మూడు రాజధానులైతే
ముప్పు లేదు
గీటురాయి 8-2-1990
రాయలసీమ సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం
ఏర్పడాల్సిందేనని రాయలసీమ ఎన్జీవోల సంఘం నాయకులు ప్రకటించారు.
కడప, కర్నూలు, అనంతపురం,
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో “రాయలసీమ రాష్ట్రం”
ఏర్పాటు చేయాలని వారు కోరారు. రాయలసీమ
అంటే శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించిన ప్రాంతం. 1930 వరకు బళ్ళారి, కడప, కర్నూలు,
అనంతపురం జిల్లాలను సీడెడ్ జిల్లాలు అనేవారు. 1951
జనాభా లెక్కల ప్రకారం కోయంబత్తూరు, సేలం, మధుర జిల్లాలలో వరుసగా 20, 15, 14 శాతం తెలుగు ప్రజలున్నారు. అవన్నీ
ఇప్పుడు తమిళనాడుకెళ్ళాయి. కోలారు,
పాపగడ, బళ్ళారి, బస్తర్,
సిరివంచ, గంజాం, కోరాపుట్, పొన్నేరి, తిరువళ్ళూరు, గుడియాత్తం, హోసూరు, కృష్ణగిరి మొదలైన
తెలుగు తాలూకాలు పోగొట్టుకున్నాము. ఎంతో ప్రాముఖ్యమైన మద్రాసు (చెన్నపట్నం) నే పోగొట్టుకున్నాము. “పెద్ద
మనుషుల ఒప్పందం” లోని 14 అంశాలు
దాదాపు అందరూ మరచిపోయారు. ఉప ముఖ్యమంత్రి పదవి
ఎవరికీ ఇవ్వటం లేదు. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
చట్టం సెక్షన్ 51(2) ప్రకారం రాష్ట్రంలో
మరికొన్ని చోట్ల ఏర్పాటు చేయవలసిన హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయలేదు.
విజయవాడ –
గుంటూరు రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఉండాలని శ్రీ ఎన్. జి. రంగా కోరారు (ఇండియన్ ఎక్స్ ప్రెస్
11-11-1953). దక్షిణ భారత హిందీ ప్రచార సభ
కార్యదర్శి శ్రీ ఎం. సత్యనారాయణ రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడాలని కోరారు (గోల్కొండ పత్రిక 10-8-1954). రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమీషన్ 1954 లో హైదరాబాదు
వచ్చినప్పుడు “హైదరాబాదు రాష్ట్రం”
అలాగే ఉండాలని వినాయకరావు, విద్యాలంకార్, పి. హనుమంతరావు
అనే మంత్రులు, దక్కన్ క్రానికల్, సియాసత్, రెహ్ నుమాఎ – దక్కన్, హైదారాబాద్ బులెటిన్ పత్రికల సంపాదకులు
విజ్ఞప్తి చేశారు. “రెండు
తెలుగు రాష్ట్రాలు” ఏర్పడాలని మహదేవ్ సింగ్, యస్. బి. గిరి, కె. సోమయాజులు, వీరారెడ్డి, జె. నరసింగరావు, కె. వి. రంగారెడ్డి ప్రభృతులు కోరారు.
