ఇది కులం వేసిన కాటు
గీటురాయి 22-12-1989
చావు
తప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచిన అన్నను, తప్పనిసరై
తమ్ముళ్ళంతా ప్రతిపక్షనాయకునిగా ఎన్నుకున్నారు. కొందరైతే అన్న చేతులు పట్టుకుని ఈ ఘోరపరాజయం పట్ల భోరున
విలపించారు. అన్న కూడా ఆలోచించాడు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా ప్రజలు తనకు ఎందుకు విముఖులయ్యారో అర్ధం
కావడం లేదని ఆవేదన చెందాడు. నన్ను పోగొట్టుకొని దేశం ఎంతో నష్టపోయిందే అని బాధపడ్డాడు. సరే ఈ
బాధ తరువాత పడుదురు గానీ ముందు ఆత్మ పరిశీలన చేసుకోండి అని తొందర చేశారు తమ్ముళ్ళు. ఎంత చేసుకుంటే మాత్రం ఏం తేలుతుంది హెల్మెట్లు
తప్ప. అవే నా కొంప ముంచాయి అన్నాడు. ఇంకా ఆలోచన చేసి చూడండి అన్నారు తమ్ముళ్ళు. ఇది కులం వేసిన కాటు అన్నాడు. ఇంకా ఏమన్నా కారణాలున్నాయా అని పత్రికల వాళ్లడిగితే
ఉన్నాయి గాని చెప్పను అన్నాడు. మొత్తం మీద
కనుకున్నాడోయ్ కంబట్లో వెంట్రుకలు అన్నట్లుగా
తన లోపాలేమిటో చాలా వరకు తెలుసుకున్నాడు. తెలుసుకున్నదే తడవుగా “పొరపాట్లు
చేయడం మానవ సహజం. అయితే వాటిని
సరిదిద్దుకోవడం మానవ ధర్మం” అనే సూక్తిని ఉటంకించాడు.
కాని
ఈ అయ్య పొరపాట్లు చెయ్యటం, సరిదిద్దుకోవటం పదవిలో ఉండగానే ఎన్నిసార్లు జరిగిందో వేరే చెప్పాలా ? తీటగలవాడికీ, తోటగలవాడికీ తీరిక
ఉండదన్నట్లు ఎప్పుడూ ఏదో ఒకదాన్ని గీకటం, అది పెద్ద
గోలకావటం, తరువాత విపరీతమైన నిష్టూరవేదన నటిస్తూ ఆ పని విరమించుకోవటాలతో ఏడేళ్ళ కాలం గడిచింది తప్ప ఏ రంగంలోను అభివృద్ధి
సాధించ లేదు. ఈ మధ్య చెన్నారెడ్డి గారి ఫోటోతో నూతన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు మచ్చుకు కొన్ని అంటూ 17 అంశాల ప్రకటన పేపర్లలో వచ్చింది. “తెలుగు
సమాచారం” అందులో టి. యస్. అనే ఇంగ్లీషు అక్షరాల్లోకి మారిపోయింది. రామారావు గారు ఈ 17 అంశాలు చదివితే తన పోరపాట్లు అర్ధమవుతాయని కొంతమంది
చెప్పారు. కానీ పేపర్లు చదివే అలవాటే
అన్నకు లేదని ఒక అపవాదు ఉంది. మరి ఇదే నిజమయితే
జనఘోష ఆయనకేలా తెలుస్తుంది ? పెళ్లినాటి పప్పుకూడు రోజూ రమ్మంటే వస్తుందా ? కాంగ్రెస్ పావులాటల పాలనలో విసిగిపోయిన జనం
ఆనాడు తెలుగుదేశాన్ని గెలిపించారు. అదంతా తన అభిమాన సంఘాల బలమే తప్ప మరొకటి కాదనే నిబ్బరంతో ఆయన ఎవరినీ లెక్క చేయలేదు. ఒక్కొక్కరినీ పీకి పారేసి మీ దిక్కున్న కాడ చెప్పుకోండి పోండి అని హుంకరించాడు.
