజాన్ని ఆయన గమనించడం
లేదు. ప్రతి వర్గంలోనూ స్వార్ధపరులున్న
మాట నిజమే. అయితే ఆయా స్వార్ధపరుల్ని బట్టి ఆయా వర్గాల అసలు సమస్యలన్నిటినీ
పట్టించుకోకపోవటం వెర్రితనమే అవుతుంది.
పూలతోగూడ దారం తలకెక్కినట్లుగా ప్రజా సమస్యలను చేతబట్టి దురాశాపరులైన నాయకులే రంగం మీదికి
వస్తారు. నాయకులమీద గుర్రుతో సమస్యలు నాన్చటం పేను కుక్కమంటే చెవి కొరికి నట్లుంటుంది.
వంగిన వాని క్రింద మరీ వంగిన వానికి ఎలాంటి పరిస్థితి సిద్ధిస్తుందో అలాంటి పరిస్థితే నేడు పరమ లోభి కేంద్రం నుండి
లోభి రాష్ట్రం వరకు , దాని క్రింద
వంగిన స్వల్ప లోభి జిల్లా పరిషత్తులు, అతిస్వల్ప లోభి మునిసిపాలిటీలకు
సిద్ధించింది. బంతికే రావద్దంటే విస్తరాకు తెమ్మన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం అని కేంద్రం రాష్ట్రాలను, రాష్ట్రాలు జిల్లాలను ఈసడించుకుంటూ ఉంటాయి. బట్టతలమ్మ పాపట
తీయమన్నట్లుగా లోభులంతా కలిసి పరమ లోభిని
పట్టుకుని ప్రాకులాడుతారు. ప్రజలు అల్లాడిపోవటం
ఆగదు మింటికీ మంటికీ ముడేసినట్లుగా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళూ విరుచుకుపడి చివరికి ప్రజల ఆస్తుల్నే ద్వంసం చేస్తున్నారు.
ఈ రకంగా పరిస్తితి చక్కబడుతుందనే ఆశే
కలగటం లేదు. కరువు భత్యమే ఇవ్వలేక
కటకటలాడిపోతున్న సమయంలో విహార యాత్రలకు యల్.
టి. సీ. డబ్బు లిమ్మనట్లు గొంతెమ్మ కోర్కెలు అడిగేవాళ్ళు కూడా తాము ఎలాంటి వాళ్ళను ఎలాంటి పరిస్థితిలో
ఉన్నప్పుడు అడుగుతున్నామో ఆలోచించి మరీ అడగాలి. అడిగేదాకా ఆగటం, అవతలివాడి నిగ్రహాన్ని పరీక్షించటం, అలిగి ఆందోళనకు దిగాక ఇవ్వటం లాంటి పనికి మాలిన పనులు మానుకుని ఎవరికివ్వాల్సింది వారికి సకాలంలో
ఇవ్వటం పదవిలో ఉన్నవాని ఆరోగ్యానికి
మంచిది.