మన
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ మర్రి చెన్నారెడ్డి గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన సంగతి మనకు
తెలుసు. 29-7-1989 వ తేదీన గాంధీభవన్ లో
జరిగిన సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
అధ్యక్షుని హోదాలో ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు
కావాలని మౌలానా అబుల్ కలాం ఆజాద్ కూడా ఆకాంక్షించారని, వేర్పాటు
వాదాన్ని ప్రోత్సహించాలనే ధోరణితో కాక, చిన్న రాష్ట్రాలు ఏర్పడాలనే
భావనతోనే ప్రత్యేక తెలంగాణా వాదాన్ని ఆజాద్ సమర్ధించారనీ ఆయన అన్నారు. జవాహర్లాల్ నెహ్రూ కూడా
ఆదిలో చిన్న రాష్ట్రాల వాదాన్ని సమర్ధించారనీ చెన్నారెడ్డి గుర్తు చేశారు. మాజీ కేంద్రమంత్రి శ్రీ వసంత సాధే అయితే చిన్న రాష్ట్రాలవాదాన్ని
విపరీతంగా ప్రచారం చేస్తుంటారు. ఆయన్ని
వేర్పాటు వాది అని ఎవరూ అనలేదు. మహారాష్ట్రలో ‘విధర్భ’ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని ఉప ప్రధాని శ్రీ దేవీలాల్ కోరిక. పెద్ద రాష్ట్రాలను పునర్ వ్యవస్థీకరించి చిన్న రాష్ట్రాలు
ఏర్పాటు చేస్తే పాలన సులభం అవుతుందని, ఇందుకు హర్యానా ఏర్పాటే ఒక ఉదాహరణ అని దేవీలాల్ అంటూ ఉంటారు. విదర్భ, తెలంగాణా రాష్ట్రాల ఏర్పాటుకు రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ
30-9-1955 న సిఫారసు చేసింది. ఆ తరువాత 1956 నవంబర్ 1 వ ఇండియా ను 15 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం గల యూనియన్ గా ప్రకటించారు. ఇప్పుడు రాష్ట్రాల సంఖ్య 25 కు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 7 కు పెరిగింది.
త్వరలో ఢిల్లీ నగరం కూడా ఒక రాష్ట్రం
అవుతుంది.
ఇప్పుడు
రాయలసీమ విషయానికి వద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన రాయలవారి ఙ్ఙ్ఞాపకార్ధంగా ‘ రాయలసీమ ’ అనే పేరును 1928 లో డాక్టర్ చిలుకూరి నారాయణరావు గారు ఈ
ప్రాంతానికి పెట్టారు. అంతకు ముందు ఈ
ప్రాంతాన్ని “ సీడెడ్ జిల్లాలు
” అని బ్రిటీష్ వాళ్ళ కిచ్చాడు. నిస్సారమైన భూములు,
పేద ప్రజలు, అనావృష్టికి రాయలసీమ పెట్టింది పేరు.
1907 లో సీడెడ్
జిల్లాల “ యంగ్ మెన్స్ సోషల్ గేదరింగ్ ”
జరిగింది. 1913 లో ఈ జిల్లాల యువకుల
సమావేశం మహానందిలో జరిగింది. దీనికి పి.
కేశవ పిళ్లే అనే లాయర్ అధ్యక్షత వహించారు. ఆంధ్ర
రాష్ట్రం ఏర్పడితే సీడెడ్ జిల్లాలకు
వలస వచ్చిన తెలుగేతరుల పరిస్థితి దారుణంగా ఉంటుందని, ఆంధ్ర ఉద్యమం ‘బ్రాహ్మణ ఉద్యమం’ అని ఆయన విమర్శించారు. గుత్తి వాస్తవ్యుడైన శ్రీ జి. లక్ష్మణరెడ్డి అనే లాయర్ కూడా పిళ్లేతో గొంతు కలిపారు. సీడెడ్, సర్కారు దక్షిణాది జిల్లాల్లోని తెలుగువాళ్లు కలవలేరనీ, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే పన్నులు పెరుగుతాయనీ, సీడెడ్ జిల్లాల ప్రజలు మద్రాసుకు దగ్గరలో ఉన్నందు వల్ల కలిగే
ప్రయోజనాలు పోతాయని ఆయన వాదించారు.
1917 లో నెల్లూరులో మద్రాస్ ప్రొవిన్షియల్ సమావేశం జరిగింది. మద్రాసుకు దూరమై పోతామనే బెంగతో నెల్లూరు వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకించారు. శ్రీ ఎ.
యస్. కృష్ణారావ్ అనే శాసనసభ్యుడు “మద్రాసు
లేని ఆంద్ర మనకెందుకు?” అని సమావేశం లోంచి లేచి వెళ్ళాడు.
శ్రీ పి.