ఢిల్లీ అధిష్టాన వర్గం పాదాల
దగ్గర పడి ఉన్న తెలుగు ఆత్మాభిమానాన్ని
తిరిగి రాష్ట్రానికి తెస్తానని పలికిన వీరాలాపాలు విని ఆరంభశూరత్వంతో జనం ఒట్లేశారు. భాష, ప్రాంత ప్రయోజనాల గురించి జనంలో చైతన్యం
వచ్చింది. కాకీ గుడ్డలతో క్రమశిక్షణ గల నాయకుడిలా ఊరూరూ తిరిగిన మనిషి, అధికారం చేపట్టగానే కాషాయం కట్టి, కోకలు కట్టి, కమ్మలు పెట్టి, తలపాగాలు చుట్టి, హరిజన వాడల్లో గవర్నమెంటు సొమ్ముతో రామాలయాలు కట్టిస్తానని, విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వ ధనంతో
వెంకటేశ్వర స్వామి బొమ్మలు ముద్రించిన బంగారు నాణాలు పట్టుకెళతానని... ఇలా ఎన్నెన్నో నిరుపయోగమైన పనులు చేశాడు. కోట్ల రూపాయలు రాళ్ళు రప్పల
మీద తగలేశాడు. ఇవన్నీ కొన్ని మతాల వారికి కోపం
తెప్పించాయి. ముఖ్యంగా మైనారిటీ మతాల వారు స్థాపించుకున్న వైద్య కళాశాలల మీద కక్షగట్టాడు. తెలుగు భాష అభివృద్ధి
కోసం తీసుకున్న చర్యలు శూన్యం. కొత్తగా ఒక్క కోడ్ నైనా తెలుగులోకి మార్చలేదు.
హంగులు అమర్చకుండా హుంకరింపులతో పనులు అవుతాయా
? తెలుగుదేశం పాలనలో జీవోలన్నీ
ఇంగ్లీషులీనే వచ్చాయి. విద్యుచ్చక్తి
, పరిశ్రమలు విస్తరించకపోగా, నిరుద్యోగం ప్రబలి యువకులో నిరాశ నిస్పృహలు ఆవరించాయి. కుల యుద్ధాలు
తారస్థాయికి చేరాయి. రెండు రూపాయల బియ్యం లాంటివి నిరుపేదలకు మేలు చేసినప్పటికీ ఆయన పనులు గోవును చంపి గోరోజనం దానం చేసినట్లున్నాయి. ఇంకా చెప్పాలంటే గోచీ
విప్పి పాగా చుట్టినట్లున్నాయి. వీటన్నిటినీ అన్నగారు గ్రహించాలి.
కరణాలు,
మునసబులను తీసేయటం, మండలాల స్థాపన, పెల్లెటూళ్లలో
పక్కా
ఇళ్ల నిర్మాణం ప్రజలకు ఎంతో మేలు చేశాయి. అయితే తగిన
హంగులు సమకూర్చి వాటిని పటిష్టం చేయకపోవటం వల్ల ప్రజలు కొన్ని
అవస్థల పాలయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మండలాలను రద్దు చేయాలనే తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంది.
తెలుగుదేశం చేసిన మంచిపనుల్ని కూడా
కాంగ్రెస్ త్వరలో గెలికి చెడగొట్టే అవకాశం ఉంది. బాధ్యత గల ప్రతిపక్షనాయకుడిగా ఉంటానని అన్న
చెప్పాడు గనుక, 42 శాతం ఓటర్ల మద్దతు ఇంకా
ఆయన పార్టీకి ఉంది గనుక, తన గత
ప్రవర్తన పట్ల ప్రజలకు (దేవుళ్ళకు) క్షమాపణ చెప్పి అభివృద్ధిని కాంక్షించే కొత్త మనసుతో ఆయన భవిష్యత్తుకు
బాటలు వేసుకోగలరని ఆశిద్దాం !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి