శరీర మాధ్యం ఖలు కామసాధనం
గీటురాయి 3-11-1989
రసాత్మలను మిన్నులకెత్తే
విశృంఖల ప్రణయగతిని
అరికట్టలేవు శాసనాలు
అడ్డగించలేవు పరిసరాలు
ఖలీల్ జిబ్రాన్ గారి కవితకు నారాయణరెడ్డి గారి స్వచ్చందానుసరణం ఇది. చెప్పినవి నాలుగు ముక్కలే అయినా
ప్రపంచం ఏమనుకుంటుందో అని లెక్కా జమా చేయకుండా చెప్పినందుకు కవిని, వాటిని మెచ్చి అనువదించిన అయ్యను అభినందించాలి. “కాశీకి
పోయినా కనలేరు మోక్షంబు – కామిగాక
మోక్షగామిగాడు” అని కాముకులంతా మొదటి నుంచీ
మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ కామినీ వేషధారికి
సాధ్వి నడతలేమి తెలుస్తాయి అంటూ విశృంఖల కామకలాపాలకు, సద్వర్తన చట్టాలను ఉచ్చులుగా బిగించారు కొందరు. కాశీకి వెళ్ళి కామాన్ని వదిలిరమ్మన్నారు.
అయితే కాశీకి పోయిన కాముకుడు బెండను
వదిలాడు గాని ముండను వదల్లేదట. గుణం మానవే గూటాల పోలీ అంటే నా మనువైనా
మానుతాను గాని నా గుణం మానను అన్నట్లుగా, మతబోధకులు ఎన్ని
విధాలా నచ్చజెప్పినా జనంలోని కామ వికారం అణగి పోలేదు.
ప్రభుత్వం చేసిన చట్టాలు, శాసనాలన్నీ నిష్ఫలమయాయి. కామమనేది మూడో పురుషార్ధం గా చెలామణి అవుతూనే
ఉంది.
గోవా
శాసనసభ స్పీకర్ ను, అబలల మీద అత్యాచారాలకు పాల్పడుతున్న
పోలీసులను గుర్తుకు తెచ్చుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తున్నది.
నేను మందు తింటాను. నీవు పత్యముండు అన్నట్లుగా అవకాశము, అధికారమూ ఉన్న వాళ్ళంతా అడ్డగోలు
సుఖాలు అనుభవిస్తూ సామాన్యజనానికి
నీతులు చెబుతున్నారు. వారి పనుల్ని సమర్ధించు
కోవటం కోసం అహల్య, మేనక, తార మొదలైన వాళ్ళ కథల్ని ఏకరువు
పెడుతున్నారు. రేడియోల్లో, టీవీల్లో, సినిమాలలో ఈ విశృంఖల కామ ప్రేరక ప్రసారాలు, ప్రచారాలు కొనసాగిస్తున్నారు. కాముకుల
సంతృప్తి కోసం, దూరదర్శన్ లో యథాశక్తిగా అర్ధరాత్రి
సినిమాలు వేస్తున్నారు. అయితే నెయ్యి అని
అరచి నూనె అమ్మినట్లుగా ఈ అర్ధరాత్రి సినిమాలలో కనీసం
అర్ధనగ్నత కూడా లేదని అపరకాముక ప్రేక్షకులంతా పెదవి విరుస్తున్నారు. నిరసన కూడా వ్యక్తం చేశారు. అది విని రాష్ట్రపతి వెంకటరామన్ గారు రాత్రి నిద్రపోకుండా ఈ సినిమాలు
చూసి “అమ్మో, ఇంత సెక్సా కాస్త మోతాదు తగ్గించండి”
అని దూరదర్శనం వాళ్ళని అభ్యర్ధించాడు.
సెక్స్ కంటే వయోలెన్సే నయం అని సెన్సార్ బోర్డు వాళ్ళు నొక్కి వక్కాణిస్తున్నారు. ఆ రెండూ కలిస్తేనే
మాకు లాభాలు వస్తాయి అని నిర్మాతలు
నిరూపిస్తున్నారు.
విదేశీ
యాత్రకు వెళ్ళి వచ్చి ఓ వి.ఐ.పి. ఆ దేశాలలోని హాయైన అనుభవాల గురించి అదేపనిగా సమావేశాల్లో చెబుతుంటాడు. విమానంలో ఆగడం చేసిన ఆడిక్ రామారావు మొదలు మొన్న కొరియా
యువ సమ్మేళనంలో కాంతల వెంటబడిన కాంగీయుల వరకు అందరి ప్రధాన సిద్ధాంతం
ఆత్మానందమే.
ఈ విషయంలో
పూనా పట్టణానికి కొక ప్రత్యేకత ఉంది. ‘శరీర మాధ్యంఖలు కామ
సాధనం’ అంటూ అక్కడే ఆచార్య రజనీష్ గారు ఆశ్రమం
పెట్టారు. వీడియో పార్లర్ల విషయానికొస్తే అరుణాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అక్కడ నిరుద్యోగులందరికీ వీడియో పార్లర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం
ధన సహాయం చేసింది. ప్రస్తుతం అక్కడ అశ్లీల చిత్రాలు చూడటానికీ ఆడామగా కలిసి వెళుతున్నారట. పూనా
పట్టణంలో అశ్లీల వీడియో చూస్తున్న
ప్రేక్షకుల్ని పోలీసులు పట్టుకున్నారు. ప్రేక్షకులు “ఇలాంటివి చూడటం మా జన్మ హక్కు”
అన్నారు. పోలీసులు మా ఆనందానికి
అడ్డుపడ్డారని వాపోయారు. సిటీ సివిల్ కోర్టు వాళ్ళకు ఈ వాదం నచ్చింది. బ్లూ ఫిలిమ్ చూడటం ప్రేక్షకుల హక్కు దానిని ఆపే హక్కు మీకు లేదని కోర్టు పోలీసులకు బుద్ధి చెప్పింది. మన హైదరాబాదు కోర్టు కూడా కేబరే
డాన్సులు ఆపటానికి వీలు లేదని తీర్పు నిచ్చింది.
ఇంతకీ
చెప్పవచ్చిందేమిటంటే విశృంఖలతను ఆపటానికి ఖలీల్ జిబ్రాన్ గారి కాలంలో శాసనాలున్నాయి. కాని ఈనాడు విశృంఖలతను ఆపవద్దని
శాసనాలొస్తున్నాయి. అదే తేడా.