రామాచారి అనే కాంగ్రెస్ నాయకుడు ఇలా ప్రసంగించారు “ ఆంధ్ర రాష్ట్రంలో కలవటానికి మనకిష్టం
లేదు. రాయలసీమ రాష్ట్రం ఏర్పడుతుందా అని
ఎవరైనా సందేహించనక్కరలేదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ సాధ్యమే పోలాండ్, పోర్చుగల్, మొదలైన చిన్న చిన్న యూరప్ దేశాలు, మైసూర్, త్రావన్కూరు మొదలైన ఇండియన్ రాష్ట్రాలు
స్వతంత్రంగా మనుగడ సాగిస్తూ ఉంటే, ఎనభై లక్షల జనం ఉన్న మనం ఎందుకు ముందుకు పోలేము ? మన ఆరు జిల్లాల వైశాల్యం పై రాష్ట్రాల కంటే ఎక్కువే...? (ది
హిందూ........2-7-1931)
శ్రీ
గాడిచర్ల హరిసర్వోత్తమరావును కాంగ్రెస్ సుభా
నుండి అయ్యదేవర కాళేశ్వరరావు కూల దోయటం, ఆంధ్రా యూనివర్సిటీ కేంద్రాన్ని బెజవాడలో స్థాపించటం రాయలసీమ ప్రజల కోపాన్ని ద్విగుణీకృతం చేశాయి. 1931 లో మద్రాస్ లో రెండో రౌండ్
టేబిల్ కాన్ఫరెన్స్ జరిగింది.అందులో శ్రీ కల్లూరి సుబ్బారావు ఆంధ్రకు
బెజవాడను రాజధానిగా ఉంచి,మదనపల్లి
వేసవి కేంద్రంగా నిర్ణయించాలని సూచించారు. శ్రీ కె. సుబ్రహ్మణ్యం
రాయలసీమ, నెల్లూరులను కలిపి ఒక రాష్ట్రంగా రెండు
తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని
సూచించారు. సీడెడ్ జిల్లాలను ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోకి
తేకుండా, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రంలో కలువకుండా
నిరోధించే ఉద్దేశ్యంతో 1934 లో “రాయలసీమ మహాసభ”
ఏర్పాటు చేశారు. 1937 లో మద్రాస్ లో
ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సి. రాజగోపాలాచారి సీడెడ్ జిల్లాల వారికెవరికి మంత్రి పదవి ఇవ్వలేదు. ఆంధ్ర రాష్ట్రం కోసం
ప్రచారం చేయటానికి మదనపల్లి వచ్చిన
పట్టాభి సీతారామయ్యతో “మా సహకారం లేకుండా నీవు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా సాధిస్తావో చూస్తాంలే”
అంటాడు పాపన్నగుప్త.
ఇలాంటి
పరిస్థితుల్లో చివరికి కాశీనాధుని నాగేశ్వరరావు గారి నివాసం శ్రీ బాగ్ లో (మద్రాసు) ఒప్పందం జరిగింది. దాని ప్రకారం యూనివర్సిటీ, హైకోర్టు,
ప్రధాన కార్యాలయం (రాజధాని) వేరువేరు ప్రాంతాల్లో
ఉండాలని అంగీకరించారు. పౌర ప్రాధాన్యత గల పీఠాలన్ని ఒకే చోట కేంద్రీకరించకుండా ఉండాలని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి
వాదించారు.ఇందుకు ఆయన ఒక ఉదాహరణగా దక్షిణాఫ్రికాను
సూచించారు. ఆదేశానికి ప్రిటోరియమ్
రాజధాని, అక్కడ పరిపాలనకు సంబంధించిన ఆఫీసులు ఉంటాయి. కేప్ టౌన్ లో పార్లమెంటు ఉంటుంది.
