ప్రతిపక్షాల ఐక్యత
గీటురాయి 24-11-1989
“దేవతలతో
జోడు కూడితి
రక్కసులతో
కూడి ఆడితి
కొత్త
మిస్కుల తెలివి పటముని
మంచి
చెడ్డల మార్చితిన్
చూతునా ? అని చూసితిని, మరి
చేతునా ! అని చేసితిని, ఇక
చూడ
చేయగరాని వింతలు
చూసి
కన్నులు కట్టితీన్ ”
అని గురజాడ
అప్పారావు గారు బుద్ధి చపలతతో కొత్త కోర్కెల్లో తగులుకొని
లంగరెత్తు అంటాడు. రకరకాల ఆశయాలతో అలరారుతున్న ప్రతిపక్షాల
వాళ్ళంతా ఇలాగే పదవీ వ్యామోహంతో,
తమ తమ ఆశయాలను కలబోసుకొని ఒక ఫ్రంట్ గా
కలిశారు. దరిద్రుడికి సద్దికట్టి ఇస్తే, ఊరి వెలుపల కుంటకాడనే భోంచేసి పోయాడట. దారిలేని బావి, దాపు లేని కొంప అన్నట్లుగా, కాంగ్రెసును కూల్చి వీళ్ళు నిర్మించి ఇస్తామంటున్న నవభారతదేశం ఎప్పటికొస్తుందో అర్ధంగాకుండా ఉంది. ఫ్రంట్ కట్టింది మొదలు అది కూలిందాకా ఒకటే పోరు అన్నట్లుగా ఒకరినొకరు నిందించుకుంటున్నారు. బి.జె.
పి. జెండాలు
రెపరెపలాడుతున్న వేదిక మీద నేను చచ్చినా
ప్రసంగించనని వి. పి. సింగ్ మొరాయిస్తే అక్కడ బి.జె.పి వాళ్ళు జనతాదళ్ వాళ్ళు తన్నుకోబోయారు. రామజన్మ భూమికి శంకుస్థాపన చేసే సందర్భంలో బాబరీ మసీదు మీద ఎక్కడ చెయ్యి వేస్తారోనని
త్రిపాఠీతో పాటు సింగ్ కూడా అయోధ్యకు
వెళ్లినందుకు బి.జె.పి. వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్, బి.జె.పి ముఖాముఖిగా నిలబడ్డ చోట ఎవరికి ఓటెయ్యాలో తేల్చుకోవటం ప్రజలకే వదిలేస్తామని కమ్యూనిస్టులు
అన్నారు. ఇక బి.జె.పి నాయకుడు దత్తాత్రేయ తనలోని విసుగు దాచుకోలేక కాంగ్రెస్, కమ్యూనిస్టులు
ముఖాముఖిగా ఉన్న చోట బి.జె.పి వాళ్ళు ఇండిపెండెంట్లకు ఒట్లేస్తారని తేల్చి చెప్పాడు. ఒక వేళ నేషనల్ ఫ్రంట్ అధికారంలోకి వస్తే బి.జె.పి లేని ఫ్రంట్ నే మేము సమర్ధిస్తామని
నంబూద్రిపాద్ అన్నారు. ఎన్నికలకు ముందే ఫ్రంట్ పరిస్థితి తూట్లు మూసి, తూములు తెరిచినట్లయ్యింది.
కొన్ని చోట్ల ఒప్పందాలు కుదరక పోటీ అభ్యర్ధులు రంగంలో నిలిచారు.
తెంపుల తాళ్ళు, చిల్లుల కడవ అన్నట్లుగా ఫ్రంట్ పాపం అల్లాడి పోతున్నది. ఈ పరిస్థితి ముడుపుల కాంగ్రెస్ కు వరంగా పరిణమించింది. రెండువైపులా విషాదం ఆవరించిన ఓటరు ఎటు మొగ్గాలో
తేల్చుకోలేక సతమతమౌతున్నాడు.
తిన్నవాడికే
తిండి పెట్టటం, బోడిగుండు వాడికి తలక పోయటం చాలా తేలిక అనుకుని ఆయా పార్టీల వాళ్ళు పొత్తుల
స్థానాల్లో కాంగ్రెస్ కే ఓట్లు వేసి తమ
కచ్ఛ తీర్చుకుంటారేమోనని నాకు అనుమానంగా ఉంది.
సిద్ధాంతాలను గాలి కొదిలి, కాంగ్రెస్ ను ఓడించాలనే ఒంటి ధ్యేయంతో బి.జె.పి, తెలుగుదేశం లాంటి పార్టీలతోనైనా ఉభయ
కమ్యూనిస్టు పార్టీలు జతకట్టాయి గాని ఆ
రెండూ కలిసిపోలేదు. ఆ రెండూ ఇంకా శత్రువులుగానే వేరువేరుగా
ఉంటున్నాయి.
ఏమైనా
కమ్యూనిస్టుల పని ఈసారి తెడ్డునాకి వ్రతం చెడగొట్టుకున్నట్లుగా
ఉంది. అసలు వాళ్ళిద్దరూ అనైక్యంగా
ఉంటూ అందరి ఐక్యతను కోరుతున్నారు.
తాళిబొట్టు బలం వల్ల తలంబ్రాల దాకా బ్రతికాడు అన్నట్లుగా
ఈ వివిధ పార్టీల మిశ్రమం ఎన్నాళ్ళుంటుందో చూడాల్సిందే. అవినీతికి పుట్ట అయిన కాంగ్రెస్ ను ఓడించే
శక్తిగల పార్టీ ఏదైనా మరొకటి (ఇన్ని
కాదు – ఏదైనా ఒకే పార్టీ) తయారు కానంతవరకు పరిస్థితి ఇలానే ఉంటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి