సహనభావం ఎందుకు లోపిస్తుంది ?
గీటురాయి 23-10-1987
చం|| మతమని వంక బెట్టి కసుమాలపు గట్టుపకాసులెందరో
కుతుకల బట్టి కోసికొన గూడదటంచును బుద్ధి చెప్పి ఖం
డితముగా వారి వారి యవినీతుల మానిపి ఏలా సాధులన్
బ్రతుకగా నీవు దేవ? యొక వారము పాటయినన్ బ్రశాంతిగా!
అని కవిరాజు శ్రే త్రిపురనేని రామస్వామి గారు తన మొత్తుకోళ్ళు దేవునికి నివేదిస్తాడు. మతవర్గాల మధ్య సత్సంబంధాలు లేకపోవటాన్ని బట్టి మదన పడిపోతాడు. అయితే వివిధ మతాలలో చేరిన దుష్టులు, షైతాను అనుచరులే ఈ పరమత సహనం కొరవడి మౌఢ్యంతో హింసకు, హత్యలకు పాల్పడుతున్నారు. దైవం ఒక్కడే అయినప్పుడు అందరు ఆరాధిస్తున్నదీ ఆయన్నే కదా? మధ్యలో ఈ పోట్లాటలు ఎందుకు? అసలు ఎదుటి మతం వాడు చెప్పేదాంట్లో సత్యమేమైనా ఉందా లేదా అని పరిశీలన చేసేవాళ్ళు చుక్కల్లో చంద్రుడిలాగా ఉంటుంటారు. ఎదుటివాడు చెప్పేదాన్ని అసలు వినకూడదనుకునే వాళ్ళు, చెవులు మూసుకునేవాళ్ళు సంఘంలో ఎక్కువ మంది ఉంటే మతాలన్నీ చెవిటి మతాలే అవుతాయి. అందుకే కవిరాజు గారు తన ప్రశ్నకు సమాధానం తానే ఇచ్చుకుంటాడు : -
చం|| ఎవని ముఖాబ్జ నిర్గళితమేని సుభాషితమైన యట్టిచో
ప్రవిమల భక్తి గైకొనుట పాడి ఎరుంగుము, ఘోరపంక సం
భవ మగు పద్మ మౌదలను బండితకోటి ధరింపు చుండదే?
తవులదు ధర్మపీడ యవధానముతో నిటులాచరించినన్
చం|| తెలియదె నీకు మీ తెలుగుదేశమునన్ బ్రభవించి భక్తి సం
కలిత మహానుభావుడయి క్రాలిన గోపన విప్రజాతుడై
వెలసిన మాట? యాతడు పవిత్రుడు మ్లేచ్ఛుడునౌ కబీరుచే తెలియడే భక్తి యోగము సుధీజన సన్నుత మోక్ష పద్ధతిన్?
ధర్మం చెప్పేవాడు చండాలుడైతేనేమి, తురకవాడు అయితేనేమి? అతను చెప్పింది ధర్మమే అయితే అంగీకరించటానికి ఆటంకం ఏమిటి ? మానవులందరూ సమానులేననీ, అందరి ఆరాధనా కేంద్రం దేవుడేననీ అంగీకరించినంత కాలం మనుషుల్లో తేడాలు రానే రావు. ఎప్పుడైతే మనుషుల్లో ఒకరు ఘనులనీ, మరొకరు చండాలురనీ తేడాలు వచ్చాయో అప్పుడే వారి మధ్య అపనమ్మకాలు వస్తాయి. మల్లీ మల్లీ, మంచానికి కాళ్ళు ఎన్నే అంటే మూడున్నొక్కటి అందట. ఎల్లీ ఎల్లీ, నీ మంచానికి ఎన్ని కాళ్ళే అంటే నాలుగు అందట. సుబ్బీ, మరి నీ మంచానికో అంటే రెండేరెళ్లు అందట. ఈ రకంగా మంచం కాళ్ళ లెక్కలో మల్ల గుల్లాలు పడుతూ అమ్మలక్కలంతా గుద్దుకు చచ్చినట్లుగా ఉంది నేటి మతవర్గాల పరిస్థితి.
సహనం చూపించేకొద్దీ సత్సంబంధాలు పెరుగుతాయి. ఎదుటి మతం వాళ్ళని ఎత్తిపొడుస్తూ, ఎకసక్కేలు ఆడటం, ఎక్కిరించటం లాంటి పనులే ఎదురుదెబ్బ తీస్తాయి. దగ్గరకు పిలిచి దాసరీ నీ కన్నులొట్ట అంటే, తాంబూర్ర తీసుకొని తలపగిలిందాకా కొట్టాడట. నీ మతంలో సుగుణం ఏదైనా ఉంటే చెబుతూ పో, వినేవాడు వింటాడు వినని వాడు వినడు. వినని వాళ్ళంతా నీ శత్రువులని అనుకోవద్దు. నీకు లాగానే ఆత్మసాక్షి గల మనుషులేనని భావించు. అందరం ఆ మట్టిలోనే కలుస్తాం. అందరం సృష్టికర్త వద్దకే మళ్ళీ చేరుతాం. లెక్క అడిగేది, డొక్క చీల్చేదీ ఆయన. మధ్యలో మనకేల అనుకుంటే మహా సత్సంబంధాలు కొనసాగుతాయి. అల్ప విద్వాంసుడు ఆక్షేపణకు పెద్ద అయినట్లు, అలగా జనాన్ని తయారుచేసి అల్లరులను పురికొల్పే భక్తిహీనుల వల్లనే వైషమ్యాలు చెలరేగుతున్నాయి. అలాంటి వాళ్ళతో విసిగిపోయి కూచిమంచి తిమ్మకవి గారు ఇలా కోపపడ్డారు : -
ఆ || కోపం బెక్కువ, తాల్మియిల్ల, పరుషోక్తుల్ పెల్లు, సత్యంబు తీల్
కాపట్యంబు ఘనంబు, లోభమునహంకారంబు దట్టంబు, హృ
చ్చాపలంబధికంబు, ద్రోహమది విస్తారంబు, ఛీ ! యిట్టి దు
ర్వ్యాపార ప్రభు లేరీ బ్రోతురిక భర్గా ! పార్వతీ వల్లభా !
ఈ దేశంలోని ప్రభువులు, పండితులు, పామరులు కూడా కూచిమంచి గారు పేర్కొన్న కులక్షణాలను కూల్చివేసుకుంటే మత సామరస్యం, శాంతి వెల్లివిరుస్తాయి !