బ్లోయెమ్ ఫౌంటైన్ లో ప్రధాన న్యాయస్థానం
ఉంది. అదే పద్ధతిలో విశాఖ పట్టణంలో యూనివర్సిటీ, గుంటూరు
లో హైకోర్టు, కర్నూలులో అసెంబ్లీ ఉండాలనే నిర్ణయం
జరిగింది. రాయలసీమ రెడ్లు, కోస్తా కమ్మలు, బ్రాహ్మణులు మధ్య కుల రాజకీయాలు లేచాయి. మద్రాసులో మరోసారి రాయలసీమ నాయకులకు అన్యాయం, అవమానం
జరిగాయని శ్రీ నీలం సంజీవరెడ్డి వాపోయారు. 1948
జూన్ లో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో శ్రీ ఎన్. జి. రంగా –
ప్రకాశంపంతులు, కళా వెంకట్రావుల మద్దతుతో
సంజీవరెడ్డిని ఓడించారు. ఆంధ్రరాష్ట్ర
ఏర్పాటును వాయిదా వేయాలని శ్రీ సంజీవరెడ్డి కోరారు. శ్రీ ఎన్. యం. శాస్త్రి, హెచ్. లింగారెడ్డి మద్రాసు రాజధానిగా
రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలని
కోరారు. రాయలసీమ ప్రజలకు కోస్తా జిల్లాల వారికి ఆచార వ్యవహారాల్లో తేడా ఉందనీ, తమిళుల దోపిడీ పట్ల కోస్తా వాళ్ళు ఎలా భయపడతారో, కోస్తా జనం అంటే రాయలసీమ వాళ్ళకు అంటే భయం అని వారు పేర్కొన్నారు.
(ఇండియన్ ఎక్స్ ప్రెస్ 10-9-1948)
వారిలో
ఇలాంటి భయాందోళనలు కాలగమనంలో విస్తరించాయి.ప్రస్తుతం
రాయలసీమ సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే “ప్రత్యేక
రాయలసీమ రాష్ట్రం”
ఏర్పాటు కావాలని రాయలసీమ ఎన్జీవోల సంఘం నాయకులు
ప్రకటించారు. కడప, కర్నూలు,అనంతపురం,చిత్తూరు,నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో ఈ రాష్ట్రం ఏర్పాటు
చేయాలని వారు కోరారు. “ప్రత్యేక
తెలంగాణా” “ప్రత్యేక ఆంధ్ర”
రాష్ట్రాల కోసం గతంలో (1968,
1972 సంవత్సరాలలో) ఉద్యమాలు కొనసాగాయి.అప్పట్లో ఆ ఉద్యమాలను అణచివేసినప్పటికీ
లోలోన పెరిగే అసంతృప్తితో ఏనాటికైనా అవి తిరిగి తలెత్తక తప్పదు.ఎందుకంటే భాషా ప్రాతిపదిక మీద ‘విశాలాంధ్ర’
ఏర్పడింది కానీ, భాష
ఒక్కటే మనల్ని కలిపి ఉంచలేదు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల ఆర్ధికాభివృద్ధి సమంగా జరగాలి. ఆయా ప్రాంతాల విద్యా, సాంస్కృతిక అవసరాలు తీర్చబడాలి. పెద్ద రాష్ట్రాలలో పరిపాలన ఎంత జాగ్రత్తాగా జరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురి కావటం ఖాయం. రాజకీయ అధికారం ఏ ప్రాంతపు అభివృద్ధికీ నోచు కోవటం, మిగతా ప్రాంతాలు ఆపసోపాలు పడుతూ ఉందటం భారత రాజకీయ చరిత్ర మనకు నేర్పిన పాఠం. చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల ఈ
అసమానతలు, అసంతృప్తి నశిస్తాయి. ఆయా ప్రాతాల ప్రజలు తమను మరింత
సమర్ధంగా చౌకగా నాణ్యంగా
పరిపాలించుకుంటారు. స్థానిక స్వపరిపాలన సిద్ధిస్తుంది. ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు రాష్ట్ర స్థాయి ప్లానింగ్ బోర్డు, అడ్వొకేట్ జనరల్ మొదలైన
ఉన్నత కార్యాలయాలు వస్తాయి. గవర్నరు, ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక అభివృద్ధి కార్యక్రమాలకు దగ్గరలో ఉండి పని
చేస్తారు. బి. జె. పి చిన్న రాష్ట్రాలు
ఏర్పాటు చేస్తానని తన మేనిఫెస్టోలో వాగ్ధానం చేసింది.
మరో ముఖ్య
విషయం ఏమిటంటే 1951 లో 3 కోట్ల జనాభా గల రాష్ట్రం, 1981
నాటికి 6 కోట్లకు చేరింది. 1981 నాటికి 6 కోట్లకు చేరింది. 1991
లెక్కల్లో ఇది ఎనిమిది కోట్లకు చేరవచ్చు. ఆ
రోజుల్లో జనాభా తక్కువ గనుక ఒక్క రాజధానితో
పనులు గడుపుకొని పోవటం కుదిరింది. మరి ఈనాడు ఇన్ని కోట్ల మందికి ఒకే ఒక్క నగరం దిక్కు కావటం, ఆ నగరం కూడా అనునిత్యం కర్ఫ్యూలో, మారణ కాండలో, మగ్గిపోతూ ఉండటం చూస్తున్నాం. ఉన్నవి చాలనట్లు తెలుగు విశ్వవిద్యాలయం, ఓపెన్ యూనివర్సిటీలు కూడా అక్కడే పెట్టారు. ప్రతి
ఉన్నత స్థాయి కార్యాలయం ఆ నగరంలోనే ఉండటం వల్ల రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి బహు ప్రయాసతో కూడుకున్న ప్రయాణం తప్పటం లేదు. ఎక్కువ మందికి
అవసరమయ్యే సర్వీస్ కమీషన్, ల్యాండ్ రెవిన్యూ కమీషనర్, సివిల్ సప్లయిస్....మొదలయిన
వాటికి ప్రాంతీయ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలేదు. జిల్లాలు, రెవిన్యూ డివిజన్ల సంఖ్య పెంచకపోగా, మండలాలు తీసేసి తాలూకాలు పెట్టబోవటం, ఆఫీసు పనివేళలు మార్చటం అయిదు రోజుల పని... ఇలా ఎవరికీ పనికి రాని ప్రయోగాలతో
పాలన సాగుతున్నది.
చిన్న
రాష్ట్రాల్లో పాలకుల నిర్ణయాలు మంచివి
కాకపోతే వాటి ప్రభావం కొద్ది ప్రాంతం మీదే పడుతుంది. పెద్ద
రాష్ట్రాల్లోనైతే విశాల ప్రజానీకం అలాంటి ప్రభావానికి
గురి కాలవలసి వస్తుంది. అప్పట్లో ఆంధ్ర ప్రజల తలసరి ఆదాయం తొమ్మిది రూపాయల ఆరు అణాలుంటే, తెలంగాణా వాళ్ళది పది హేడు రూపాయలుండేది. (ఇండియన్ ఎక్స్ ప్రెస్ 7-7-1954).
తెలంగాణాలో ఎక్సైజ్ ఆదాయమే అయిదు
కోట్లుండేది.ఈ డబ్బంతా ఆంధ్రాలో ఖర్చు
పెడతారేమోనని తెలంగాణా నాయకులు భయపడ్డారట. (రాష్ట్రాల
పునర్ వ్యవస్థీకరణ కమీషన్ రిపోర్టు పేజీ 105). “తెలంగాణా ను లూఠీ చేయొద్దు”
లాంటి నినాదాలు ఇప్పటికీ హైదరాబాదు గోడల మీద దర్శన
మిస్తాయి.
తెలుగుగంగ ప్రాజెక్టులో పని చేస్తున్న ఆంధ్ర ఉద్యోగుల్ని రక రకాలుగా భయపెట్టి రాయలసీమ నుంచి వెళ్ళగొట్టారు. ఒకరిపైఒకరు అపనమ్మకం,అసహనంతో కలిసి ఉన్నట్లు నటిస్తున్నారుకానీ మూడు ప్రాంతాలలో ఎవరూ మరో ప్రాంతం వారిని నమ్మే వాతావరణం లేదు.మూడు
తెలుగు రాష్ట్రాలు ఏర్పడటం మంచిదే. కనీసం
గుంటూరు,
కర్నూలు పట్టణాలకు ప్రాంతీయ రాజధాని
నగరాలుగా అభివృద్ధి చేసి, అసెంబ్లీ సమావేశాలు వరుస ప్రకారంగా ఈ మూడు నగరాల్లో జరిపితే అన్ని
ప్రాంతాల వారికీ సమ్మతంగా ఉంటుంది.